Published : 10 Jan 2021 16:27 IST

భారత్‌ పుంజుకోవడంలో పట్టణాలదే ప్రముఖ పాత్ర!

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నివేదికలో కీలక విషయాలు

దిల్లీ: కొవిడ్‌-19 సంక్షోభం వల్ల భారత్‌లోని నగరాల ఆర్థిక వృద్ధి తీవ్రంగా దెబ్బతిందని ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. అయితే, మహమ్మారి తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలోనూ ఈ పట్టణాలే కీలకంగా మారనున్నాయని పేర్కొంది. దేశ జీడీపీలో 70 శాతం నగరాల నుంచే వస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. దేశంలో ప్రతినిమిషానికి 25-30 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసవెళుతున్నారని ‘ఇండియన్‌ సిటీస్‌ ఇన్‌ ద పోస్ట్‌-పాండెమిక్‌ వరల్డ్‌’ పేరిట ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌)’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

దేశంలో 2.5 కోట్ల కుటుంబాలు.. పట్టణ ప్రాంతాల్లో 35 శాతం కుటుంబాలు మార్కెట్‌ ధరకు ఇళ్లు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది. ఈ సంక్షోభ సమయాన్ని పట్టణాల స్వరూపాన్ని మార్చడానికి అవకాశంగా మార్చుకోవాలని సూచించింది. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు సహా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని హితవు పలికింది. కొవిడ్‌ సంక్షోభంతో నగరాలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. వీటన్నింటినీ సవాళ్లుగా స్వీకరించి పట్టణాల రూపురేఖలు మార్చేందుకు అవకాశంగా మలచుకోవాలని సూచించింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఐడీఎఫ్‌సీ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి డబ్ల్యూఈఎఫ్‌ ఈ అధ్యయనం జరిపింది.

కరోనా సంక్షోభం వివిధ వర్గాలపై వివిధ రకాల ప్రభావాల్ని చూపినట్లు తెలిపింది. ముఖ్యంగా పేద, మధ్యాదాయ వర్గాలు ఉపాధి కోల్పోవడంతో పాటు.. సామాజిక, ఆరోగ్య భద్రతను కూడా కోల్పోయారని పేర్కొంది. కాలం చెల్లిన ప్రణాళికలు, మార్గదర్శకాలకు స్వస్తి పలికి.. పట్టణాల్లో రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇందుకు పట్టణాలకు సంబంధించిన సమాచారం కీలకమని గుర్తుచేసింది. అధికార వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. భవన నిర్మాణ రంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు.. రెంటల్‌ హౌసింగ్‌ మార్కెట్‌ను పటిష్ఠ పరిచేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కాలుష్యం నివారణ విషయంలోనూ సరైన మార్గాల్ని అనుసరించాలని తెలిపింది.

ఇవీ చదవండి..

డి-మార్ట్‌ లాభం రూ.447 కోట్లు

పెద్ద పాలసీలకు పెరిగిన గిరాకీ

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని