Instant Loans: ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ లోన్‌.. ఈ అంశాలు పరిశీలించాల్సిందే..!

ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్‌ లోన్‌ తీసుకునే ముందు దరఖాస్తుదారులు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Updated : 09 Jul 2024 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటితో పోలిస్తే రుణాల లభ్యత బాగా పెరిగింది. ప్రముఖ బ్యాంకులు, ప్రైవేట్‌ రుణ సంస్థలే కాకుండా ఆన్‌లైన్‌లో అనేక యాప్‌లు రుణాలను విరివిగా ఇస్తున్నాయి. కేవలం కొన్ని క్లిక్‌లతో రుణం లభించడం ఈ రుణ యాప్‌లతో సాధ్యమవుతోంది. అయితే, వేగంగా రుణం పొందాలనుకునేవారు ఇలాంటి రుణాలను ఆశ్రయిస్తున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదరవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రుణ సంస్థ విశ్వసనీయత

డబ్బుకు సంబంధించిన విషయానికొస్తే.. రుణ సంస్థకు సంబంధించిన విశ్వసనీయత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రుణ సంస్థలు రుణం తీసుకునేవారి విశ్వనీయతను అంచనా వేస్తాయి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రుణం తీసుకునేవారు కూడా.. తాము ఎంచుకున్న ప్లాట్‌ఫామ్‌ కూడా విశ్వసనీయమైనదని, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధరించుకోవాలి. కస్టమర్‌ రేటింగ్స్‌ను తనిఖీ చేయడం ద్వారా రుణ సంస్థకు సంబంధించిన పేరు ప్రఖ్యాతలను పరిశోధించాలి. ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌.. పబ్లిక్‌ కోసం కాబట్టి, దీన్ని వెబ్‌సైట్స్‌, యాప్‌ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోన్‌ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఇలాంటి యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేయడం సురక్షితం. 

యాప్‌ ప్రామాణికత

మీరు ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ ద్వారా త్వరితరుణం తీసుకునే ముందు తప్పనిసరిగా యాప్‌ ప్రామాణికతను ధ్రువీకరించాలి. యాప్‌ లేదా దాని కంపెనీకి ఆఫ్‌లైన్‌ చిరునామా, వెబ్‌సైట్‌ ఉందని నిర్ధరించుకోవాలి. చట్టబద్ధమైన సంస్థలు సాధారణంగా వారి పేరు, ఫోన్‌ నంబర్‌, భౌతిక చిరునామా, ఇ-మెయిల్స్‌ను పారదర్శకత కోసం వారి వెబ్‌సైట్‌లో తెలుపుతారు. లోన్‌ యాప్‌నకు సంబంధించిన మాతృ సంస్థను పరిశోధించడం, యాప్‌నకు లింక్‌ అయిన విశ్వసనీయ అధికారిక వెబ్‌సైట్‌ ఉందని నిర్ధరించుకోవడం మేలు. రుణ యాప్‌కు వెబ్‌సైట్‌ లేకపోతే స్కామ్‌ పొంచి ఉందని అనుమానించాలి. మరీ ముఖ్యంగా రుణ సంస్థ.. ఆర్‌బీఐలో రిజిస్టర్‌ అయ్యిందో లేదో తనిఖీ చేయాలి.

నిబంధనలు, షరతులు

ఆన్‌లైన్‌ యాప్స్‌కు సంబంధించిన రుణాల నిబంధనలు, షరతులు సాధారణ బ్యాంకులు, ఆర్థిక సంస్థల కంటే భిన్నంగా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని యాప్‌లు ఆర్‌బీఐ నిబంధనలు, పరిధిలో ఉండవు. కాబట్టి మీరు ఒక ఈఎంఐని కోల్పోయినా.. ఈ యాప్‌ల రికవరీ ప్రక్రియ సాధారణ బ్యాంకుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీ సిబిల్‌ స్కోర్‌, క్రెడిట్‌ యోగ్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇన్‌స్టెంట్‌ లోన్‌ పొందే ముందు రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా సమయాన్ని వెచ్చించండి. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులు, ఆలస్య చెల్లింపు రుసుములు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, జీఎస్‌టీ, ఇంకా వర్తించే ఏవైనా ఇతర ఛార్జీలపై శ్రద్ధ వహించాలి. దీనివల్ల రుణానికి సంబంధించిన మొత్తం ఖర్చులు ఎన్ని ఉంటాయో, ఎలాంటివి ఉంటాయో తెలుస్తాయి.

వడ్డీ రేట్లు

ఏదైనా రుణ ఒప్పందంలో వడ్డీ రేట్లు కీలకమైన అంశం. ఈ వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు రుణ సంస్థకు, రుణ సంస్థకు మధ్య మారొచ్చు. ఇన్‌స్టెంట్‌ లోన్‌ వేగంగా లభించినప్పటికీ సంప్రదాయ రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి, వివిధ రుణ సంస్థల వడ్డీ రేట్లను సరిపోల్చండి. పోలిక సౌలభ్యం కోసం ప్రధాన ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లను ఒకే చోట జాబితా చేసే ఆర్థిక వెబ్‌సైట్‌లు కూడా ఉన్నాయి. దరఖాస్తుదారులు మార్కెట్‌పై సమగ్ర సర్వే నిర్వహించి, అత్యంత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో కూడిన రుణ సంస్థను ఎంచుకోవాలి.

రుణం, తిరిగి చెల్లింపులు

రుణ మొత్తాన్ని నిర్ణయించే ముందు మీ ఆర్థిక అవసరాలను నిష్పక్షపాతంగా అంచనా వేయండి. అవసరానికి మించి రుణం తీసుకోవడం వల్ల తిరిగి చెల్లించేటప్పుడు అనవసర భారం పడుతుంది. మీ ఈఎంఐ మొత్తం నెలవారీ ఆదాయంలో 40 శాతాన్ని మించకూడదు. అదేవిధంగా, తిరిగి చెల్లింపు నిబంధనలను జాగ్రత్తగా అంచనా వేయండి. తక్షణ రుణాల తిరిగి చెల్లింపులు తరచుగా తక్కువ కాలవ్యవధితో వస్తాయి. ఇలా తిరిగి చెల్లింపుల ప్రణాళికకు కట్టుబడి ఉండే ముందు మీ నెలవారీ బడ్జెట్‌, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావాన్ని అర్థం చేసుకోండి. కొన్ని రుణ సంస్థలు.. రుణగ్రహీత నిజంగా ఆర్థిక ఇబ్బందులు గురయినప్పుడు, రుణ పునర్నిర్మాణం లేదా కాలవ్యవధి పొడిగింపులు వంటి ఎంపికలను అందించవచ్చు. లేదా డిఫాల్ట్‌ అయినప్పుడు జరిమానాలు విధించొచ్చు. ఇలాంటి పరిణామాలను రుణ దరఖాస్తుదారులు ముందుగానే తెలుసుకుని సిద్ధంగా ఉండాలి.

కస్టమర్‌ సర్వీస్‌

ఏదైనా ఆర్థికపరమైన విషయాల్లో సంబంధాలు ఏర్పరచుకునేముందు ఆయా సంస్థలు వినియోగదారులకు ఎలాంటి సర్వీసులు అందిస్తున్నాయో తెలుసుకోవాలి. ఆన్‌లైన్‌లో రుణం తీసుకునేటప్పుడు ఈ విషయంలో మరింత అప్రమత్తతగా ఉండాలి. ప్రశ్నలు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి స్పందించే రుణ వేదికను ఎంచుకోండి. రుణ సంస్థ నుంచి చాట్‌, ఫోన్‌, ఇ-మెయిల్‌ ద్వారా వినియోగదారుడికి త్వరితగతిన సేవలు లభించినప్పుడు రుణగ్రహీతకు విలువైన సమయం వృథా కాకుండా ఉంటుంది. పరిష్కారం కూడా వెంటనే లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని