పాలసీ రెన్యువల్స్‌పై డిస్కౌంట్‌ పరిశీలించండి.. బీమా కంపెనీలకు IRDAI సూచన

మూడు కొవిడ్‌ డోసులు తీసుకున్న వారికి పాలసీ రెన్యువల్స్‌పై డిస్కౌంట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ సూచించింది.

Published : 27 Dec 2022 23:53 IST

దిల్లీ: చైనా సహా పలు దేశాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా కంపెనీలకు బీమా నియంత్ర సంస్థ (IRDAI) కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. మూడు డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి సాధారణ, ఆరోగ్య బీమా పాలసీ రెన్యువల్స్‌పై డిస్కౌంట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే జీవిత బీమా, జీవిత బీమాయేతర క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని, కాగిత వినియోగాన్ని తగ్గించాలని సూచించినట్లు తెలిసింది. కొవిడ్‌-19పై గత వారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది.

తమ వెల్‌నెస్‌ నెట్‌వర్క్‌ పరిధిలో RT-PCR పరీక్షలు చేయించుకునే పాలసీ హోల్డర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా చూడాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలపై అవగాహన కల్పించాలంది. అంతర్జాతీయ ప్రయాణ బీమాకు సంబంధించి వేర్వేరు దేశాలు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నందున అవసరమైన కొవిడ్‌ పరీక్షల వివరాలను ముద్రించాలని సూచించింది.

దేశంలో కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌ల సమయంలో క్యాష్‌లెస్‌ పాలసీ ఉన్నప్పటికీ చాలా ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రులు డిపాజిట్లు స్వీకరించాయని ఐఆర్‌డీఏఐ గుర్తుచేసింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆయా ఆస్పత్రులను నిలువరించాలని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచించినట్లు తెలిసింది. కొవిడ్‌ తీవ్ర రూపం దాల్చితే కొవిడ్‌ సంబంధిత సాయం కోసం వార్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 2.25 లక్షల డెత్‌ క్లెయిమ్‌లను బీమా సంస్థలు సెటల్‌ చేసినట్లు గత వారంవిడుదల చేసిన తన వార్షిక నివేదికలో  ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని