March Deadline: వీటికి ఇంకా నాలుగు రోజులే గడువు.. మరి పూర్తి చేశారా?

Important deadlines: మార్చి నెలాఖరులోగా ఆర్థిక విషయాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పూర్తి చేయకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Updated : 27 Mar 2023 20:38 IST

March deadline | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరికి వచ్చేశాం. మరో నాలుగు రోజులు ఆగితే కొత్త సంవత్సరం (2023-24) మొదలవుతుంది. కొత్త ఏడాదిలో చేయాల్సిన పనులు గురించి అటుంచితే.. ఈ ఏడాది పూర్తి చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు పూర్తి చేయకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్కటైనా మీరు చేయలేదేమో చూడండి. చేయకుంటే మార్చి 31లోగా (March 31st Deadline) పూర్తి చేయండి..

పాన్‌- ఆధార్‌కు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ఎప్పటి నుంచో చెబుతోంది వాస్తవానికి దీనికిచ్చిన గడువు ఎప్పుడో ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ చివరి అవకాశం మిగిలే ఉంది. 2023 మార్చి 31లోగా పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. రూ.1000 జరిమానా చెల్లించి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే పాన్‌ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. అదే జరిగితే బ్యాంక్‌ ఖాతాలు గానీ, డీమ్యాట్‌ అకౌంట్‌ గానీ తెరవడానికి సాధ్యపడదు. ఒకవేళ ఇప్పటి వరకు అనుసందానం చేసుకోకుంటే.. ఇప్పుడే చేసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకూ ఓ సారి గుర్తుచేయండి.
Also Read: ఆధార్‌- పాన్‌ అనుసంధానం ఇలా..

ఈ పథకానికి చివరి అవకాశం

వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (PMVVY) అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికి అండగా ఉండటమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని అందిస్తున్నారు. 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించారు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది. నెలల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పెన్షన్‌ పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. 10 ఏళ్ల పాటూ ఇదే వడ్డీ అమల్లో ఉంటుంది.

ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పథకాలకూ

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు పలు ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను ప్రవేశ పెట్టాయి. ఈ ప్రత్యేక పథకాల గడువు ఈ నెలాఖరుతో (మార్చి 31) ముగియనుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘అమృత్‌ కలశ్‌ ప్లాన్‌’ పేరుతో 400 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)ను తీసుకొచ్చింది. ఈ పథకంలో సాధారణ డిపాజిటర్లకు 7.10 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం చొప్పున వడ్డీనందిస్తోంది. ‘ఎస్‌బీఐ వుయ్‌ కేర్‌’లో డిపాజిట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 30 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీని చెల్లిస్తోంది. అయిదేళ్లు, అంతకు మించి వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో 7.50శాతం వడ్డీ లభిస్తోంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’; ఐడీబీఐ బ్యాంక్‌ ‘నమాన్‌ సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్‌’; ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ శక్తి 555 డేస్‌’; పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 300 డేస్‌’, ‘పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 601 డేస్‌’ వంటి పేర్లతో కొన్ని పథకాలు తీసుకొచ్చాయి.
Also Read: ఈ పథకాల పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ట్యాక్స్‌ ప్లాన్‌ చేశారా?

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఎలాంటి పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు పెట్టకపోయి ఉంటే.. జీవిత బీమా పాలసీలు, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌ వంటి పథకాలను పరిశీలించొచ్చు. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి ఎలాంటి మినహాయింపులూ వర్తించవు.
Also Read: ఆదాయపు పన్ను భారం కాకుండా...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని