Nominee: నామినీని ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?

బీమా పాలసీలకు, తమ పేరు మీద ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేవారికి నామినేషన్‌ అనేది చాలా కీలకం. నామినీ గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

Published : 13 Jan 2023 18:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం చేసే చాలా ఆర్థిక వ్యవహారాలకు నామినీ అవసరం. నామినీని పేర్కొనకపోవడం అంటే సంపదను ప్రమాదంలో పడేయడమే. సంపద సృష్టి అనేది మీ కోసమే కాకుండా మీ ప్రియమైనవారి కోసం సహాయపడే ప్రక్రియ. అందుచేత ఎవరైనా వారి తదనంతరం వారి సంపద సరైన వ్యక్తికి చేరాలంటే  నామినీ పేర్కొని తీరాలి. ఒక వ్యక్తి అతడి మరణం తర్వాత తన ఆస్తులను స్వీకరించడానికి అర్హులైన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను నియమించడానికి నామినేషన్‌ అనే కీలకమైన ప్రక్రియను పూర్తిచేయాలి.

నామినీ అవసరం

ఒకరు జీవిత బీమా పాలసీని తీసుకున్నారని అనుకుందాం. అతడి పాలసీలో పేర్కొన్న నామినీ ఆ వ్యక్తి మరణం తర్వాత క్లెయిమ్‌ మొత్తాన్ని స్వీకరించే వ్యక్తి. అదే విధంగా నామినీ మీ బ్యాంకులో ఎఫ్‌డీ, ఆర్‌డీ, సేవింగ్స్‌ ఖాతా, పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్స్‌ మొదలైన వాటిలో మీ తదనంతరం కార్పస్‌ను స్వీకరిస్తారు. అయితే, సరైన నామినీని ఎంచుకోకపోవడం వల్ల మీ సంపద దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి తన ఎఫ్‌డీలు, సేవింగ్స్‌ ఖాతాలు, పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్లు, జీవిత బీమా మొదలైన వాటికోసం వేర్వేరు నామినీలను సూచించవచ్చు. అలాగే, ఆస్తి రకాన్ని బట్టి ఒకరు లేదా బహుళ నామినీలను పేర్కొనవచ్చు. బీమా పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్లు వంటి సంస్థలు బహుళ నామినీలను అనుమతిస్తాయి. ఆస్తి యజమాని నిర్వచించిన వాటా ప్రకారం నామినీలు ఆస్తిని స్వీకరిస్తారు. 

నామినీ ఎందుకు ముఖ్యం?

నామినీలు మరణించిన యజమాని ఆస్తులకు సంరక్షకులు. కాబట్టి యజమాని మరణించిన తర్వాత నామినీకి అర్హత కలిగిన ఆస్తిని పొందే చట్టపరమైన హక్కు లభిస్తుంది. అయితే, కొన్నిసార్లు నామినీ ఆస్తులకు చట్టపరమైన వారసుడు కాకపోవచ్చు. అప్పుడు వారు నిజమైన చట్టపరమైన వారసుడిని ప్రకటించే వరకు తప్పనిసరిగా ఆస్తికి సంరక్షకులుగా వ్యవహరించాలి. వివిధ రకాల ఆస్తులు, ఖాతాల కోసం వివిధ నామినీలు ఉండవచ్చు. బ్యాంకు ఖాతాలో నామినీని పేర్కొనడం చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతాలో సాధారణంగా ఒక నామినీకి మాత్రమే అనుమతి ఉంటుంది. అకాల మరణం తర్వాత మీ పెట్టుబడులను సెటిల్‌ చేయడంలో నామినీ కీలక పాత్ర పోషిస్తారు.

ఎవరు నామినీ కావచ్చు?

మీరు మీ ఆస్తికి నామినీగా జీవిత భాగస్వామి, బంధువు, తల్లిదండ్రులు, స్నేహితుడు మొదలైన ఏ వ్యక్తినైనా నియమించొచ్చు. మ్యూచువల్‌ ఫండ్ల విషయంలో గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులను నామినేట్‌ చేయవచ్చు. ఈ ఫండ్లలో బహుళ స్కీమ్‌లను కలిగి ఉంటే, అన్ని స్కీంలు ఒకే నామినేషన్‌ వివరాలను కలిగి ఉంటాయి.

నామినీ సమీక్ష

సెటిల్‌మెంట్‌ సమయంలో మీ ఆస్తుల్లో అప్‌డేట్‌ చేసిన తాజా నామినీ వివరాలు పరిగణిస్తారు. మ్యూచువల్‌ ఫండ్లు, ఇన్సూరెన్స్‌, షేర్లు, చిన్న పొదుపు పథకాలు, బ్యాంకు ఖాతాలు, ఎఫ్‌డీలు మొదలైన మీ అన్ని పెట్టుబడులకు మీరు నామినేషన్‌ పేర్కొన్నారా లేదా నిర్ధారించుకోండి. మీ ఖాతాల నామినేషన్‌లను క్రమం తప్పకుండా సమీక్షించండి . అవసరమైనప్పుడు మార్పులు చేయండి. నామినీని కలిగి ఉండడం అనేది చట్టపరమైన వారసుడిని పేర్కొన్నట్టు కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని