Edible oils: వంటనూనెల ధరల కట్టడే లక్ష్యంగా.. సుంకాలపై మరో 6నెలలు రాయితీ

దేశీయంగా ధరల్ని కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాటి దిగుమతి సుంకంలో కల్పిస్తున్న రాయితీని మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Published : 02 Oct 2022 17:30 IST

దిల్లీ: వంటనూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను మార్చి 2023 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్నాయని.. ఫలితంగా దేశీయంగానూ ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. దీనికి సుంకాల రాయితీ కూడా జతకావడంతో భారత్‌లో ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపింది.

తాజా నిర్ణయంతో ముడి, రిఫైన్డ్‌ పామాయిల్‌; ముడి, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌; ముడి, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ నూనెలపై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ముడి రకాల నూనెలపై సున్నా శాతం దిగుమతి సుంకం ఉంది. అయితే, వ్యవసాయం, సామాజిక సంక్షేమ సెస్సులతో కలిపి మొత్తంగా వీటి దిగుమతిదారులు 5.5 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. అలాగే రిఫైన్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై 13.75 శాతం; రిఫైన్డ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై 19.25 శాతం పన్ను విధిస్తున్నారు.

గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. భారత్‌ తన అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో దేశీయంగానూ ధరలు కొండెక్కాయి. అందువల్లే సామాన్యులపై భారం తగ్గించేందుకు కేంద్రం పలు దఫాల్లో దిగుమతి సుంకాన్ని తగ్గించింది. భారత్‌ 2020-21 అక్టోబరుతో ముగిసిన ఆయిల్‌ మార్కెటింగ్‌ ఏడాదిలో రూ.1.17 లక్షల కోట్లు విలువ చేసే వంటనూనెల్ని దిగుమతి చేసుకుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని