Pre-Owned Car: పాత కారు కొంటున్నారా? ఇవన్నీ చూశాకే..!

చాలా మంది వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. కొందరు కొత్త వాహనం కొంటే.. మరికొందరు పాత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మరి పాత వాహనాలను కొనేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలేంటో చూద్దాం...

Updated : 23 Aug 2022 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు. స్తోమత ఉన్నవాళ్లు కొత్త కారు కొంటే.. లేనివాళ్లు సెకండ్‌హ్యాండ్‌ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, కొత్త వాహనాన్ని కొంటే దాన్ని పెద్దగా పరిశీలించాల్సిన అవసరం లేదు. గ్యారెంటీలు, ఉచిత సర్వీసింగ్‌లు కూడా ఉంటాయి. అదే మరి పాతబండిని కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం...

సర్వీసు రికార్డు, పత్రాలు: రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, బీమా పాలసీ, కార్‌ ఇన్‌వాయిస్‌ వంటి అన్ని అవసరమైన పత్రాలను తనిఖీ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా సర్వీసు రికార్డుపై ఓ కన్నేయాలి. దీని ద్వారా క్రమం తప్పకుండా వాహనానికి సర్వీసింగ్‌ చేయించారా, లేదా తెలుస్తుంది. అంతేకాకుండా.. మెకానికల్‌ భాగాలు మార్చారా లేదంటే పెద్ద మరమ్మతు ఏదైనా జరిగిందా అనేదీ బయటపడుతుంది.

తయారీ తేదీ: కారులో విండ్‌షీల్డ్‌ సహా ప్రతీ గ్లాస్‌పైన తయారీ ఏడాది, నెల ముద్రించి ఉంటుంది. అన్ని అద్దాలపై ఒకే తేదీ ఉంటే సరే. వేర్వేరు ఉంటే అద్దాలు మార్చారనీ, ప్రమాదం జరిగిందని గ్రహించాలి. డాష్‌బోర్డులో కనిపించే డ్యామేజీ ఏదైనా ఉందేమో చెక్‌ చేయాలి. దీన్ని బట్టే కారును సదరు యజమాని ఎంత బాగా నిర్వహిస్తున్నారో తెలుస్తుంది. హుడ్‌ను పైకెత్తి ఇంజిన్‌ బ్లాక్‌ను చెక్‌ చేయాలి. ఆయిల్‌ లీకేజీ ఏమైనా ఉందేమో గమనించాలి. కనిపించే లోహ భాగాలకు ఏమైనా తుప్పు పట్టిందా అని కూడా చూడాలి. కారులోని అన్ని ఎలక్ట్రిక్‌ భాగాలను పరీక్షించాలి. ముఖ్యంగా ఏసీ, పవర్‌ విండోలు, హెచ్‌వీఏసీ సిస్టమ్‌ను అడ్జస్ట్‌ చేస్తూ వేర్వేరు సెట్టింగ్స్‌లో సరిగా పనిచేస్తుందో లేదో చూడొచ్చు. మ్యూజిక్‌ సిస్టమ్‌కు సంబంధించి స్టీరింగ్‌పై ఉండే కంట్రోల్స్‌ను సరిచూడాలి.

ఎక్స్‌టీరియర్‌: వాహనం హుడ్‌, మిర్రర్లు, గ్రిల్‌, బానెట్‌, బంపర్‌, డోర్లు, విండ్‌షీల్డ్‌, బూట్‌.. ఇలా ప్రతిదీ క్షుణ్నంగా పరిశీలించాలి. డెంట్లు, తుప్పు పట్టడం, గీతలు పడటం ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే బేరం ఆడొచ్చు. బానెట్‌ తెరిచి హోసెస్‌, బెల్టులు, ఏసీ కాయిల్‌, రేడియేటర్‌, బ్యాటరీ, ఫ్యాన్‌ సరిగా పనిచేస్తున్నాయో లేదో గమనించాలి. వీటిలో ఏది చెడిపోయినా ఖర్చు ఎక్కువ అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యం ఇంజిన్‌. దీని పనితీరు ఎలా ఉందో తెలియాలంటే తప్పనిసరిగా బండిని నడిపి చూడాలి. గేర్లు మార్చినప్పుడు, బ్రేక్‌లు వేసినప్పుడు, మూలమలుపుల్లో ఇంజిన్‌ నుంచి శబ్దాలు వస్తుంటే సమస్య ఉందని తెలుసుకోవచ్చు. న్యూట్రల్‌ గేరులో ఒకట్రెండు నిమిషాలు ఉంచినప్పుడు ఏవైనా వైబ్రేషన్లు, శబ్దాలు వస్తున్నా లోపం ఉందని అర్థం. యాక్సిలరేటర్‌, క్లచ్‌లు, బ్రేక్‌లు, బ్రేక్‌ పెడళ్లూ ఇవన్నీ చూడాలి.

మైలేజీ: లీటర్‌ ఇంధనంతో సగటున ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో కూడా చూసుకోవాలి. కనీసం ఒక 15 కి.మీ నడిపితే.. మైలేజీపై ఓ అవగాహన వస్తుంది. అలాగే బండి కొని ఎన్నేళ్లవుతుందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మరీ పాతదైతే.. విడి భాగాలు దొరకడం కష్టం. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తే వెంట తెలిసిన మెకానిక్‌ను తీసుకెళ్లడం ఉత్తమం. మీరు కొంటున్న వాహనం ధర మార్కెట్‌లో ఎంత పలుకుతుందో చూసుకోవాలి. ఆన్‌లైన్‌లో కాస్త వెతికితే.. మీరు కొనబోయే బండికి ఎంత వరకు చెల్లించొచ్చన్నది ఒక అవగాహన వస్తుంది.

పెయింట్‌: కారుపై చిన్న డెంట్లు, స్క్రాచ్‌లు ఉంటే పెద్ద పట్టించుకోనవసరం లేదు. ఏదైనా భాగానికి రీపెయింట్‌ వేశారేమో చూడాలి. బంపర్లకు మళ్లీ పెయింట్‌ వేస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ, లోహ భాగాలకు రీపెయింట్ వేస్తే దానికి పెద్ద ప్రమాదం జరిగిందని అర్థం. అలాగే తుప్పును దాచడానికీ అలా చేసి ఉండొచ్చు. టైర్లు సైతం కారు పరిస్థితేంటో చెబుతాయి. చౌక టైర్లు ఉంటే ఆ వాహనం జోలికి వెళ్లొద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని