ఆరోగ్య బీమా తీసుకునే ముందు పరిగణించాల్సిన విషయాలు..

ఆరోగ్య బీమా పాల‌సీ ప్రీమియం చెల్లింపుల‌పై ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 డీ కింద ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు

Published : 25 Dec 2020 20:35 IST

ప్ర‌స్తుత ప్ర‌పంచంలో వైద్య ఖ‌ర్చులు చుక్క‌ల‌నంటుతున్న వేళ మీకు, మీ కుటుంబ స‌భ్యులకు త‌గిన ఆరోగ్య భద్ర‌త క‌ల్పించేందుకు ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. చాలా మంది వేత‌న జీవుల‌కు వారి కంపెనీ యాజ‌మాన్యం బృంద బీమా క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ, వ్య‌క్తిగ‌త బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. అలాగే ఆరోగ్య బీమా పాల‌సీ ప్రీమియం చెల్లింపుల‌పై ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 డీ కింద రూ. 25 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు సైతం పొంద‌వ‌చ్చు. దాదాపు అన్ని బీమా కంపెనీలు ఇప్పుడు చిన్న వ‌య‌సు వారి నుంచి 65 ఏళ్ల వ్య‌క్తుల‌కు బీమా క‌వ‌రేజీ క‌ల్పిస్తున్నాయి. అలాగే ఒక‌సారి పాల‌సీని ఆమోదించిన‌ట్ల‌యితే నిష్క్ర‌మ‌ణ వ‌య‌సును కూడా అవి ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌డం లేదు. పాల‌సీల‌ను వ్య‌క్తిగ‌తంగా లేదా కుటుంబ‌మంత‌టికీ వ‌ర్తించేలా తీసుకోవ‌చ్చు. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో హామీ మొత్తాన్ని కూడా పెంచుకోవ‌చ్చు. కుటుంబ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా బీమా స‌దుపాయం లేన‌ట్ల‌యితే టాప్ ప్లాన్ ద్వారా అద‌న‌పు క‌వ‌రేజీని పొంద‌వ‌చ్చు.

మార్కెట్లో చాలా కంపెనీలు ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. అయితే బీమా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు వినియోగ‌దారులు కంపెనీ వెబ్‌సైట్‌లో పాల‌సీకి సంబంధించిన వివ‌రాలు, నిబంధ‌న‌లు, మిన‌హాయింపులు, నెట్‌వర్క్ ఆసుప‌త్రుల వివ‌రాల‌ను ప‌రిశీలించ‌డం మంచిది. ఆరోగ్య బీమా తీసుకునేట‌ప్పుడు ఈ ఐదు విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించండి.

  1. పాలసీ తీసుకునే ముందు ఆరోగ్య ప‌రీక్ష‌లు :

ఒక వ్య‌క్తి 45 ఏళ్లు దాటినా లేదా బీమా పాల‌సీలో హామీ మొత్తం ఎక్కువ‌గా ఉన్నా స‌ద‌రు కంపెనీలు పాల‌సీ తీసుకునే ముందు ముంద‌స్తు ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాయి. నియంత్ర‌ణ సంస్థ‌ల నిబంధ‌న‌లు, బీమా కంపెనీ ప‌రిధిలోని ఆసుప‌త్రులలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌ల‌కు అయ్యే వ్య‌యంలో క‌నీసం 50 శాతాన్ని బీమా కంపెనీలే భ‌రిస్తాయి.

  1. చికిత్స‌కనుగుణంగా క్లెయిం ప‌రిమితి :

ఆరోగ్య బీమా పాలసీ కింద క్లెయిమ్ చేయగల మొత్తాలకు చికిత్సల‌-వారీగా ఉన్న‌ పరిమితిని ప‌రిశీలించాలి. ఒక వేళ క్లెయిం చేసుకోగ‌ల మొత్తం బీమా కంపెనీ నిర్ధేశించిన ప‌రిమితికి మించితే, మిగ‌తా మొత్తాన్ని వినియోగ‌దారుడే భ‌రించాలి. చాలా బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఉన్న స‌మ‌యంలో రోజువారీ నగదు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.

బీమా కంపెనీల నిబంధ‌న‌లు, ఆసుప‌త్రిలో చేర‌క ముందు చేరిన త‌ర్వాత క‌ల్పించే స‌దుపాయాలు, నో క్లెయిమ్ బోన‌స్‌, వెయిటింగ్ పీరియ‌డ్ లాంటివి కంపెనీ, కంపెనీకి మారుతుంటాయి. కాబ‌ట్టి వినియోగ‌దారులు ఈ విష‌యాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం మంచిది.

  1. క్యూములేటివ్ బోన‌స్, ప్రీమియం :

బీమా పాల‌సీ తీసుకునేట‌ప్పుడు స‌ద‌రు కంపెనీ పాల‌సీ డాక్యుమెంట్‌లో గానీ ప్రాస్పెక్ట‌స్‌లో గానీ క్యుములేటివ్ బోన‌స్ ప్ర‌స్తావ‌న ఉందో లేదో జాగ్ర‌త్గా ప‌రిశీలించండి. ఒక ఏడాదిలో మీరు పాల‌సీని క్లెయిం చేసుకోక‌పోతే క్యుములేటివ్ బోన‌స్‌ని కంపెనీలు వినియోగ‌దారుల‌కు రెండు ర‌కాలుగా అందిస్తాయి.

  • పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ సంద‌ర్భాల్లో హామీ మొత్తాన్ని పెంచుతాయి లేదా

  • కట్టాల్సిన ప్రీమియం మొత్తాన్ని త‌గ్గిస్తాయి

ఒక‌వేళ పాల‌సీదారుడు క్లెయిం చేసుకుంటే, పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో బీమా కంపెనీలు ఎలాంటి ఛార్జీలు విధించకూడదు.

  1. పాల‌సీ తీసుకోక‌ముందు ఏవైనా వ్యాధులున్న‌ట్ల‌యితే :

బీమా పాల‌సీ తీసుకునే ముందు మీ పూర్తి ఆరోగ్య చ‌రిత్ర‌ను కంపెనీకి తెలియ‌జేయ‌డం మంచిది. అంత‌కుముందు ఏవైనా వ్యాధులుండి ఆ వివ‌రాలు కంపెనీకి తెలియ‌జేయ‌కుంటే మీ క్లెయింని కంపెనీలు తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డం మంచిది. చాలా కంపెనీలు ఇలాంటి సంద‌ర్భాల‌లో బీమా ఇవ్వ‌డానికి అంగీక‌రించ‌వు. ఒక‌వేళ అంగీక‌రించినా కంపెనీలు అధికంగా ప్రీమియం వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది.

  1. వెయిటింగ్ పీరియడ్, మిన‌హాయింపులు :

వినియోగ‌దారుడికి గ‌తంలో ఏవైన వ్యాధులుండి చికిత్స తీసుకుంటుంటే, బీమా కంపెనీలు వెయిటింగ్ పీరియ‌డ్‌ని అమలు చేస్తాయి. సాధార‌ణంగా ఈ వెయిటింగ్ పీరియ‌డ్ రెండు నుంచి నాలుగు సంవ‌త్స‌రాలుంటుంది. వెయిటింగ్ పీరియ‌డ్‌లో ఉన్న స‌మ‌యంలో మీకు బీమా హామీ ఉండ‌దు కాబ‌ట్టి ఇప్పటికే ఉన్న వ్యాధుల కార‌ణంగా మీకు ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఆరోగ్య స‌మ‌స్య‌లుండ‌న‌టువంటి చిన్న వ‌య‌సులోనే పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. అలాగే పాల‌సీని ఒక కంపెనీ నుంచి మ‌రో కంపెనీకి మార్చుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని