గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? ఈ ఛార్జీలను పరిశీలించండి..

ఆస్తి హక్కు బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును స్టాంప్ డ్యూటీ అంటారు

Updated : 04 Apr 2022 14:15 IST

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చుకోవడానికి చాలా మంది గృహ రుణాలను ఒక మంచి అవకాశంగా భావిస్తారు. సాధారణంగా గృహ రుణాలను దీర్ఘకాలం పాటు చెల్లించాల్సి ఉంటుంది, దానిని ఎంచుకునే సమయంలో అత్యంత జాగ్రత్త వహించడం మంచిది. రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే రుణగ్రహీతలు అన్నిటికంటే ముందు వడ్డీరేట్లను పరిశీలిస్తుంటారు. కానీ వారికి అందులోని చాలా రకాల, ముఖ్యమైన ఇతర ఛార్జీల గురించి తెలియదు. గృహ రుణాలలో మీకు తెలియని అనేక ఇతర రకాల ఛార్జీల గురించి తెలుసుకుందాం. 

1. తిరిగి చెల్లించే విధానాన్ని మార్చుకోడానికి విధించే ఛార్జీలు :

చాలామంది రుణగ్రహీతలు వారి ప్రస్తుత చెల్లింపు విధానాన్ని మార్చాల్సిందిగా బ్యాంకులను అభ్యర్థిస్తూ ఉంటారు. కొందరు ఈసీఎస్ విధానాన్ని ఇష్టపడుతుండగా, మరికొందరికి పోస్ట్ డేటెడ్ చెక్ విధానం సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, రుణగ్రహీత అభ్యర్ధన ప్రకారం, అనేక బ్యాంకులు తీసుకున్న రుణానికి తిరిగి చెల్లించే విధానాన్ని ఈసీఎస్ నుంచి చెక్కు విధానానికి, అలాగే చెక్కు నుంచి ఈసీఎస్ విధానానికి మార్చడానికి కొంత ఛార్జీలను వసూలు చేస్తాయి. ఈ ఛార్జీలు సాధారణంగా రూ. 500 వరకు ఉంటాయి, అలాగే ఇవి ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా మారుతూ ఉంటాయి. 

2. ఫ్రాంకింగ్ ఛార్జీలు :

గృహ రుణ దరఖాస్తును ప్రాసెస్ చేస్తున్నప్పుడు అనేక బ్యాంకులు 'ఫ్రాంకింగ్' ఛార్జీలను వసూలు చేస్తారు. సాధారణంగా వీటిని స్టాంప్ డ్యూటీ ఫీజు అని కూడా పిలుస్తారు. అంటే, స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు ఒక నిర్ధారణ పత్రం. ఆస్తి హక్కు బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును స్టాంప్ డ్యూటీ అంటారు. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ఒక్కో రాష్టానికి ఒక్కోలా మారుతూ ఉంటాయి. ఈ ఛార్జీలు రాష్టంలోని చట్టాలు, ఆస్తి రకం, ఆస్తి ఉన్న ప్రదేశం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. 

3. సీఈఆర్ఎస్ఏఐ ఛార్జీలు :

సీఈఆర్ఎస్ఏఐ (సెంట్రల్ రిజిస్ట్రీ అఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్) అనేది సెంట్రల్ ఆన్ లైన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఒకే ఆస్తి పై అనేక బ్యాంకుల నుంచి తీసుకునే బహుళ రుణాల కారణంగా జరిగే మోసాన్ని నిరోధించాలానే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. బ్యాంకు, రుణగ్రహీత వివరాలతోపాటు, ఆస్తిపై తీసుకున్న రుణాలకు సంబంధించిన కేంద్ర రిజిస్ట్రీని సీఈఆర్ఎస్ఏఐ నిర్వహిస్తుంది.

బ్యాంకులు ఎవరికైనా రుణాన్ని మంజూరు చేసే ముందు, రుణగ్రహీత తనఖా పెట్టిన ఆస్తిపై ఏవైనా రుణాలు ఉన్నాయేమోననే విషయాన్ని తెలుసుకోడానికి సీఈఆర్ఎస్ఏఐ వెబ్ సైట్ ని తనిఖీ చేస్తాయి. బ్యాంకులు తాము నిర్ణయించిన వడ్డీ వివరాలను 30 రోజుల్లోగా సీఈఆర్ఎస్ఏఐ కు నమోదు చేయాలి. ఈ ప్రక్రియ కోసం రుణగ్రహీత నుంచి నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తారు. ఈ ఛార్జీలను సీఈఆర్ఎస్ఏఐ నిర్దేశిస్తుంది. ఒకవేళ రుణ మొత్తం రూ. 5 లక్షల వరకు ఉంటే, రుణ మొత్తానికి రూ. 50 లను ఛార్జీలుగా నిర్దేశించారు, అదే రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు రూ. 100 వసూలు చేస్తారు. 

4. ఓవర్ డ్యూ ఛార్జీలు:

ఈఎంఐలను చెల్లించడంలో రుణగ్రహీత ఆలస్యం చేసినా, చెల్లించలేకపోయినా లేదా డిఫాల్టర్ గా మారినా, అలాంటి సందర్భాల్లో రుణగ్రహీత ఓవర్ డ్యూ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చేసిన చెల్లింపులకు బ్యాంకులు జరిమానా విధిస్తారు. సాధారణంగా అవుట్ స్టాండింగ్ డ్యూ / ఓవర్ డ్యూ ఛార్జీలు సంవత్సరానికి 24 శాతం (నెలకు 2 శాతం) కంటే ఎక్కువగా ఉంటాయి. అందువలన మీరు సకాలంలో ఈఎంఐలను చెల్లించడానికి ప్రయత్నించండి. 

5.  బౌన్స్ ఛార్జీలు:

ఒకవేళ మీరు ఈసీఎస్ విధానం ద్వారా లేదా 'పీడీసీ'ల ద్వారా ఈఎంఐ చెల్లింపు చేస్తున్నట్లైతే, నిర్దేశించిన తేదీన మీ బ్యాంకు ఖాతాలో తగినంత నిధులను ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ తగినన్ని నిధులను నిర్వహించడంలో విఫలమైనట్లైతే, అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా, ఇటువంటి వారి నుంచి బ్యాంకులు రూ. 500 వరకు ఛార్జీలను వసూలు చేస్తారు.  ఈ ఛార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా మారుతూ ఉంటాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని