ఆరోగ్య బీమా విషయంలో చేసే తప్పులేమిటి?

వృద్ధాప్యంలో మాత్ర‌మే ఆరోగ్య బీమా ఉండాల‌ని భావించ‌డం స‌రికాదు.

Updated : 09 Feb 2022 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధార‌ణంగా ఆరోగ్యంగా ఉన్న వారు, యువ‌కులు చాలామంది ఆరోగ్య బీమా తీసుకునే విష‌యంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. బాగానే ఉన్నాం క‌దా! ఇపుడు ఆరోగ్య బీమాకి ప్రీమియం దండ‌గ అనే అభిప్రాయంతో ఉంటారు. ఇలాంటి ఆలోచన విధానం తప్పు. మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ఏర్పడినప్పుడు ఆరోగ్య బీమా ఎంత ముఖ్యమో తెలుస్తుంది. వృద్ధాప్యంలో మాత్రమే ఆరోగ్య బీమా ఉండాలని భావించడం సరికాదు.. ఆరోగ్య ప్రణాళిక అనేది యువకులుగా ఉన్నప్పుడే ప్లాన్‌ చేసుకోవాలి. ఇది మ‌ధ్యస్థ వయసులోనూ, వృద్ధాప్యంలోనూ బాగా ఉపయోగపడుతుంది. త‌ద్వారా ఒక వ్యక్తి, కుటుంబం విస్తృత హెల్త్‌ కవరేజీని పొందగలరు. అవ‌స‌రాలు రాక‌ముందే ఆరోగ్య బీమా ప్లాన్ చేసుకోవ‌డం మంచిది. ఆఫీస్‌లో గ్రూప్ ఆరోగ్య బీమా ఉన్నా.. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ముందు కొన్ని సంవ‌త్సరాల నుంచే విడిగా ఆరోగ్య బీమా తీసుకోవడమూ మంచిదే. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఈ పాల‌సీని కొన‌సాగించ‌వ‌చ్చు. లేకపోతే వృద్ధాప్యంలో ఆరోగ్య బీమా కొనుగోలు కష్టమవుతుంది.

భార‌త్‌లో ఆరోగ్య ఖ‌ర్చుల నిమిత్తం అయ్యే మొత్తం వైద్య ఖర్చుల్లో 62.6% సొంత జేబు నుంచే ఖ‌ర్చు పెడుతున్నారు. 37.4% మొత్తం మాత్రమే ప్రభుత్వం, ఇతర సంస్థలు, ఆరోగ్య బీమా ద్వారా క‌వ‌ర్ అవుతోంది. కారణం చాలామంది వ్యక్తులు వారి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రైన ఆరోగ్య ప్రణాళికను ఎంచుకోవడంలో విజయవంతం కాలేకపోతున్నారు. ఆరోగ్య బీమా సంస్థల అధ్యయనం ప్రకారం.. భారత్‌లో వైద్య ద్రవ్యోల్బణం 2021 జూన్‌లో 7.70 శాతంగా ఉంది. 2019 డిసెంబ‌ర్లో ఇది 3.8 శాతం మాత్రమే. ముఖ్యంగా కొవిడ్‌ కారణంగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరే వారి ఖర్చులు విపరీతంగా పెరిగాయి.

త‌గినంత క‌వ‌రేజీ: మీరు మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అందుబాటులో ఉండే క‌వ‌రేజ్ కోసం చూస్తున్నట్లయితే ఆసుప‌త్రిలో చేర‌డానికి ముందు, ఆ త‌ర్వాత ఖ‌ర్చులు, ఆరోగ్య ప‌రీక్షల లభ్యత, చికిత్స కోసం వేచి ఉండే కాలం మొదలైనవి ఆరోగ్య బీమా క‌వ‌రేజ్‌లో ఉన్నాయో, లేవో చెక్ చేసుకోవాలి. మీ వార్షిక ఆదాయంతో స‌మానంగా గానీ లేక వార్షిక ఆదాయంలో స‌గం గానీ తప్పనిసరిగా వైద్య క‌వ‌రేజీ ఉండి తీరాల‌ని బీమా నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య చ‌రిత్ర: ఆరోగ్య బీమాని ఎంచుకునే స‌మ‌యంలో స్వీయ‌, కుటుంబ ఆరోగ్య హిస్టరీ వెల్లడించాలి. త‌ద్వారా క్లెయిమ్ స‌మ‌యంలో ఎటువంటి చికాకులు, ఆందోళ‌న‌లు ఉండ‌వు.
నియ‌మ‌, నిబంధ‌న‌లు: కొన్ని ఆరోగ్య బీమా ప్లానుల్లో గ‌ది అద్దెకు సీలింగ్ నిబంధ‌న‌లు, స‌హ‌-చెల్లింపు (బీమా చేసేవారు క‌ట్టే వాటా), త‌గ్గింపులు ఉంటాయి. ఇవి ప్లాన్ ఎంచుకునే స‌మ‌యంలో బీమా ప్రతినిధులు తెలపరు. కానీ క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ సమయంలో ఇవ‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయి. బీమా ప్లాన్ కొనుగోలు చేసేట‌పుడు మిన‌హాయింపు జాబితాను పూర్తిగా చ‌దివి అర్థం చేసుకోవాలి. నిబంధ‌న‌లు, ష‌ర‌తులు చ‌ద‌వ‌డంలో విఫ‌ల‌మైతే పాల‌సీదారుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ టైమ్‌లో సొంతంగా ఖ‌ర్చులు పెట్టుకునేట‌ప్పుడు ఇబ్బంది ప‌డ‌తారు.

ప‌రిశోధ‌న ముఖ్యం: సాంకేతిక‌త అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వివ‌రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. బీమా ప్లాన్‌ల‌ను స‌రిపోల్చుకోవ‌డం, ప్రతి పాల‌సీ నియ‌మ‌ నిబంధ‌న‌లు ఆన్‌లైన్‌లో చ‌దివి అర్థం చేసుకోవాలి. బీమా ప్లాన్‌ని ఎంచుకునే ముందు ప‌రిగ‌ణించాల్సిన విష‌యాలు తెలుసుకోవ‌డం ముఖ్యం.

జీవ‌న‌శైలిలో మార్పులు: జీవ‌న‌శైలి రుగ్మతలు పెరుగుతున్నాయి. కాబ‌ట్టి తగినంత ఆరోగ్య బీమా క‌వ‌రేజీను ఎంపిక చేసుకోవ‌డంలో జాగ్రత్త వహించాలి.  తీవ్రమైన అనారోగ్యాల‌కి, వ్యక్తిగత ప్రమాద కవరేజీ మొదలైనవి యాడ్‌ ఆన్‌గా పొందాలి.

బీమా పాలసీలో వివరాలు: పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా భవిష్యత్‌లో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ప్రీమియం తగ్గుతుందని ఏదైనా ఆరోగ్య వివరాలు దాచిపెట్టడం మంచిది కాదు. వీలయితే పాలసీ తీసుకునే ముందు కంపెనీని పరీక్షల కోసం కోరడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని