Salary hike: వచ్చే ఏడాది వేతనాలు పెరగనున్నాయ్‌.. భారీ రిక్రూట్‌మెంట్లు ఈ రంగాల్లోనే..

Salary hike: వేతన జీవులకు గుడ్‌న్యూస్‌. వచ్చే ఏడాది ఉద్యోగుల వేతనాలు 10 శాతం పెరగనున్నాయి.

Updated : 16 Aug 2022 17:15 IST

ముంబయి: వేతన జీవులకు గుడ్‌న్యూస్‌. వచ్చే ఏడాది ఉద్యోగుల వేతనాలు 10 శాతం పెరగనున్నాయి. సంస్థలను వీడి ఉద్యోగులు వలసపోతున్న వేళ కంపెనీలు ఆ మేర వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు ఓ నివేదిక తెలిపింది. శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ పేరిట గ్లోబల్‌ అడ్వైజరీ, బ్రోకింగ్‌, సొల్యూషన్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ ఓ నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అధిక శాతం కంపెనీలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 శాతం మేర వేతనాలు పెంచేందుకు నిర్ణయించాయని పేర్కొంది. సగానికి పైగా కంపెనీలు (58శాతం) వేతనాలు పెంచాలని నిర్ణయిస్తే.. పావు శాతం కంపెనీలు (24.4 శాతం) మాత్రం తమ బడ్జెట్‌లో ఎలాంటి మార్పూ చేయకూడదని నిర్ణయించాయట. మరో 5.4 శాతం కంపెనీలు మాత్రం గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. 168 దేశాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికకను విడుదల చేసింది. భారత్‌లో 590 కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చూసినప్పుడు భారత్‌లోనే వేతన పెంపు అధికంగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. చైనాలో ఈ మొత్తం 6 శాతమేనని పేర్కొంది. హాంకాంగ్‌, సింగపూర్‌లో 4 శాతం చొప్పున వేతనాలు పెంపు ఉండబోతోందని నివేదిక పేర్కొంది. రాబోయే 12 నెలల్లో తమ వ్యాపారం సానుకూలంగా ఉంటుందని భారత్‌లోని 42 శాతం కంపెనీలు ఆశావహ దృక్పథంతో ఉన్నాయని నివేదిక పేర్కొంది. 7.2 శాతం కంపెనీలు మాత్రమే ప్రతికూల దృక్పథం కలిగి ఉన్నాయని తెలిపింది.

ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, టెక్నాలజీ రంగాల్లో 10.4 శాతం, మీడియాలో 10.2 శాతం, గేమింగ్‌ రంగంలో 10 శాతం వేతన పెంపుదల ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇక రాబోయే 12 నెలల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, సేల్స్‌, సాంకేతిక నైపుణ్యం కలిగిన విభాగాలు, ఫైనాన్స్‌ రంగాల్లో రిక్రూట్‌మెంట్లు భారీగా ఉండబోతున్నాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే మెరుగైన వ్యాపార పనితీరు ఉండడంతో పాటు ప్రతిభ కలిగిన వ్యక్తులను నిలుపుకొనేందుకు శాలరీలు పెంచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ ఇండియా ప్రతినిధి రాజుల్‌ మాథుర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని