Oppo India: ఒప్పో ₹4,389 కోట్ల దిగుమతి సుంకం ఎగవేత: డీఆర్‌ఐ

చైనాకు చెందిన ఓ మొబైల్‌ తయారీ కంపెనీ అనుబంధ సంస్థ ఒప్పో ఇండియా భారత్‌లో పలు ఆర్థిక అవకతవలకు పాల్పడ్డట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ గుర్తించింది....

Updated : 13 Jul 2022 20:38 IST


దిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ అనుబంధ సంస్థ ఒప్పో ఇండియా భారత్‌లో పలు ఆర్థిక అవకతవలకు పాల్పడ్డట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. సదరు సంస్థకు జులై 8న రూ.4,389 కోట్లు విలువ చేసే షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లో ఒప్పో, రియల్‌మీ పేరిట ఒప్పో ఇండియా మొబైళ్లను విక్రయిస్తోంది.

కొన్ని వస్తువుల దిగుమతులపై కేంద్రం కల్పిస్తున్న ప్రత్యేక మినహాయింపు ప్రయోజనాలను దుర్వినియోగం చేయడం ద్వారా ఒప్పో ఇండియా భారీ ఎత్తున లబ్ధి పొందిందని డీఆర్‌ఐ షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొంది. ఫలితంగా రూ.4,389 కోట్ల దిగుమతి సుంకాన్ని ఎగవేసినట్లు తెలిపింది. ఒప్పో ఇండియా కార్యాలయాలు, సంస్థకు చెందిన ఉన్నతోద్యోగుల నివాసాల్లో జరిపిన సోదాల్లో దీనికి సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే కొన్ని వస్తువులను పన్ను మినహాయింపు ఉన్న కేటగిరీలో తప్పుగా చూపించి రూ.2,981 కోట్ల లబ్ధి పొందినట్లు వివరించింది. 

రాయల్టీ, లైసెన్స్‌ ఫీజులకు సంబంధించిన నిబంధనల్ని ఉల్లఘించడం ద్వారా మరో రూ.1,408 కోట్ల ప్రయోజనం పొందినట్లు వెల్లడించింది. అయితే, ఒప్పో ఇండియా తాము చెల్లించిన దిగుమతి సుంకం తగ్గినట్లు పేర్కొని ముందుగానే రూ.450 కోట్లు డిపాజిట్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రూ.4,389 కోట్ల దిగుమతి సుంకాన్ని చెల్లించాలని కోరుతూ డీఆర్‌ఐ నోటీసులు జారీ చేసింది. పలు సెక్షన్లను ఉల్లంఘించినందుకుగానూ జరిమానాలనూ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని