స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

సిప్ విధానంలో పెట్టుబడులు పెడితే రిస్క్‌ తగ్గడంతో పాటు, అధిక లాభాలు గడించటానికి అవ‌కాశం ఉంటుంది. 

Updated : 22 Jan 2022 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువల్‌ ఫండ్లలో మ‌దుపు చేసే వారు త‌మ‌ న‌ష్టభ‌యాన్ని అనుస‌రించి ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. న‌ష్టభయం ఉన్నప్పటికీ వృద్ధిని కోరుకునే వారు ఈక్విటీ  ఫండ్లలో మ‌దుపు చేస్తారు. ఈక్విటీ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇందులో లార్జ్‌కాప్‌ ఫండ్లలో కాస్త రిస్క్ తక్కువగా ఉంటుంది. అదే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్లలో నష్టభయం ఎక్కువ‌గా ఉంటుంది. రాబ‌డి కూడా అధికంగానే ఉండొచ్చు.

రూ.5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్‌ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) కలిగి ఉన్న పబ్లిక్‌గా ట్రేడెడ్ కంపెనీల స్టాక్‌లను స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. ఈ విభాగానికి చెందిన కంపెనీల షేర్లు కొనుగోలు చేసి లాభాలు ఆర్జించాలనుకునే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లుగా భావిస్తారు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు తమ దగ్గర ఉన్న నిధుల్లో 65 శాతం నిధుల‌ను స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీల షేర్లు కొనుగోలు చేయడానికే కేటాయించాలి. మిగిలిన 35 శాతం సొమ్ముతో ఇతర విభాగాలకు చెందిన షేర్లు, రుణపత్రాలు కొనుగోలు చేయొచ్చు.

సాధారణంగా కంపెనీలు చిన్నగా తమ ప్రయాణాన్ని ప్రారంభించి క్రమేణా పెద్ద కంపెనీలుగా ఎదుగుతాయి. ఇటువంటి కంపెనీలను గుర్తించి పెట్టుబడి పెట్టే అవకాశం స్మాల్‌ క్యాప్‌ ఫండ్లకు ఉంటుంది. అది కూడా ఫండ్‌ మేనేజర్ సామ‌ర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలు వ‌చ్చే అవకాశం ఉంటుంది. ఒక‌వేళ ఫండ్‌ మేనేజర్‌ అంచనాలు తప్పయినా, మార్కెట్లు భారీగా నష్టపోవాల్సి వచ్చినా స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల విలువ వేగంగా త‌గ్గిపోతుంది. మళ్లీ కోలుకోవటానికి చాలా సమయం పట్టొచ్చు. అందుకే ఈ త‌ర‌హా ఫండ్లను ఎంచుకునే ముందు కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి.

ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల్సిన అంశాలు..
మ‌దుప‌రి రిస్క్ ఫ్రొఫైల్‌: స్మాల్ క్యాప్ ఫండ్లు స్వల్పకాలంలో వ్యాపారంలో వృద్ధి క‌న‌బరిచిన చిన్న కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబ‌డులు పెడుతుంటాయి. ఇవి ఎంత వేగంగా వృద్ది చెందుతాయో.. అంతే వేగంగా ప‌త‌నం అయ్యే ప్రమాదమూ ఉంది. అందువ‌ల్ల అధిక రిస్క్ తీసుకోగ‌లిగి.. మార్కెట్ల గురించి పూర్తి అవ‌గాహ‌నతో పెట్టుబ‌డులు పెట్టాలి. ఎప్పుడు నిష్క్రమించాలో తెలిసిన పెట్టుబ‌డిదారుల‌కు మాత్రమే ఇవి స‌రిపోతాయి. స్మాల్ క్యాప్ సూచీ బాగా ప‌త‌న‌మైంది కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌దుపుచేస్తే రాబ‌డి క‌చ్చితంగా వ‌స్తుంద‌ని అనుకోవ‌ద్దు. ఇవి న‌ష్టభయం అధికంగా ఉండేవి కాబ‌ట్టి ఈ ఫండ్లను ఎంచుకునే ముందు మ‌దుప‌ర్లు త‌మ న‌ష్టభ‌యాన్ని అంచ‌నా వేసుకోవాలి. పెట్టుబ‌డి పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ట్రాక్ రికార్డు చెక్ చేయాలి: పెట్టుబడి కోసం ఎంచుకున్న ఫండ్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. బుల్, బేర్ మార్కెట్లు రెండింటిలోనూ మ‌దుప‌ర్లు స్మాల్ క్యాప్ ఫండ్స్ పనితీరును తనిఖీ చేయాలంటారు నిపుణులు. పనితీరు సరిగా లేని ఫండ్ల నుంచి మెరుగైన పనితీరు కనబరుస్తున్న స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది. రాబడి చూసేటప్పుడు కనీసం 5 ఏళ్ల పైన చూడడం మంచిది.

ఇంకా ఏం చూడాలి?: మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకునేటప్పుడు కొన్ని నిష్పత్తులు చూడడం మంచిది. బీటా నిష్పత్తి ఒకటి కంటే తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉన్నట్టు అర్థం. అలాగే, ఆల్ఫా రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత రాబడి అందించగలదని అర్థం. అదే క్యాటగిరీలో ఉన్న ఫండ్స్ని పరిశీలించడం మంచిది.

సిప్ ద్వారా పెట్టుబ‌డులు: ఇటువంటి పథకాల్లో ఒకేసారి పెట్టుబడి పెడితే ‘టైమింగ్‌ రిస్కు’ను ఎదుర్కొనాల్సి వస్తుంది. మార్కెట్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పుడు స్మాల్‌ క్యాప్‌  పథకాల్లో పెట్టుబడి పెడితే... ఆ తర్వాత మార్కెట్ ప‌త‌న‌మైతే పెట్టిన పెట్టుబడి విలువ క్షీణిస్తుంది. పెట్టిన సొమ్ము వెనక్కి రావ‌డానికి ఎంతో కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. దీనికి బదులు క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (సిప్‌) అనుసరించి నెలసరి వాయిదాల పద్ధతిలో పెట్టుబడులు పెడితే రిస్క్‌ తగ్గిపోవటంతో పాటు, అధిక లాభాలు గడించటానికి అవ‌కాశం ఉంటుంది. అయితే, సిప్‌లో కచ్చితమైన రాబడి వస్తుందని చెప్పలేం. ఇది రిస్క్ తగ్గించే ప్రక్రియ మాత్రమే.

ఇది సరైన సమయమేనా?: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు ఎప్పుడు పెట్టొచ్చు అంటే సమాధానం చెప్పటం కష్టం. స్టాక్‌మార్కెట్లు ఎప్పుడు వృద్ధి చెందుతాయో ఎప్పుడు ప‌త‌న‌మ‌వుతాయో చెప్పలేం. అందువల్ల సిప్‌ పద్ధతిలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చు. తద్వారా ‘టైమింగ్‌ రిస్క్‌’ను అధిగమించొచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే మార్కెట్‌ స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, ఎంచుకున్న స్మాల్‌ క్యాప్‌ పథకం పోర్ట్‌ఫోలియోను, దాని పనితీరును నిశితంగా పరిశీలించి... ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. పెద్దమొత్తంలో డబ్బు ఉంటే 12-15 నెలల సిప్ చేయొచ్చు. మార్కెట్ భారీగా పతనం అయినప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉంటే అధిక యూనిట్స్ సమకూర్చుకోవచ్చు.

చివరగా..: పెట్టుబడులన్నీ ఒకే చోట పెట్టడం మంచిది కాదు. ఫోర్ట్‌ఫోలియోలో వైవిధ్యత ఉండాలి. అందువల్ల లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ పథకాలతో పాటు కొంత మేరకు రుణ పథకాల్లో పెడుబడులు పెట్టడం శ్రేయస్కరం. అదే విధంగా తమ పెట్టుబడి మొత్తంలో 20 శాతం వరకూ స్మాల్‌ క్యాప్‌ పథకాలకు కేటాయిస్తే లాభాలను పెంచుకునే (ప్రాఫిట్‌ మాగ్జిమైజేషన్‌) అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని