IRCTC Refund Rules: ఏసీ పనిచేయకపోతే రీఫండ్‌ కోరొచ్చు.. TDR గురించి ఈ విషయాలు తెలుసా?

IRCTC Refund Rules: ఏయే సందర్భాల్లో TDR ఫైల్‌ చేసుకోవచ్చో తెలుసుకోండి..

Updated : 18 Jul 2022 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుటుంబంతో కలిసి దూర ప్రయాణానికి రైల్లో బయల్దేరతాం. పెద్దవాళ్లు ఉన్నారన్న కారణంతో రైల్లో ఏసీ బోగీలో టికెట్‌ బుక్‌ చేసుకుంటాం. తీరా రైలెక్కాక ఒకటే ఉక్కపోత. ఆరా తీస్తే ఏసీ పనిచేయలేదని తేలుతుంది. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే.. కేవలం నిట్టూర్చి ఊరుకోవాల్సిన పనిలేదు. మీకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ నుంచి రీఫండ్‌ కోరొచ్చు. ఇందుకోసం TDR (టికెట్‌ డిపాజిట్‌ రిసిప్ట్‌)ను ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

TDR ఫైల్‌ చేయాలంటే TTE నుంచి మీరు సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. IRCTC వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో మీరు TDRను ఫైల్‌ చేయొచ్చు. ఆ వినతి సంబంధిత రైల్వే జోనల్‌ కార్యాలయానికి చేరుతుంది. అనంతరం సంబంధిత మొత్తాన్ని మీ ఖాతాలో ఐఆర్‌సీటీసీ జమ చేస్తుంది. కేవలం ఏసీ ఫెయిల్‌ అయినప్పుడే కాదు.. రైల్వే శాఖ వల్ల మీకు అసౌకర్యం కలిగినప్పుడు వివిధ సందర్భాల్లో రీఫండ్‌ కోసం TDRను ఫైల్‌చేయొచ్చు.

  • మీరు ప్రయాణించాల్సిన రైళ్లు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంటాయి. ఒకవేళ మీరు ప్రయాణించాల్సిన రైలు కూడా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లు గుర్తిస్తే అందులో మీరు ప్రయాణించకపోతే మీరు రీఫండ్‌ కోసం దరఖాస్తు చేయొచ్చు. పూర్తి రీఫండ్‌ కావాలంటే రైలు బయల్దేరే వాస్తవ సమయానికంటే ముందే TDR ఫైల్‌ చేయాలి. ఒకవేళ మీరు వెళ్లాలనుకున్న రైలు పూర్తిగా క్యాన్సిల్‌ అయితే TDR ఫైల్‌ చేయకుండానే రీఫండ్‌ పొందొచ్చు.
  • ఏదైనా కారణంతో మీరు ప్రయాణించాల్సిన రైలు రూటు మళ్లించడం వల్ల మీరు రైలు అందుకోకపోయినా రీఫండ్‌ పొందొచ్చు. రైలు రూటు మళ్లించడం వల్ల రైలు బోర్డింగ్‌ స్టేషన్‌కు చేరని సమయంలోనూ, మీరు ప్రయాణిస్తున్న రైలు గమ్యస్థానం కాకుండా వేరే స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలోనూ TDR ఫైల్‌చేయొచ్చు. టికెట్‌ బుక్‌ చేసుకున్నా ఏదైనా కారణంతో మీకు సీటు దొరక్కపోయినా మీరు TDR ఫైల్‌ చేసి రీఫండ్‌ కోరొచ్చు.

ఎలా చేయాలి?

  • IRCTC వెబ్‌సైట్‌/ యాప్‌లోకి మీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
  • మై అకౌంట్‌ సెక్షన్‌లోని టికెట్‌ హిస్టరీపై క్లిక్‌ చేయాలి.
  • TDR ఫైల్‌ చేసుకోవాలనుకున్న PNR నంబర్‌ను, పేరును ఎంపిక చేసుకోవాలి.
  • ఫైల్‌ TDR ఆప్షన్‌ను ఎంచుకోవాలి. TDR ఫైల్‌ చేసేందుకు కావాల్సిన కారణాన్ని ఎంపిక చేసుకుని ప్రక్రియను పూర్తి చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని