China: అసలు చైనా లక్ష్యమేంటి?

గత వారాంతంలో ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించిన ఎడ్యుటెక్ సంస్థలపై చైనా ఆంక్షలు ప్రకటించింది. ఎడ్యుటెక్‌ సంస్థల్ని లాభాపేక్ష లేని సంస్థలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూకు వెళ్లొద్దని ఆదేశించింది...

Updated : 27 Jul 2021 15:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత వారాంతంలో ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించిన ఎడ్యుటెక్ సంస్థలపై చైనా ఆంక్షలు ప్రకటించింది. వీటిని లాభాపేక్ష లేని సంస్థలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూకు వెళ్లొద్దని ఆదేశించింది. విదేశీ సంస్థల నుంచి నిధులు స్వీకరించొద్దని స్పష్టం చేసింది. దీంతో ఎడ్యుటెక్‌ రంగంలో ఉన్న అనేక కంపెనీల షేర్లు సగటున 70 శాతానికి పైగా కుంగాయి. టీఏల్‌ ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ 59 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 4 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. గవోటు టెక్‌ఎడ్యు విలువ 38 బిలియన్‌ డాలర్ల నుంచి 780 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇలా 100 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యాపారం కాస్త 24 బిలియన్ డాలర్లకు చేరుకొంది.

అయితే, ఆన్‌లైన్‌ ఆధారిత, టెక్ కంపెనీలపై చైనా విరుచుకుపడడం ఇది తొలిసారేమీ కాదు. ఇప్పటికే అలీబాబాకు చెందిన యాంట్‌ గ్రూప్‌, సామాజిక మాధ్యమ సంస్థలున్న టెన్సెంట్‌, రైడ్‌ సేవలందించే దీదీ.. ఇలా ఆంక్షలకు బలైన జాబితాలో చాలా సంస్థలే ఉన్నాయి. వీటిపై వివిధ కారణాలతో ఆంక్షలు విధించారు. పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విదేశీ నిధుల సమీకరణను నిషేధించారు.

ఆంక్షలకు చట్టరూపం..

ఆంక్షల విధించడానికి చైనా చెబుతున్న కారణం దేశ భద్రత. పౌరుల రక్షణ. కానీ, దీనికి వెనుక అసలు కారణం వేరే ఉందన్నది విశ్లేషకుల వాదన. విదేశీ పెట్టుబడుల రాకతో చైనా పౌరుల సమాచారం దేశం దాటే ప్రమాదం ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) వాదిస్తోంది. అలాగే విదేశీ పెట్టుబడులు దేశంలోకి విరివిగా రావడం వల్ల ఇక్కడి కంపెనీల్లో వారి ఆధిపత్యం పెరుగుతుందని.. ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకొస్తోంది. ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందని చెబుతోంది. ఈ కారణాలు చూపి సంస్థలపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలే త్వరలో చట్టరూపం దాల్చే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ‘సైబర్‌ భద్రతా చట్టం’, ‘సమాచార భద్రతా చట్టం’, ‘వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం’.. రూపుదాల్చుతున్నట్లు సమాచారం.

ఎందుకు చేస్తోంది..?

దీనికి చైనా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. పైకి దేశ భద్రత, పౌరుల రక్షణ పేరు చెబుతున్నా.. లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనాలో క్రమంగా ప్రైవేటు వాణిజ్యం పెరిగిపోతోంది. యాంట్ గ్రూప్‌, టెన్సెంట్‌, అలీబాబా కంపెనీల సంయుక్త మార్కెట్‌ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్లు దాటిపోయింది. సీసీపీ ప్రభుత్వం అధీనంలో ఉండే బ్యాంక్‌ ఆఫ్‌ చైనా విలువతో పోలిస్తే ఇది ఎక్కువ. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని సీసీపీ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పార్టీలో ప్రైవేటు సాంకేతిక దిగ్గజాల ప్రభావం పెరుగుతోందని.. దీనిపై అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 

జాక్‌ మా, బైట్‌ డ్యాన్స్‌ సీఈఓ ఝాంగ్‌ యిమింగ్‌ వంటి కార్పొరేట్‌ లీడర్లకు చైనాలో ఆదరణ పెరిగింది. భవిష్యత్తులో ఇది సీసీపీ నాయకత్వం ప్రభావానికి ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట! ఇదే జరిగితే పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. అలాగే మీడియా, ఎడ్యుటెక్ సంస్థల వల్ల ప్రజల అభిప్రాయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని జిన్‌పింగ్‌ సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలీబాబాకు వాటాలున్న ప్రముఖ మీడియా సంస్థ ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’పై ఆంక్షలే అందుకు నిదర్శనం. పాఠ్యప్రణాళికల్లో మార్పుల వల్ల విద్యార్థుల ఆలోచనా విధానం మారే అవకాశం ఉందని పార్టీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

విదేశీ కంపెనీల పెట్టుబడుల వల్ల చైనా కంపెనీల్లో వారి ఆధిపత్యం పెరిగిపోయి సంస్కృతికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని జిన్‌పింగ్‌ సర్కార్‌ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పైగా చైనా వాణిజ్య వ్యూహాలు బహిర్గతమవుతాయన్న ఆందోళన కూడా ఉంది. ఇది ప్రత్యర్థులకు అనుకూలించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దన్నగా మారి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న చైనా లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని జిన్‌పింగ్‌ భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌కు లాభమేనా..?

మరోవైపు విదేశీ పెట్టుబడులను భారత ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. చైనా ఆంక్షల వల్ల అక్కడి సంస్థల్లోని పెట్టుబడులన్నీ ఇక్కడికి తరలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడి అంకుర సంస్థల సేవలు విశ్వవ్యాప్తమవుతున్న విషయం తెలిసిందే. అనేక కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు ఐపీఓకి వస్తున్నాయి. జొమాటో ఇప్పటికే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాగా.. పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌ సహా అనేక సంస్థలు వరుసలో ఉన్నాయి. బైజూస్‌ వంటి ఎడ్యుటెక్‌ సంస్థల సక్సెస్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి ప్రపంచవ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించేందుకు వివిధ సంస్థలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనా నుంచి తరలివెళ్లే పెట్టబడులన్నీ భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. పైగా తయారీ, డిజిటల్‌, ఫిన్‌టెక్‌ సంస్థలను ప్రభుత్వం సైతం ఆహ్వానిస్తోంది. ప్రోత్సాహకాలనూ ప్రకటిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని