Cryptocurrency: కాయిన్‌స్విచ్‌ కుబర్‌లో నిలిచిపోయిన డిపాజిట్లు!

భారత్‌లో ప్రముఖ క్రిప్టో ట్రేడింగ్‌ వేదికల్లో ఒకటైన కాయిన్‌స్విచ్‌ కుబర్‌.. తమ యాప్‌లో భారత కరెన్సీ జమను తాత్కాలికంగా నిలిపివేసింది....

Published : 12 Apr 2022 13:57 IST

ముంబయి: భారత్‌లో ప్రముఖ క్రిప్టో ట్రేడింగ్‌ వేదికల్లో ఒకటైన కాయిన్‌స్విచ్‌ కుబర్‌ (CoinSwitch Kuber).. తమ యాప్‌లో భారత కరెన్సీ జమను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో యూపీఐ (UPI) సహా నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, ఐఎంపీఎస్‌ వంటి బ్యాంకు బదిలీ మార్గాల ద్వారా యాప్‌లో రూపాయల్లో డబ్బును జమచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అంటే కొత్తగా క్రిప్టోను కొనుగోలు చేయడానికి కావాల్సిన డబ్బును యాప్‌లోని ఈ-వ్యాలెట్‌లో లోడ్‌ చేయడానికి అనుమతి లేదు. కాయిన్‌ స్విచ్‌ యాప్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) ట్రేడింగ్‌పై నియంత్రణల విషయంలో భారత్‌లో తీవ్ర అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు క్రిప్టో లాభాలపై ఏప్రిల్‌ 1 నుంచి కేంద్రం 30 శాతం పన్ను విధిస్తోంది. ఫలితంగా దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీలయిన వజీరిక్స్‌, జెబ్‌పే సహా మరికొన్నింటిలో లావాదేవీల సంఖ్య ఏప్రిల్‌ 10న ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయింది. అలాగే ఇటీవల ప్రముఖ ఈ-వ్యాలెట్‌ మొబిక్విక్ (Mobikwik)‌.. వజీరిక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై తమ సేవల్ని నిలిపివేసింది. ఫలితంగా వజీరిక్స్‌ (WazirX) వ్యాపారం 65-90 శాతం కుంగినట్లు సమాచారం. ఏప్రిల్‌ 1 నుంచి వివిధ క్రిప్టో ఎక్స్ఛేంజీల్లోనూ లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.

మరోవైపు ఇటీవలే భారత్‌లో క్రిప్టో ట్రేడింగ్‌ ప్రారంభించిన కాయిన్‌బేస్ ‌(Coinbase) సైతం యూపీఐ ద్వారా యాప్‌లోకి నగదు బదిలీని నిలిపివేసింది. క్రిప్టో ఎక్స్ఛేంజీలు యూపీఐని వినియోగించుకుంటున్నట్లు తమకు తెలియదని ఎన్‌పీసీఐ (NPCI) ప్రకటించడమే దీనికి కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని