15 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్‌ అయ్యే బ్యాటరీ

ప్రస్తుతం పెట్రోలు ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో మరోసారి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై చర్చ నడుస్తోంది. అయితే, వీటికి ఉన్న ప్రధాన సమస్యల్లో బ్యాటరీ

Published : 02 Mar 2021 19:08 IST

బెంగళూరు: ప్రస్తుతం పెట్రోలు ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో మరోసారి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై చర్చ నడుస్తోంది. అయితే, వీటికి ఉన్న ప్రధాన సమస్యల్లో బ్యాటరీ ఛార్జింగ్‌ ఒకటి. ఎక్కువ సేపు ఛార్జ్‌ చేయాల్సి రావటంతో వాహనాదారులు ఇప్పటికీ వీటిపై ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘లాగ్‌-9’ 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అయ్యే టెక్నాలజీని సిద్ధం చేసింది.

గ్రాఫీన్‌ను ఉపయోగించి సూపర్‌ కెపాసిటర్‌ టెక్నాలజీ ద్వారా ఈ బ్యాటరీలను తయారు చేసినట్లు ‘లాగ్‌9’ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాటరీలు కేవలం 15 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ అవ్వడమే కాదు, 15ఏళ్లకు మించి పనిచేస్తాయని తెలిపింది. లిథియం అయాన్‌ బ్యాటరీలతో పోలిస్తే, నాణ్యత, దృఢత్వాన్ని కలిగి ఉంటాయని వెల్లడించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి బ్యాటరీతో నడిచే 3వేల వాహనాల (2వీలర్‌, 3వీలర్‌)ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

స్వాపబుల్‌ బ్యాటరీస్‌ కన్సార్టియం

మరోవైపు జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా, యమాహాతో సహా యూరోపియన్‌ కంపెనీలైన పియాజియో, సీస్పా, కేటీఎంలు సంయుక్తంగా స్వాపబుల్‌ బ్యాటరీస్‌ కన్సార్టియం(మార్చుకొనే వీలు కలిగిన బ్యాటరీలు) ఏర్పాటు చేశాయి. బ్యాటరీలను తీసి వేరుగా ఛార్జింగ్‌ పెట్టుకునేలా వాహనాలను తయారు చేయడానికి ఈ సంస్థలు కృషి చేస్తాయి. అంతేకాకుండా, భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగేలా చూస్తాయి.

ఇవి ఎలా పనిచేస్తాయంటే..?

ఈ విధానంలో వాహనదారులు తమ వాహనాల్లోని బ్యాటరీలను తీసి, వేరుగా ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఒక బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతే దాన్ని తీసి, మరో బ్యాటరీ ఇన్‌స్టాల్‌ చేసుకుని నిరంతరాయంగా తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు. ప్రస్తుతం కొన్ని దేశాలు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు నిర్ణీత ప్రదేశంలో ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తాయి. ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీని అక్కడ ఇచ్చేసి, ఫుల్‌ ఛార్జ్‌ ఉన్న మరో బ్యాటరీని తీసుకోవచ్చు.

ఇవీ చదవండి..

రూ. 45వేల దిగువకు బంగారం

‘కామెంట్‌ పాండా’ కన్నుపడితే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని