LIC IPO: రేపే ఎల్‌ఐసీ ఐపీఓ షేర్ల కేటాయింపు.. స్టేటస్‌ ఇలా తెలుసుకోండి!

ఎల్‌ఐపీ ఐపీఓ షేర్ల కేటాయింపు రేపు (గురువారం, మే 12) జరగనుంది.....

Updated : 11 May 2022 15:57 IST

ముంబయి: ఎల్‌ఐపీ ఐపీఓ షేర్ల కేటాయింపు (LIC IPO Sahre Allotment) రేపు (గురువారం, మే 12) జరగనుంది. రూ.21,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా మే 4న ప్రారంభమైన ఈ పబ్లిక్‌ ఇష్యూ (Public issue) 9న ముగిసిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 2.95 రెట్ల షేర్లకు స్పందన లభించింది.

దరఖాస్తు చేసుకున్న వారిలో షేర్ల కేటాయింపు జరగనివారికి మే 13న డబ్బులు ఖాతాలో జమ కానున్నాయి. ఏఎస్‌బీఏ ఖాతా ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి నిధులు కూడా అదే రోజు అన్‌బ్లాక్‌ అవుతాయి. అనంతరం షేర్లు మే 16న డీమ్యాట్‌ ఖాతాలకు బదిలీ అవుతాయి. బీఎస్‌ఈ లేదా కెఫిన్‌ టెక్నాలజీస్‌ వెబ్‌సైట్లలో షేర్ల కేటాయింపు స్థితిని తెలుసుకోవచ్చు. ఎల్‌ఐసీ ఐపీఓ షేర్ల కేటాయింపు, డబ్బుల రీఫండ్‌ బాధ్యత కెఫిన్‌ టెక్‌దే. ఇది సెబీ నమోదిత సంస్థ.

బీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ తెలుసుకోండిలా..

* bseindia.com/investors/appli_check.aspx లింక్‌ను ఉపయోగించి బీఎస్‌ఈ సైట్‌లోకి వెళ్లండి

* ఐపీఓ పేరు అని ఉన్న దగ్గర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ను ఎంపిక చేసుకోండి

* ఐపీఓ అప్లికేషన్‌ నెంబరును ఎంటర్‌ చేయండి

* లేదా పాన్‌ కార్డు వివరాలు ఇచ్చినా సరిపోతుంది.

* ‘ఐయామ్‌ నాట్‌ ఏ రోబో’పై క్లిక్‌ చేయండి

* సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే వివరాలు మీ ముందుంటాయి

కెఫిన్‌టెక్‌ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు తెలుసుకోండిలా..

* https://ris.kfintech.com/ipostatus/ipos.aspx లింక్‌ ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాలి

* డ్రాప్‌డౌన్‌ జాబితా నుంచి ఎల్‌ఐసీ ఐపీఓని ఎంపిక చేసుకోవాలి

* డీపీఐడీ, అప్లికేషన్‌ ఐడీ, క్లైంట్‌ ఐడీ, పాన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి

* దరఖాస్తు సంఖ్య తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి

* సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే వివరాలు మీ ముందుంటాయి

ఎల్‌ఐసీ (LIC) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) దరఖాస్తు గడువు మే 9న ముగిసింది. 16.20 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూకు కేటాయించగా.. మొత్తం 2.95 రెట్లు స్పందన లభించింది. 16.20 కోట్ల షేర్లకు గానూ 47.83 కోట్ల బిడ్లు దాఖలైనట్లు ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలిసింది. అత్యధికంగా పాలసీ హోల్డర్ల కేటగిరీలో 6.11 రెట్ల బిడ్లు దాఖలవ్వగా.. కనిష్ఠంగా రిటైల్‌ కోటాలో 1.99 రెట్ల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన సోమవారంతో అన్ని విభాగాల్లో షేర్లకు పూర్తి స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత మదుపర్ల (QIB) విభాగంలో 2.83 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల (NII) విభాగంలో 2.91 రెట్లు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగంలో 1.99, ఉద్యోగుల కోటాలో 4.40, పాలసీ హోల్డర్ల కోటాలో 6.12 రెట్లు చొప్పున బిడ్లు దాఖలయ్యాయి.

ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.902-949గా ఎల్‌ఐసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేసింది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల (0.35%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.60 రాయితీ సైతం ఇచ్చింది. తమ ఉద్యోగుల కోసం కూడా ఎల్‌ఐసీ ప్రత్యేకంగా 15.81 లక్షల (0.025%) షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేరుపై రూ.45 రాయితీ దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని