పిల్ల‌ల ఆర్థిక భ‌రోసాకు ఓ పాల‌సీ

పిల్ల‌ల భ‌విష్య‌త్తు దృష్ట్యా రూపొందించినవి పిల్ల‌ల పాల‌సీలు. త‌ల్లిదండ్రులారా! వీటిని ఓసారి ప‌రిశీలించండి

Published : 19 Dec 2020 13:05 IST

పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు వివిధ పొదుపు పథకాల్లో మదుపు చేస్తూ ఉంటారు. పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలు వంటి వాటికి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. బీమా కంపెనీలు ఈ అవసరాలకు అనుగుణంగా పిల్లల బీమా పాలసీలను రూపొందిస్తున్నాయి. అనుకోకుండా పాలసీదారుడికి ఏదైనా జరిగినా బీమా కవరేజీతో పాటు పిల్లల ఆర్థిక అవసరాలను ఈ పాల‌సీల ద్వారా తీర్చవచ్చు.

పాలసీదారుడికి ఆకస్మికంగా ఏదైనా జరిగితే, పిల్లలకు బీమా హామీ మొత్తం చెల్లించడంతో పాటు భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలను రద్దు చేస్తారు. పాలసీ కాలపరిమితి ముగిసిన వెంటనే బోనస్‌లు, అదనపు ప్రయోజనాలను చెల్లిస్తారు. పాలసీదారుడు పాలసీ కాలపరిమితి ముగిసే వరకూ సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా ఉంటే బీమా హామీ మొత్తం, అదనపు ప్రయోజనాలను కల్పిస్తారు.

ప్రయోజనాలు:

  1. పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసాను కల్పించవచ్చు

  2. ఉన్నత విద్య, వివాహం వంటి కీలక సమయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడొచ్చు

అర్హతలు:

పాలసీదారుడి కనిష్ఠ వయసు:18 ఏళ్లు గరిష్ఠ వయసు:65 ఏళ్లు
పిల్లల కనిష్ఠ వయసు:30 రోజులు గరిష్ఠ వయసు:13 ఏళ్లు

పాలసీ కాలపరిమితి:

కనిష్ఠం: 10 సంవత్సరాలు గరిష్ఠం:23 సంవత్సరాలు

ప్రీమియం కాలపరిమితి:

కనిష్ఠం: 5 సంవత్సరాలు గరిష్ఠం: 12 సంవత్సరాలు
మొత్తం ఒకేసారి ప్రీమియం చెల్లించే పాలసీలు సైతం అందుబాటులో ఉన్నాయి.
మనం తీసుకునే పాలసీని బట్టి ప్రీమియంను చెల్లించే కాలపరిమితి ఆధారపడి ఉంటుంది.

బీమా హామీ మొత్తం:

కనిష్ఠంగా రూ. లక్ష మొదలుకొని గరిష్ఠంగా రూ. కోటి వరకూ బీమా హామీ మొత్తం గల పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

మెచ్యూరిటీ:

పాలసీదారుడి కనిష్ఠ వయసు:25 గరిష్ఠ వయసు:70/75
పిల్లల కనిష్ఠ వయసు:18 గరిష్ఠ వయసు:28

ప్రీమియం చెల్లింపు:

సింగిల్‌ ప్రీమియం చెల్లించే పాలసీలను సైతం పలు కంపెనీలు ప్రవేశపెట్టాయి.
సాధారణంగా ప్రతి నెలా (లేదా) మూడు నెలలకు ఒకసారి (లేదా) ఆరునెలలకు ఒకసారి (లేదా) సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించేందుకు వీలుంది.

గ్రేస్‌ పీరియడ్‌:

నెలవారీ చెల్లింపులు చేసే పథకాల్లో ప్రీమియం చెల్లించేందుకు ఆలస్యమైతే 15 రోజులు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది.
మిగిలిన వాటిలో 30 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు:

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 80(సీ), 10(10డీ) సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి.
ఇతర వివరాల కోసం పాలసీ పత్రాన్ని క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.

పాలసీని ఎంచుకునేటప్పుడు పిల్లల అవసరాలను అన్నింటినీ ఒకచోట రాసి విశ్లేషించుకోవాలి. అన్నింటినీ కలిపి లెక్కించి భవిష్యత్తులో ద్రవోల్బణం దృష్ట్యా ఎంత మొత్తం కావాలో నిర్ధారించుకోవాలి. అందుకు అనుగుణమైన పాలసీని, బీమా హామీ మొత్తాన్ని ఎంచుకోవాలి. పాలసీని సాధ్యమైనంత వరకూ పిల్లల పేరు మీద తీసుకుంటే మంచిది. మనకు తీవ్ర అనారోగ్యం సంభవించినా, ఆకస్మికంగా ఏదైనా జరిగినా పిల్లలకు బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. జీవితం అనిశ్చితితో కూడుకున్నది. పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తమ పాలసీని ఎంచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని