సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌భుత్వం అందించే కొన్ని ఆక‌ర్ష‌ణీయ‌ ప‌థ‌కాలు

సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ సంప‌ద‌ను పెంచుకోవ‌డానికి వివిధ ర‌కాల పెట్టుబ‌డులు ఉన్నాయి.

Updated : 28 Oct 2021 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియ‌ర్ సిటిజ‌న్లకు త‌మ ఉద్యోగ విర‌మ‌ణ జీవితాన్ని ఆస్వాదించ‌డానికి వీలు క‌ల్పించే పెట్టుబ‌డి ప‌థ‌కాలు అవ‌స‌రం. వారు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుకు పెట్టుబ‌డులు అవ‌స‌రం. సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌మ సంప‌ద‌ను పెంచుకోవ‌డానికి వివిధ ర‌కాల పెట్టుబ‌డులు ఉన్నాయి. కొన్ని ప‌థ‌కాలు సాధార‌ణ నెల‌వారీ ఆదాయాన్ని అందిస్తాయి. మ‌రికొన్ని ప‌థ‌కాలు సంప‌దను సృష్టిస్తాయి. పెట్టుబ‌డి ఎంపిక పెట్టుబ‌డి ల‌క్ష్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. వీరికి ఉప‌యోగ‌ప‌డే కొన్ని ప‌థ‌కాలు దిగువ‌న ఉన్నాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్: ఎస్‌సీఎస్‌ఎస్‌ అనేది ప్ర‌భుత్వ మ‌ద్దతు కలిగిన ప‌ద‌వీ విర‌మ‌ణ పొదుపు ప‌థ‌కం. ఈ ప‌థ‌కం గ‌రిష్ఠ ప‌రిమితి రూ.15 ల‌క్ష‌లు లేదా ఉద్యోగ విర‌మ‌ణ ద్వారా ల‌భించిన మొత్తం.. ఏది త‌క్కువైతే అది. క‌నీసం రూ.1,000తో ఖాతా తెర‌వొచ్చు. 60 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తులు లేదా 55-60 ఏళ్ల‌లోపు వీఆర్ఎస్ (స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప‌థ‌కం)ను ఎంచుకున్న‌వారు 50 ఏళ్లు పైబ‌డిన ఉద్యోగ విర‌మ‌ణ ర‌క్ష‌ణ శాఖ సిబ్బంది ఈ ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కం 5 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. వినియోగ‌దారుల‌ కోరిక‌ మేర‌కు 3 ఏళ్లు పొడిగిస్తారు. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు ఏడాదికి 7.4 శాతంగా ఉంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల పెట్టుబ‌డిపై సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని పొందొవ‌చ్చు. అయితే అర్హ‌త ఉన్న ప‌న్ను శ్లాబ్ ఆధారంగా వ‌డ్డీకి ప‌న్ను విధిస్తారు.

పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం (పీఓఎంఐఎస్‌): ఈ ప‌థ‌కాన్ని భార‌త పోస్ట‌ల్ శాఖ అందిస్తోంది. ఇది మ‌దుపుదార్ల‌కు వ‌డ్డీ రూపంలో నెల‌వారీ ఆదాయాన్ని పొందేందుకు అనుమ‌తిస్తుంది. వ‌డ్డీ రేటును కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. మైన‌ర్ త‌ర‌పున పెద్ద‌వారు, సంర‌క్షుడు కూడా ఈ నెల‌వారీ ప‌థ‌కాన్ని తెర‌వొచ్చు. ఈ ప‌థ‌కం మెచ్యూరిటీ కాలం 5 సంవ‌త్స‌రాలు. ఒక‌ ఖాతాదారుడు రూ.4.50 ల‌క్ష‌ల వ‌ర‌కు, ఉమ్మ‌డిగా రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఈ ప‌థ‌కం సెక్ష‌న్ 80సీ కింద ఎలాంటి ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని అందించ‌దు. వ‌డ్డీపై ప‌న్ను వర్తిస్తుంది. ఈ ప‌థ‌కానికి ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు ఏడాదికి 6.6 శాతంగా ఉంది.

పన్ను ర‌హిత బాండ్లు: ఈ బాండ్ల‌ను ప్ర‌భుత్వం నిర్దిష్ట ప్ర‌యోజ‌నాల కోసం జారీ చేస్తుంది. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 10 ప్ర‌కారం వ‌డ్డీపై సంపూర్ణ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. టీడీఎస్ వ‌ర్తించదు. ఈ బాండ్ల‌లో పెట్టుబడి పెట్టిన ప్ర‌ధాన మొత్తం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉండ‌దు. ఈ బాండ్‌లు సాధార‌ణంగా 10 ఏళ్లు, అంత‌కంటే ఎక్కువ దీర్ఘ‌కాలిక మెచ్యూరిటీని క‌లిగి ఉంటాయి. లిక్విడేష‌న్ అంత సుల‌భం కాదు. ఈ బాండ్ల నుంచి సేక‌రించిన డ‌బ్బును ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు, గృహ ప్రాజెక్టుల్లో పెట్టుబ‌డి పెడుతుంది. వ‌డ్డీ వార్షిక ప్రాతిప‌దిక‌న చెల్లిస్తారు. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న వ‌డ్డీ రేట్లు 5% నుంచి 6% ప‌రిధిలో ఉన్నాయి. కొన్ని ప‌న్ను ర‌హిత బాండ్‌ల‌ను నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ, ఇండియ‌న్ రైల్వేస్‌, ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్‌, ఎన్‌టీపీసీ మొద‌లైన‌వి జారీ చేస్తాయి.

ప్ర‌ధాన‌ మంత్రి వ‌య వంద‌న యోజ‌న (పీఎంవీవీవై): ఇది భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద‌వీ విర‌మ‌ణ పెన్ష‌న్ ప‌థ‌కం. ఈ ప‌థ‌కాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) నిర్వ‌హిస్తోంది. ప‌థ‌కం నెల‌వారీ, త్రైమాసిక‌, వార్షిక ప్రాతిప‌దిక‌న పెన్ష‌న్‌ను చెల్లిస్తుంది. ఈ ప‌థ‌కాన్ని సీనియ‌ర్ సిటిజ‌న్లు మాత్ర‌మే ఎంచుకోవాలి. 10 సంవ‌త్స‌రాల కాలానికి క‌నీస పెట్టుబ‌డి రూ. 1.5 ల‌క్ష‌లు, గ‌రిష్ఠ పెట్టుబ‌డి రూ.15 ల‌క్ష‌లు. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌డ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ ప‌థ‌కం కింద చేసిన డిపాజిట్లు సెక్ష‌న్ 80సీ కింద ప్ర‌యోజ‌నం పొందొచ్చు. అయితే ప‌థ‌కం కింద సంపాదించిన వ‌డ్డీకి ప‌న్ను వర్తిస్తుంది.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌): ఈ ప‌థ‌కం దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో ఒక‌టి. సంపాదించిన వ‌డ్డీ రాబ‌డిపై ఆదాయ‌పు ప‌న్ను ఉంటుంది. ఈ ప‌థ‌కాన్ని పోస్టాఫీస్‌, అధీకృత బ్యాంకుల్లో ఒక పీపీఎఫ్ ఖాతాను తెర‌వొచ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని సెక్ష‌న్ 80సీ కింద క్లెయిమ్ చేయొచ్చు. ఈ ఖాతాల‌పై ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు ఏడాదికి 7.1 శాతంగా ఉంది. పీపీఎఫ్ ఖాతా కనిష్ఠ కాల‌ప‌రిమితి 15 ఏళ్లు. దీన్ని 5 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి పొడిగించ‌వ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ ఖాతాలో గ‌రిష్ఠంగా రూ.1,50,000 వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు.

జాతీయ పెన్ష‌న్ ప‌థ‌కం (ఎన్‌పీఎస్‌): ఈ ఎన్‌పీఎస్ ట్ర‌స్ట్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప‌రిధిలో ఉన్న పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ప్ర‌త్యేక విభాగం. ఈ ప‌థ‌కం ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల‌కు అందుబాటులో ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో డిపాజిట్ చేసిన డ‌బ్బు అనేక పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెడతారు. ఈ ప‌థ‌కంలో చేరే వారి గ‌రిష్ఠ వ‌య‌స్సును 65 సంవ‌త్స‌రాల నుంచి  70 సంవ‌త్స‌రాల‌కు ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య‌నే పెంచింది. ఈ ప‌థ‌కంలో చేరిన మ‌దుపుదార్లు ఉద్యోగ విర‌మ‌ణ సమ‌యంలో అప్ప‌టికి పోగ‌యిన మొత్తంలో కొంత భాగాన్ని ఏక మొత్తంలో ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న్‌ పొందేందుకు యాన్యుటీని కొనుగోలు చేయ‌డానికి మిగిలిన మొత్తాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు.

గ‌మ‌నిక: సీనియ‌ర్ సిటిజ‌న్‌ల కోసం అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను వివ‌రించే ల‌క్ష్యంతో ఈ క‌థ‌నం ఇచ్చాం. కథనంలో పేర్కొన్న వ‌డ్డీ రేట్లలో మార్పులు ఉండొచ్చు. పెట్టుబ‌డి స‌మ‌యంలో విధించే నిబంధ‌న‌లు, ష‌ర‌తులు, వాస్త‌వ వ‌డ్డీ రేటును అర్థం చేసుకోవడానికి పెట్టుబడి పథకాల ఆఫర్‌ డాక్యుమెంట్‌లోని వివరాలను సంపూర్ణంగా చ‌ద‌వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని