CMF Phone 1: 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో సీఎంఎఫ్‌ తొలి ఫోన్‌

CMF Phone 1: నథింగ్‌ అందుబాటు ధరలో సీఎంఎఫ్‌ ఫోన్‌ 1ను విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Updated : 08 Jul 2024 15:45 IST

CMF Phone 1 | దిల్లీ: నథింగ్‌ సబ్‌బ్రాండ్ సీఎంఎఫ్‌ తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. సీఎంఎఫ్‌ ఫోన్‌ 1 (CMF Phone 1) పేరిట దీన్ని తీసుకొచ్చింది. నథింగ్‌ నుంచి వస్తున్న బడ్జెట్‌ ఫోన్‌ ఇదే. ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

సీఎంఎఫ్‌ ఫోన్‌ 1లో (CMF Phone 1) 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఐపీ52 రేటింగ్‌ స్ల్పాష్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఉంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డెప్త్‌ సెన్సర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ 2.6 ఓఎస్‌తో వస్తోంది. రెండు ఓఎస్‌, మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

12GB ర్యామ్‌తో మోటో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లివే..

సీఎంఎఫ్‌ ఫోన్‌ 1 (CMF Phone 1) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా.. 8 GB ర్యామ్‌ + 128 GB స్టోరేజ్‌ ధర రూ.17,999. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 2టీబీ వరకు విస్తరించుకోవచ్చు. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రాయితీ కూడా లభిస్తోంది. నలుపు, ఆరెంజ్‌, లైట్‌ గ్రీన్‌, బ్లూ (భారత్‌లో మాత్రమే) రంగుల్లో ఇది లభిస్తోంది. ఫోన్‌ ఛార్జర్‌ను రూ.799తో విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లాన్యార్డ్, స్టాండ్‌, కార్డ్‌హోల్డర్‌ వంటి ప్రత్యేక యాక్సెసరీస్‌ కూడా ఉన్నాయి. ఒక్కో దాని ధర రూ.799. బ్యాక్‌ కవర్లు రూ.1,499తో కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌పై ఉండే స్క్రూలను తీసేసి కొత్త కవర్‌ను బిగించుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఫోన్‌కు కావాలనుకున్నప్పుడల్లా కొత్త లుక్‌ తీసుకురావొచ్చు. బ్యాక్‌ కవర్‌ కింద భాగంలో ఓ మూలన ఉండే వీల్‌కు లాన్యార్డ్‌, స్టాండ్‌, కార్డ్‌హోల్డర్‌ను అటాచ్‌ చేయొచ్చు.

స్మార్ట్‌ వాచ్‌, బడ్స్‌

సీఎంఎఫ్‌ తన తొలి స్మార్ట్‌ఫోన్‌తో పాటు వాచ్‌ ప్రో 2ను కూడా విడుదల చేసింది. ఇది 1.32 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. దీని ధరను రూ.4999గా నిర్ణయించారు. వీగన్‌ లెదర్‌ ఆప్షన్‌తో కూడిన వాచ్‌ ధరను రూ.5,499గా నిర్ణయించారు. దీంతో పాటు బడ్స్‌ ప్రో 2 పేరుతో టీడబ్ల్యూఎస్‌ను కూడా లాంచ్‌ చేశారు. 50డీబీ హైబ్రిడ్‌ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో సపోర్ట్‌తో వస్తోంది. దీని ధరను రూ.4,299గా నిర్ణయించారు. క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీ 2.0, విండ్‌ నాయిస్‌ రిడక్షన్ 2.0తో వస్తోంది. ఈ మూడు ప్రొడక్టులు జులై 12 నుంచి సేల్‌కు వస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌, సీఎంఎఫ్‌ వెబ్‌సైట్‌తో పాటు ఇతర రిటైల్‌ స్టోర్లలో లభిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని