Loans: డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా రుణం తీసుకుంటున్నారా?

రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు ఎంచుకున్న డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ ఆర్బీఐ వద్ద రిజిస్ట‌ర్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి.

Updated : 11 Apr 2022 15:50 IST

భార‌త వ్య‌క్తిగ‌త రుణాల విభాగంలో ఫిన్‌టెక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. దీనికి కార‌ణం, బ్యాంకులతో పోలిస్తే ఫిన్‌టెక్ సంస్థ‌లు ఆన్‌లైన్ ద్వారా సౌక‌ర్య‌వంతంగా, అత్యంత‌ వేగంగా రుణాల‌ను మంజూరు చేయ‌డ‌మే. లాక్‌డౌన్ స‌మ‌యంలో డిజిట‌ల్ మాధ్యమాల‌పై ఆధార‌ప‌డ‌టం కూడా క‌లిసొచ్చింది. ప్ర‌త్యేకించి చిన్న చిన్న‌ రుణాల విష‌యంలో ల‌భ్య‌త అధికంగా ఉండ‌డంతో వినియోగ‌దారులు డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా బంగారంపై, వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకునే ముందు కొన్ని అంశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. 

విశ్వ‌స‌నీయ‌తను ధృవీక‌రించండి..
ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్ ద్వారా బంగారం లేదా వ్య‌క్తిగత రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు ఆ ఫ్లాట్‌ఫామ్ గురించి స‌మ‌గ్ర ప‌రిశోధ‌న అవ‌స‌రం. విశ్వసనీయతను ధృవీక‌రించుకోవ‌డం చాలా ముఖ్యం. మీరు ఎంచుకున్న డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్ రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వ‌ద్ద రిజిస్ట‌ర్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి. ఆర్‌బీఐతో నేరుగా గానీ, ఆర్‌బీఐ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన సంస్థకు అనుసంధాన‌మైన‌ భాగస్వామ్య సంస్థ‌గానీ అయ్యి ఉండాలి. ముందుగా ఈ విష‌యాన్ని ధృవీక‌రించుకోవాలి. ఇప్ప‌టికే నిర్ధిష్ట‌ సంస్థ ద్వారా రుణాలు తీసుకున్న క‌స్ట‌మ‌ర్ల రివ్యూల‌ను ప‌రిశీలించి కూడా విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చు. 

రుణ ర‌కం..
రుణం తీసుకునే ముందు మీ రుణ అవ‌స‌రం ఏంటి?స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక రుణమా?హామీ ఇస్తున్నారా?మీకు కావాల్సిన మొత్తానికి ఏ ర‌క‌మైన రుణం ఎంచుకుంటే సరిపోతుంది?చెల్లింపులు ఎలా?త‌దిత‌ర విష‌యాల‌ను ముందుగా తెలుసుకుని..త‌ర్వాత మాత్ర‌మే రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

వ‌డ్డీ రేట్లు..
రుణ ఎంపిక‌లో కీల‌క‌మైన అంశం వ‌డ్డీ రేట్లు. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసే ముందు రుణ‌దాత అందిస్తున్న వ‌డ్డీ రేట్ల‌ను ప‌రిశీలించాలి. అన్ని సంస్థ‌లు ఒకే ర‌క‌మైన వ‌డ్డీ రేటుతో రుణాలు అందించ‌వు. కాబ‌ట్టి ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ సంస్థ‌లు అందించే వ‌డ్డీ రేట్ల‌ను పోల్చి చూడాలి. డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో 'ప్రాసెసింగ్ ఫీజు' త‌క్కువ‌గా ఉంటుంది, త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణాలు ల‌భించే అవ‌కాశం ఉంటుంది. వ్య‌క్తిగ‌త రుణాల‌తో పోలిస్తే బంగారంపై రుణాలు త‌క్కువ వ‌డ్డీకి ల‌భిస్తాయి. 

స్కీమ్‌ను అర్థం చేసుకోండి..
మీరు ఏదైనా రుణాన్ని ఖరారు చేసి, ఒప్పంద ప‌త్రంలో సంతకం చేసేముందు..సంబంధిత ప‌త్రంలోని ప్ర‌తీ నిబంధన/షరతును జాగ్ర‌త్త‌గా చ‌ద‌వండి. మీరు ఎంపిక చేసుక‌న్న‌ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ న‌మ్మ‌క‌మైన‌దైతే రుణాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ముందుగానే తెలియజేస్తుంది. బంగారు రుణాల విషయానికి వ‌స్తే, రుణ దాత‌లు ప్ర‌ధానంగా రెండు ప‌థ‌కాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. స్థిర, అస్థిర‌ వ‌డ్డీ రేట్లతో రుణ గ్ర‌హీత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా రుణాలు అందిస్తున్నాయి. 

చెల్లింపుల విధానం..
ఆన్‌లైన్ లెండింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు చెల్లింపుల‌కు వివిధ ర‌కాల ఆప్ష‌న్లు ఇస్తుంటాయి. అందుబాటులో ఉన్న చెల్లింపు మార్గాల‌ను తెలుసుకుంటే..మీకు అనుకూల‌మైన మార్గంలో చెల్లింపులు చేయ‌వ‌చ్చు. రుణ గ్ర‌హీత త‌ప్ప‌నిస‌రిగా బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ లేదా భాగ‌స్వామ్య ఫ్లాట్‌ఫామ్‌తో న‌మోదుచేసిన అధికారిక ఖాతాల ద్వారా మాత్ర‌మే చెల్లింపులు చెయ్యాలి. మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయ‌కూడ‌దు. డిజిట‌ల్‌గా చెల్లింపులు చేస్తే..మీరు చెల్లింపుల‌ను ట్రాక్ చేసేందుకు వీలుంటుంది. 

క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్‌..
మంచి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లు వినియోగ‌దారుని సౌలభ్యం కోసం 'రియల్-టైమ్ కస్టమర్ సర్వీస్' ద్వారా సహాయాన్ని అందిస్తూ, వినియోగ‌దారునికి ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ-మెయిల్‌, ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా వ‌డ్డీ, అసలు చెల్లింపుల తేదీల‌ను గుర్తు చేస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని