Futures and Options: 90% నష్టపోతామని తెలిసినా.. వాటిలో పెట్టుబడిపై ఆసక్తి ఎందుకో?: సెబీ చీఫ్‌

Futures and Options: మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టినప్పుడే మెరుగైన లాభాలు వస్తాయని సెబీ చీఫ్‌మాధబి పురి బచ్‌ తెలిపారు.

Updated : 20 Nov 2023 19:21 IST

ముంబయి: ‘ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (F&O)’లో మదుపర్ల ఆసక్తి తనకు ఆశ్చర్యంతో పాటు గందరగోళానికి గురిచేస్తోందని సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ (Madhabi Puri Buch) అన్నారు. స్టాక్‌ మార్కెట్‌లోని ఈ విభాగంలో 90 శాతం మంది డబ్బు కోల్పోతున్నారని వెల్లడించారు. దీర్ఘకాలిక సాధనాల్లోనే మదుపర్లు పెట్టుబడి పెట్టాలని సూచించారు. బీఎస్‌ఈలో ‘ఇన్వెస్టర్‌ రిస్క్‌ రెడక్షన్‌ యాక్సెస్‌ (IRRA)’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తూ సోమవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టినప్పుడే మెరుగైన లాభాలు వస్తాయని మాధబి పురి బచ్‌  తెలిపారు. పైగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించిన రాబడి పొందడానికి ఇదే మేలైన మార్గమని సూచించారు. మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ తాజా అధ్యయనాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్‌అండ్‌ఓ (F&O)లో ఇన్వెస్ట్‌ చేసిన 45.24 లక్షల వ్యక్తిగత ట్రేడర్లలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు పొందగలిగారని సెబీ ఇటీవల వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ సెగ్మెంట్‌లో మదుపు చేస్తున్న వారి సంఖ్య 500 శాతం పెరిగిందని పేర్కొంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌ఓ (F&O)లో ఇన్వెస్ట్‌ చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారని సెబీ నివేదిక తెలిపింది. వీరు దాదాపు రూ.1.1 లక్షల కోట్ల సంపదను కోల్పోయారని వెల్లడించింది. లాభాలు పొందిన వారిలో సగటున ఒక్కొక్కరు రూ.1.5 లక్షలు ఆర్జించినట్లు తెలిపింది. 2018- 19 నాటికి ఎఫ్‌అండ్‌ఓ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారిలో 11 శాతం మంది 20- 30 ఏళ్ల వయసువారేనని పేర్కొంది.

బ్రోకింగ్‌ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకొచ్చిందే ఈ ఐఆర్‌ఆర్‌ఏ. సమస్య తలెత్తిన వెంటనే మదుపర్లకు ఎసెమ్మెస్‌ ద్వారా ఓ లింక్‌ వస్తుందని అధికారులు తెలిపారు. దాంతో ఐఆర్‌ఆర్‌ఏను డౌన్‌లోడ్‌ చేసుకొని ఓపెన్‌ పొజిషన్లను రెండు గంటల్లో స్క్వేర్‌ఆఫ్‌ చేయొచ్చని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని