బ్యాంకింగ్ ఫిర్యాదుల‌కు అవ‌కాశాలెన్నో!

ఫిర్యాదు చేసినా త‌గిన ప‌రిష్కారం చూప‌డంలో బ్యాంకులు విఫ‌ల‌మ‌వుతున్నాయా? ఫిర్యాదును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తున్నారా?..

Published : 15 Dec 2020 20:14 IST

అక్ర‌మ లావాదేవీలు అరిక‌ట్టి వినియోగ‌దారుల ఖాతాల‌కు మ‌రింత ర‌క్ష‌ణ‌ ఇచ్చే చ‌ర్య‌లు తీసుకోవాలని బ్యాంకుల‌కు గ‌త వారం ఆర్‌బీఐ ఆదేశించింది. వినియోగ‌దారుల భ‌ద్ర‌తపై జారీ అయిన ఓ నోటిఫికేష‌న్‌లో… ఆన్‌లైన్ మోసాల‌పై ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు వివిధ నియ‌మాల‌ను, గ‌డువును నిర్దిష్టంగా పేర్కొన‌డం విశేషం. వీటి గురించి మ‌రింత స‌మాచారాన్ని తెలుసుకుందాం…

ఎలాంటి ఫిర్యాదులుంటాయి?

వినియోగ‌దారుగా మీ బ్యాంకుకు వ్య‌తిరేకంగా ఏదైనా ఫిర్యాదులుంటే తొలుత సంబంధిత శాఖ‌ను సంప్ర‌దించి అక్క‌డ ఫిర్యాదును న‌మోదుచేయ‌డం క‌నీస బాధ్య‌త‌. అధీకృతం కాని ఎల‌క్ట్రానిక్ లావాదేవీలు, బ్యాంకులు త‌ప్పుడు బీమా అమ్మ‌కాలు అమ్మ‌జూప‌డం, వ‌ద్దు అని వారించినా మ్యూచువ‌ల్ ఫండ్లు మ‌న‌తో కొనుగోలు చేయించ‌డం, రుణాలు, డిపాజిట్ల‌కు సంబంధించి త‌ప్పుడు స‌మాచారం ఉండ‌డం, మొబైల్ లావాదేవీలకు సంబంధించి ర‌క‌ర‌కాల‌ ఫిర్యాదులు ఉంటాయి. వీటి గురించే ఎక్కువ సంఖ్య‌లో వినియోగ‌దారులు ఫిర్యాదులు చేస్తుంటారు.

స‌రైన ప‌రిష్కారం చూప‌క‌పోతే?

ఫిర్యాదు స్వీక‌రించిన బ్యాంకులు త‌గిన ప‌రిష్కారం చూపించాలి. అయితే అందుకు త‌గిన‌ట్టు బ్యాంకులు స్పందించ‌క‌పోతే ఏం చేయాలి?

వినియోగ‌దారులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

బ్యాంకింగ్ సేవ‌ల‌కు సంబంధించి వినియోగ‌దారుల‌ ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌ను నియ‌మిస్తుంది. ప్ర‌స్తుతానికి మ‌న దేశంలో 20 అంబుడ్స్‌మ‌న్ కేంద్రాలున్నాయి. వీరితో ఫిర్యాదు చేసేందుకు అంత‌కుముందే బ్యాంకున‌కు ఫిర్యాదు చేసిన‌ట్టుగా ఆధారం ఉండాలి. అంతే కాకుండా ఫిర్యాదుకు అనుకూలంగా బ్యాంకు చ‌ర్య‌లు ప్రారంభించిన ఏడాదిలోపే అంబుడ్స్‌మ‌న్‌ను క‌ల‌వాల్సి ఉంటుంది.

ఫిర్యాదుకు ఓ ఫార్మెట్‌

ఫిర్యాదులు చేసేందుకు ఓ ఫార్మాట్‌ను ఆర్‌బీఐ రూపొందించింది. అయితే, స‌మాచారం స‌రైన‌దిగా ఉన్నంత వ‌ర‌కూ ఎలాంటి ఫార్మెట్‌లోనైనా ఫిర్యాదు చేసేందుకు అవ‌కాశం ఉంది. క‌చ్చితంగా ఆర్‌బీఐ సూచించిన ఫార్మెట్‌నే అనుస‌రించాల‌నే నియ‌మ‌మేమీ లేదు.

అంబుడ్స్‌మ‌న్‌తోనూ సంతృప్తి చెంద‌క‌పోతే?

అంబుడ్స్‌మ‌న్ సూచించిన ప‌రిష్కారంతోనూ సంతృప్తిగా లేక‌పోతే ఏం చేయాలి?

అప్పీలేట్ అథారిటీ ఎదుట హాజ‌ర‌య్యేందుకు 45 రోజుల స‌మ‌యం ఉంటుంది. ఈ సంద‌ర్భంలో ఆర్‌బీఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ అప్పీలేట్ అథారిటీగా వ్య‌వ‌హ‌రిస్తారు.

వినియోగ‌దారు ఫోరంలోనూ…

ఆర్థిక న‌ష్టం తీవ్ర‌త‌ను బ‌ట్టి జిల్లా వినియోగ‌దారుల ఫిర్యాదుల ప‌రిష్కార ఫోరంలోనూ లేదా జాతీయ వినియోగ‌దారుల ఫోరంలోనూ కంప్ల‌యింట్ చేయ‌వ‌చ్చు.

కోర్టులో స‌వాలు చేయ‌వ‌చ్చు

బ్యాంకుకు వ్య‌తిరేకంగా కోర్టు ముందుకు కేసును తీసుకెళ్లొచ్చు. అయితే ఇది వ‌ర‌కే బ్యాంకు ఎదుట ఫిర్యాదు చేసిన‌ట్టుగా ఆధారాలు సేక‌రించాలి. ఒక వేళ అంబుడ్స్‌మ‌న్ వ‌ద్ద ఇదే ఫిర్యాదును ఉంచినా స‌రే వాటికి సంబంధించిన సాక్ష్యాలు కోర్టుకు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

కోర్టును ఆశ్ర‌యించేట‌ప్పుడు ఫిర్యాదు చేయ‌బోయే బ్యాంకుకు వ్య‌తిరేకంగా మీ వ‌ద్ద త‌గిన ఆధారాలుండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇచ్చే ఫిర్యాదు స్ప‌ష్టంగా, క్లుప్తంగా ఉండాలి. లాయ‌ర్ అవ‌స‌రం లేకుండా కేసును స్వ‌యంగా వాదించుకునేందుకు సైతం న్యాయ‌స్థాన నిబంధ‌న‌లు అంగీక‌రిస్తున్నాయి. అంబుడ్స్‌మ‌న్ వ‌ద్ద ఉచితంగా ఫిర్యాదు ఇచ్చేందుకు అవ‌కాశ‌మున్నా కోర్టులో మాత్రం కొంత ఫీజు చెల్లించాల్సి రావ‌చ్చు.

బ్యాంకు మోసాల‌కు గురైన వినియోగ‌దారుకు ఇన్ని ర‌కాల సౌల‌భ్యాల‌ను బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ, ఆర్బీఐ, ప్ర‌భుత్వాలు క‌ల్పిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకొని స‌రైన స‌మ‌యంలో స్పందించ‌డ‌మే మ‌న క‌ర్త‌వ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు