Updated : 10 Jun 2022 15:02 IST

వాణిజ్య బ్యాంక్‌ Vs స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌.. రెండింటి మధ్య వ్య‌త్యాసం ఏంటి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబడుల భద్రతతో పాటు స్థిర రాబడిని కోరుకునే వారు సాధారణంగా బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు (ఎఫ్‌డీ) ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే, ఎఫ్‌డీ చేసేటప్పుడు పెట్టుబడిదారుడు మొదట చూసేది వడ్డీ రేట్లు. సాధారణంగా వాణిజ్య బ్యాంకులు పొదుపు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్ల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తుంటాయి. వాణిజ్య బ్యాంకులు పొదుపు ఖాతాపై 2.50 శాతం నుంచి 6 శాతం వరకు వడ్డీరేటు అందిస్తుండగా.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. అలాగే, వాణిజ్య బ్యాంకులు వివిధ కాలపరిమితులు గల ఎఫ్‌డీలపై 2.25 శాతం నుంచి 6.25 శాతం మధ్య వడ్డీ ఇస్తుండగా.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 2.50 శాతం నుంచి 7.25 శాతం మధ్యలో వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) అధిక వడ్డీ లభిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన ఫైనాన్స్ సంస్థలు ఎక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారులను ఆకర్షించడం సహజమే. అయితే, మీరు ఎందులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించాల్సిన కొన్ని విషయాలు ఇవీ..

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..
ఇతర వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా ఆర్‌బీఐ ఆమోదం ఉంటుంది. చిన్న, సూక్ష్మ, రుణ సంస్థల ముఖ్య ఉద్దేశం బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వారికి ఆర్థిక సేవలు అందించడం. తక్కువ ఆదాయ వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న వ్యాపారులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రధాన రంగాలకే ఎక్కువ రుణాలను అందించాలనే నిబంధన ఈ సంస్థలకు ఉంటుంది.

రిటైల్ వినియోగదారులకు సాధారణంగా బ్యాంకులు అందించే ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు, డిపాజిట్లు, రుణాలు వంటి అన్ని సేవలను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తాయి. కొన్ని సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు డిపాజిట్లను రాబట్టుకునేందుకు ఎక్కువ వడ్డీ రేట్లను ప్రకటిస్తాయి. ఇతర బ్యాంకుల మాదిరిగానే వచ్చిన డిపాజిట్ల డబ్బును రుణాల రూపంలో జారీ చేస్తాయి.

వాణిజ్య బ్యాంకులు Vs స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు..
వాణిజ్య బ్యాంకులు తమ సేవలను అందించాల్సిన కస్టమర్ల సంఖ్యపై పరిమితులు ఉండవు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అసంఘటిత కార్మికులు, చిన్న వ్యాపారులు, చిన్న రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్ష్యంగా పనిచేస్తాయి.

వాణిజ్య బ్యాంకులు తమ శాఖలను ఎప్పుడైనా, ఎక్కడైనా తెరవవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం ప్రారంభమైన 3 ఏళ్లలో తమ శాఖలలో 25 శాతం గ్రామీణ ప్రాంతాల్లో తెరవాలనే నిబంధ‌న ఉంది.

రెండు రకాల బ్యాంకులూ రుణాలు అందిస్తున్నప్పటికీ.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 75 శాతం రుణాలను ప్రయారిటీ సెక్టార్ (ప్రాధాన్య రంగానికి) ఇవ్వాల్సి ఉంటుంది.

మరి పెట్టుబడుదారులు ఏం చేయాలి?

  • పెట్టుబడుల కోసం ఒక పథకాన్ని ఎంచుకున్నప్పుడు కేవలం రాబడి కోసమే కాకుండా సంస్థ/బ్యాంకు అందించే సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌ ఖాతా ప్రారంభం, లావాదేవీల నిర్వ‌హ‌ణ‌కు అవకాశం ఉన్నప్పటికీ మీకు దగ్గరలో సంస్థ లేదా బ్యాంకు శాఖ ఉండేలా చూసుకోవాలి. ఏ కార‌ణంగానైనా బ్యాంకు శాఖ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌స్తే ఇది మీకు స‌హాయ‌ప‌డుతుంది.
  • ఏదేమైనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పరిమితంగా డిపాజిట్ చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అన్ని బ్యాంకులు స‌వ్యంగా కార్య‌కాలాపాల‌ను నిర్వ‌హించ‌లేక‌పోవ‌చ్చు. కొన్ని కొంతకాలం మాత్రమే కార్యకలాపాలను కొనసాగించవచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ సంస్థ‌ల్లో కొన్ని గతంలో సూక్ష్మ రుణ సంస్థలు అన్న విషయం గుర్తుంచుకోవాలి. అయితే, అప్పుడు రుణాలు మాత్రమే అందించే సంస్థలు ఇప్పుడు బ్యాంకుల మాదిరిగా డిపాజిట్లకు కూడా సదుపాయం కల్పిస్తున్నాయి. ఎంతైనా ఎప్పటి నుంచో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవనే చెప్పాలి.
  • స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పెట్టుబ‌డులు పెట్టేల‌నుకునేవారు రిస్క్ త‌గ్గించుకొనేందుకు మీ పెట్టుబడుల్లో కొంత భాగం మాత్రమే ఈ బ్యాంకులకు కేటాయించవ‌చ్చు. ఆర్‌బీఐ సబ్సిడరీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అన్ని రకాల బ్యాంకుల డిపాజిట్లపై రూ. 5 లక్షల బీమా అందిస్తుందన్న సంగతి తెలిసిందే. పెట్టుబడుదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డీఐసీజీసీ వెబ్‌సైట్‌లో బీమా అందించే బ్యాంకుల జాబితా ఉంటుంది. ఆ జాబితాని ప‌రిశీలించి అందులో ఉన్న బ్యాంకును ఎంచుకుని డిపాజిట్లు చేయ‌డం మంచిది. పెట్టుబడులను ఒకే దాంట్లో కాకుండా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి. పొదుపు, ఫిక్స్‌డ్‌, ఇత‌ర అన్ని డిపాజిట్లు వాటిపై వ‌చ్చే వ‌డ్డీతో క‌లిపి రూ.5 ల‌క్ష‌ల‌కు పరిమితం చేస్తే మంచిది.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని