SVB Crisis: ఎస్‌వీబీ పతనం భారత స్టార్టప్‌లకు పెద్ద దెబ్బే.. నిపుణుల అంచనా!

SVB Crisis: అమెరికాలో వ్యాపారం చేయాలనుకుంటున్న భారత అంకుర సంస్థల్లో చాలా వరకు ఎస్‌వీబీ సేవలనే వినియోగించుకుంటున్నాయని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ తెలిపారు.

Published : 12 Mar 2023 19:47 IST

వాషింగ్టన్‌: ప్రధానంగా అంకుర సంస్థల (startups)కు నిధులు సమకూర్చే సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం (SVB Crisis) భారత స్టార్టప్‌ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం ఒక్క రాత్రిలోనే దేశ అంకుర పరిశ్రమ (startups)లో తీవ్ర అస్థిరతను నింపిందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఆశు గార్గ్ తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. స్టార్టప్‌ రంగానికి ఇది పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు.

భారత స్టార్టప్‌ పరిశ్రమకు ఎస్‌వీబీ (SVB) మద్దతుగా నిలిచిందని గార్గ్ తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలను కూడా అందించిందని పేర్కొన్నారు. అమెరికాలో వ్యాపారం చేయాలనుకుంటున్న భారత అంకుర సంస్థల్లో చాలా వరకు ఈ బ్యాంకు సేవలనే వినియోగించుకుంటున్నాయని తెలిపారు. ఎస్‌వీబీ భారత బ్యాంకులతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడమే అందుకు కారణమన్నారు. అక్కడి చాలా బ్యాంకులు విదేశీ కస్టమర్లతో పనిచేయడానికి సుముఖంగా లేవని గుర్తుచేశారు. ఎస్‌వీబీ మాత్రం అమెరికా ఉద్యోగులులేని అంకురాలకు సైతం తమ సేవలను విస్తరించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎస్‌వీబీ పతనమైతే అది భారత అంకుర సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని గార్గ్‌ వివరించారు. సిలికాన్‌ వ్యాలీలో గత కొన్నేళ్లుగా చాలా వరకు స్టార్టప్‌లు, టెక్‌ పరిశ్రమలు ఎస్‌వీబీవైపే మొగ్గుచూపాయని పేర్కొన్నారు. అంకుర సంస్థల పనితీరును ఎస్‌వీబీ బాగా అర్థం చేసుకుందని.. వాటితో ఎలా డీల్‌ చేయాలో దానికి తెలిసి ఉండడమే అందుకు కారణమన్నారు.

ఓ ప్రముఖ సంస్థ అంచనా ప్రకారం.. సిలికాన్‌ వ్యాలీలో ప్రతి మూడు స్టార్టప్‌లలో ఒకటి భారతీయ అమెరికన్‌లు స్థాపించినదే. ఆయా అంకురాలన్నీ వచ్చే వారం రోజుల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కొనున్నాయని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో చాలా వరకు ఉద్యోగుల వేతనాలు సహా ఇతర అవ్యవసర చెల్లింపులు కూడా చేయలేకపోవచ్చని చెబుతున్నారు. అమెరికాలో కనీసం ఆఫీసు, ఒక్క ఉద్యోగి కూడా లేని స్టార్టప్‌లు సైతం ఎస్‌వీబీలో ఖాతాల తెరిచాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బ్యాంక్ పతనం వల్ల ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని