Steve Jobs: చాట్‌జీపీటీ గురించి స్టీవ్‌ జాబ్స్‌ 1985లోనే చెప్పారా?

యాపిల్‌ సహ- వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌కు టెక్నాలజీపై ఉండే దూరదృష్టిని రుజువు చేసే మరో సంఘటన తెరపైకి వచ్చింది. గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Updated : 29 Dec 2022 21:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs).. టెక్‌ ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన ప్రపంచానికి టెక్నాలజీ రుచి చూపించారు. కంప్యూటర్లు ప్రాథమిక దశలో ఉన్న సమయంలోనే అవి సృష్టించబోయే అద్భుతాలను కళ్లకు కట్టినట్లు చెప్పిన దార్శనికుడు. ఇప్పుడు మనం కంప్యూటర్‌ను ఎంత విరివిగా వినియోగిస్తున్నామో.. దాన్ని ఆయన 1980ల్లోనే ఊహించగలిగారు. సాంకేతికంగా కీలక మార్పులు వచ్చిన ప్రతిసారీ.. స్టీవ్‌ జాబ్స్‌ చెప్పిన ఆనాటి అంచనాలు తెరపైకి వస్తుంటాయి. అవి ఆయన దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి.

ఇటీవల చాట్‌జీపీటీ (ChatGPT) పేరు టెక్నాలజీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న పదం. గూగుల్‌కు సైతం గుబులు రేకెత్తిస్తున్న ఈ అత్యాధునిక సాంకేతికత గురించి ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇలాంటి సాంకేతికత భవిష్యత్తులో వస్తుందని స్టీవ్‌ జాబ్స్‌ 1985లోనే అంచనా వేశారు. అప్పట్లో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ప్రయోగదశలో ఉన్న చాట్‌జీపీటీ పనితీరుకు అతికినట్లు సరిపోతాయి. ఈ విషయాన్ని సోలియో అనే ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ‘‘చాట్‌జీపీటీ వాడిన ప్రతిసారీ.. స్టీవ్‌జాబ్స్‌ ఈ సాంకేతికత గురించి వివరించిన తీరే గుర్తుకొస్తోంది’’ అని క్యాప్షన్‌ ఇవ్వడంతో యూజర్లను ఈ ట్వీట్‌ మరింత ఆకర్షిస్తోంది.

ఇదీ చదవండి: ఏంటీ చాట్‌జీపీటీ? గూగుల్‌కు ఎందుకు అంత గుబులు?

కంప్యూటర్లు తీసుకురాబోతున్న విప్లవాన్ని స్టీవ్‌ జాబ్స్‌ ఆ ఇంటర్వ్యూలో చక్కగా వివరించారు. కంప్యూటర్లు మనుషుల ఆలోచనల్లోని నాణ్యతను సైతం ప్రభావితం చేస్తాయని ధీమాగా చెప్పారు. మానవుడి ఆలోచన, అనుభవంలోని అంతరార్థాన్ని సైతం పసిగట్టగలవని.. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలవని అప్పట్లోనే కచ్చితంగా చెప్పగలిగారు. వర్చువల్‌ రియాలిటీ యాప్‌లలో వాడుతున్న ‘న్యూరల్‌ ప్లాస్టిసిటీ’.. స్టీవ్‌ చెప్పిన ‘ఆలోచనల నాణ్యత’ అంచనాలకు నిదర్శనమని సోలియో గుర్తుచేశారు. మనుషుల అనుభవాలు, ఉద్దేశాలను రచనలు, చిత్రకళ కంటే సమర్థంగా ‘వర్చువల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ కళ్లకు కడుతుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు