Adani group: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా హస్తం?

అదానీ గ్రూప్‌ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది.

Published : 06 Jul 2024 02:25 IST

 సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ ఆరోపణలు

దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీలపై గతేడాది అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన ఉదంతం కొత్త మలుపులు తీసుకుంటోంది. హిండెన్‌బర్గ్‌ సదరు నివేదిక రూపొందించేలా, చైనాతో సంబంధమున్న ఒక వ్యాపారవేత్త చర్యలు తీసుకున్నారని.. సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ ఆరోపించారు. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఒక నివేదిక రూపొందించాలంటూ, న్యూయార్క్‌ హెడ్జ్‌ ఫండ్‌ అయిన కింగ్డన్‌ క్యాపిటల్‌కు చెందిన మార్క్‌ కింగ్డన్‌ అనే అమెరికా వ్యాపారవేత్త.. హిండెన్‌బర్గ్‌కు బాధ్యత అప్పగించినట్లు జెఠ్మలానీ తెలిపారు. విదేశీ పోర్ట్‌ఫోలియో సంస్థ కింగ్డన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్, అనుబంధ సంస్థలు కలిసి.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లలో పరోక్షంగా ట్రేడింగ్‌ చేసేందుకు హిండెన్‌బర్గ్‌కు సహకరించాయని ఈ వారం మొదట్లో మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా చైనా బిడ్లకు పోటీగా వెళ్లిన అదానీ సంస్థలు కొన్నింటిని చేజిక్కించుకోవడం వల్లే, అదానీ గ్రూప్‌పై చైనా దృష్టి పెట్టిందనీ జెఠ్మలానీ ఎక్స్‌ పోస్టులో వివరించారు. 

ఆరోపణలు ఇవీ: మహేశ్‌ జెఠ్మలానీ ప్రకారం.. ‘కోటక్‌ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ (కేఎమ్‌ఐఎల్‌)ను కింగ్డన్‌ సంప్రదించారు. ఒక ఆఫ్‌షోర్‌ ఫండ్‌ను సృష్టించడంతో పాటు, అదానీ షేర్లలో ఆఫ్‌షోర్‌ ఖాతాల ద్వారా ట్రేడింగ్‌ జరిపించారు. ఇందు కోసం కోటక్‌ ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్‌(కేఐఓఎఫ్‌)ను ఏర్పాటు చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడక ముందే, మారిషస్‌ మార్గంలో ఈ ఫండ్‌ అదానీ గ్రూప్‌ షేర్లలో షార్ట్‌ పొజిషన్లు తీసుకుంది. ఇందు కోసం ‘కింగ్డన్‌ మాస్టర్‌ఫండ్‌’ నుంచి 40 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.332 కోట్ల)ను పొందింది. కింగ్డన్‌ భార్య అన్లా చెంగ్‌ ఒక చైనీస్‌-అమెరికన్‌. కింగ్డన్‌ మాస్టర్‌ఫండ్‌లో అతిపెద్ద వాటాదారు ఈమే. అమెరికాలో చైనా ప్రయోజనాలకు ఈమె ఒక లాబీయిస్టుగా పనిచేస్తుంటారు. ఈవిడ ‘సప్‌చైనా’ అనే చైనా అనుకూల మీడియా సంస్థలను నిర్వహించేవారు. అక్కడి కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధముందన్న ఆరోపణలతో అవి మూతపడ్డాయి.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు