Homebuyers: ట్విన్‌ టవర్స్‌ పరిస్థితి రావొద్దంటే.. ఇల్లు కొనే ముందు ఇవన్నీ చూసుకోండి!

నోయిడాలో జంట భవనాల కూల్చివేత పరిస్థితి రావొద్దంటే..ఇళ్లు కొనేముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. 

Updated : 01 Sep 2022 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల నోయిడాలో జంట భవనాల కూల్చివేతను యావత్తు దేశం ఆసక్తిగా తిలకించింది. భారీ ఖర్చుతో నిర్మించినప్పటికీ.. వీటిని కూల్చివేయాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పలేదు. నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్న బలమైన సందేశాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రజల్లోకి తీసుకెళ్లింది. అందుకే ఎవరైనా ఇల్లు లేదా ఏదైనా ఆస్తి కొనేముందు అనుమతుల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన కళ్లకు కట్టింది. లేదంటే తర్వాత ఇబ్బందుల్లో చిక్కుకోక తప్పదు!  ట్విన్‌ టవర్స్‌ విషయంలో జరిగిన తప్పులేంటి.. మనం ఇల్లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం..!

కీలక ఉల్లంఘనలివే..

నోయిడా జంట భవనాల నిర్మాణ ప్రణాళికను సూపర్‌టెక్‌ సంస్థ పలుసార్లు సవరించింది. ప్రతిసారీ కొత్తగా మరిన్ని అంతస్తులను చేరుస్తూ పోయింది. నోయిడా భవన నిర్మాణ నిబంధనల ప్రకారం.. భారీ భవంతులను నిర్మించే ముందు వాటి మధ్య నిర్దేశిత దూరాన్ని పాటించాలి. ఇది భవంతుల ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. కూల్చివేసిన జంట భవనాల విషయంలో మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించి చాలా దగ్గరగా నిర్మించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అపార్ట్‌మెంట్‌ చట్టాన్ని సైతం ఉల్లంఘించారు. ఒకసారి ప్రాజెక్టులోని ఇళ్లను విక్రయించిన తర్వాత.. దాని నిర్మాణ ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కొనుగోలుదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. వాస్తవానికి ప్రాజెక్టు తొలి ప్రణాళిక ప్రకారం.. జంట భవనాలు నిర్మించిన ప్రదేశంలో సూపర్‌టెక్‌ ‘గ్రీన్‌ ఏరియా’ను అభివృద్ధి చేయాలి. దానికి విరుద్ధంగా ఆ స్థలంలో మరో రెండు భారీ భవంతులను నిర్మించాలని నిర్ణయించడంతో స్థానికులు న్యాయపోరాటానికి దిగి విజయం సాధించారు.

అనుమతులున్నా.. ఉల్లంఘన కావొచ్చు..

ఆమోదం పొందిన ప్రతి నిర్మాణ ప్రణాళికా ఉల్లంఘనీయం కాదని చెప్పడానికి వీల్లేదని జంట భవనాల కూల్చివేత తెరపైకి తెచ్చిన మరో నగ్నసత్యం. వాస్తవానికి ఆ రెండు భవంతుల నిర్మాణ ప్రణాళికకు ప్రభుత్వ అనుమతి ఉంది. అందుకే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ.. ఇంటి కొనుగోలుదారులకు 100 శాతం రక్షణ లభిస్తుందన్న హామీ లేదని తాజా ఉదంతం గుర్తుచేస్తోంది. బిల్డర్‌ తాము నిర్మించబోయే భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబితే.. సంతృప్తి చెందడం సమంజసం కాదు! మీరు కూడా మీ సొంతంగా తనిఖీ చేసుకొన్న తర్వాతే ముందుకు  వెళ్లడం మేలు.

అవసరమైతే సాయం తీసుకోండి..!

నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులో ఇల్లు కొనేముందు వీలైతే గుర్తింపు పొందిన స్థిరాస్తి సంస్థ నుంచి ఓ కన్సల్టెంట్‌ను నియమించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదా ఈ రంగంలో అనుభవం ఉన్న ఓ న్యాయవాదినైనా సంప్రదించడం మేలని అంటున్నారు. ఇది నిజానికి అదనపు ఖర్చే. కానీ, ఖరీదైన ఇల్లు కొనేముందు జాగ్రత్త కోసం ఈ మాత్రం ఖర్చు చేయడంలో తప్పులేదు మరి!

భవంతిని నిర్మిస్తున్న స్థలం నుంచి మీ తనిఖీని ప్రారంభించాలి. భవన నిర్మాణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా ఉందేమో చూసుకోవాలి. ఈ రెండు సందర్భాల్లోనే పూర్తి నిర్మాణాన్ని నేలమట్టం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వివిధ శాఖల నుంచి లభించాల్సిన అనుమతులు వచ్చాయా? లేదా? చెక్‌ చేసుకోవాలి.  భవంతి ఎత్తుకు ఏవియేషన్‌ విభాగం అనుమతి తప్పనిసరి. విద్యుత్తు, నీటి సరఫరా, పర్యావరణ క్లియరెన్సూ ఉండాలి. ఒకవేళ అనుమతులు ఉన్నా.. వాటికి ఏమైనా షరతులు ఉన్నాయేమో చూసుకోవాలి.

డెవలపర్‌ చరిత్ర..

డెవలపర్‌ గత చరిత్ర ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి. గతంలో ఇళ్లను సకాలంలో కొనుగోలుదారులకు అందించారా? లేదా? ఆరా తీయాలి. కేవలం ప్రభుత్వ అనుమతులకే పరిమితం కాకుండా ఇప్పటికే వారి దగ్గర కొనుగోలు చేసినవారి నుంచీ వివరాలు తెలుసుకోవాలి. అన్నీ ఓకే అనుకొన్న తర్వాత చివరగా ప్రాజెక్టును ‘స్థిరాస్తి నియంత్రణా ప్రాధికార సంస్థ (RERA)’ వద్ద నమోదైందో? లేదో? చూసుకోవాలి. ఒకవేళ చెల్లింపు చేసిన తర్వాత ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే ‘రెరా’కు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చు. 

కరోనా తర్వాత స్థిరాస్తి వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో ఎక్కడ అవకాశాన్ని కోల్పోతామో అన్న భావనలో చాలా మంది ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపార కోణంలో ఆలోచించి తర్వాత ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చన్న ఉద్దేశంతో అనుమతులు లేని ఇళ్లనూ కొంటున్నారు. అందుకే కొనేముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని