Health Insurance: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా? ఈ అంశాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి!

ఆరోగ్య బీమా పాల‌సీ క‌వ‌రేజ్ ఆ వ్య‌క్తి వార్షిక‌ ఆదాయానికి క‌నీసం 1.5 రెట్లు ఉండాలి.

Published : 13 Jul 2022 16:04 IST

ఆరోగ్య బీమా (Health Insurance) లేకుంటే.. అనారోగ్యం, ఆసుప‌త్రి ఖ‌ర్చులు ఆర్ధికంగా భారం అవుతాయి. అలాగే చాలీచాల‌ని క‌వ‌రేజ్‌, పాల‌సీకి వ‌ర్తించే కొన్ని లిమిట్స్ వ‌ల్ల ఆరోగ్య బీమా ఉన్నా.. ఆర్థిక భారం త‌ప్ప‌దు. అందువ‌ల్ల ఆరోగ్య బీమా కొనుగోలు చేసేట‌ప్పుడు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ముఖ్యంగా హామీ మొత్తం, ప‌రిమితుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. 

ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు పరిగ‌ణించాల్సిన కొన్ని ముఖ్య అంశాలు..

1. క‌వరేజ్‌/హామీ మొత్తం..
ఆరోగ్య బీమా పాల‌సీ..ఆ ఏడాదిలో అన్ని వైద్య ఖ‌ర్చుల‌ను క‌వర్ చేసే విధంగా ఉండాలి. ఒక వ్య‌క్తి త‌న ఆదాయాన్ని ప‌రిశీలించి తాను చెల్లించ‌గ‌ల ప్రీమియంతో లాభ‌దాయ‌కంగా ఉండే పాల‌సీని ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్య బీమా పాల‌సీ క‌వ‌రేజ్ ఆ వ్య‌క్తి వార్షిక‌ ఆదాయానికి క‌నీసం 1.50 రెట్లు ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కి, ఒక వ్య‌క్తి వార్షిక ఆదాయం రూ. 8 ల‌క్ష‌లు అనుకుందాం. ఆ వ్య‌క్తి ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండ‌డం మంచిది.  

2. సూప‌ర్ టాప్-అప్ ప్లాన్‌..
ప్ర‌స్తుతం వైద్య ఖ‌ర్చుల‌కు ల‌క్షల్లో ఖ‌ర్చ‌వుతుంది. ఎక్కువ క‌వ‌రేజ్‌తో పాల‌సీ తీసుకుంటే ప్రీమియం చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఇలాంటి సంద‌ర్భంలో కొంత వ‌ర‌కు సాధార‌ణ ఆరోగ్య బీమాను తీసుకుని.. ఆ త‌ర్వాత సూప‌ర్‌ ట‌ప్ - అప్ ప్లాన్‌ను తీసుకుంటే ఎక్కువ క‌వ‌రేజ్ ల‌భిస్తుంది. అలాగే ఖ‌ర్చు త‌గ్గుతుంది. 

3. నో క్లెయిమ్ బోన‌స్ (NCB)..
ఎన్‌సీబీ అనేది బీమా సంస్థ పాల‌సీదారుల‌కు అందించే ప్రోత్సాహ‌కం. ఆరోగ్య బీమా క్లెయిమ్ చేయ‌ని సంవ‌త్స‌రాల‌కు గానూ బీమా సంస్థ పాల‌సీదారునికి నో క్లెయిమ్ బోన‌స్‌ను అందిస్తుంది. పాల‌సీదారులు త‌గిన వ్యాయామం చేస్తూ, ఆహారపు అల‌వాట్ల‌ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే..ఆసుప్ర‌తిలో చేరాల్సి అవ‌స‌రం ఉండ‌దు. త‌ద్వారా క్లెయిమ్‌లు త‌క్కువ‌య్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి, పాల‌సీదారుల‌ను ప్రోత్స‌హించేందుకు బీమా సంస్థ‌లు నో క్లెయిమ్ బోన‌స్‌ను అందిస్తున్నాయి. ఇది మీరు ఎంచుకున్న‌ సంస్థ‌, పాల‌సీని బ‌ట్టి మారుతుంటుంది. 5 శాతం నుంచి 50 శాతం వ‌ర‌కు కూడా బీమా సంస్థ‌లు ఎన్‌సీబీని అందిస్తున్నాయి.  

ఎన్‌సీబీతో త‌ర్వాతి సంవ‌త్స‌రం ప్రీమియం త‌గ్గించుకోవ‌చ్చు, లేదా అదే ప్రీమియంతో హామీ మొత్తాన్ని పెంచుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావంతో వైద్య చికిత్స‌ల‌కు అయ్యే ఖ‌ర్చు భారీగా పెరుగుతుంది. కాబ‌ట్టి, క్లెయిమ్ చేయ‌ని సంవ‌త్స‌రాల‌కు గానూ ల‌భించే ఎన్‌సీబీతో క‌వ‌రేజ్‌ను పెంచుకోవ‌డం మంచిది.

4. వ్యాధుల క‌వ‌రేజ్‌పై ప‌రిమితి ఉండ‌కూడ‌దు..
బీమా సంస్థ‌లు కొన్ని గ్రూప్‌ పాల‌సీల‌ను డిసీజ్ వైజ్ క్యాపింగ్‌తో అందిస్తున్నాయి. అంటే నిర్ధిష్ట వ్యాధులపై ప‌రిమిత క‌వ‌రేజ్‌ను మాత్ర‌మే అందిస్తున్నాయి. ఉదాహ‌ణ‌కి, ఒక వ్య‌క్తి రూ. 5 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌తో, రూ. 1 ల‌క్ష‌ డిసీజ్ వైజ్ క్యాపింగ్ ఆప్ష‌న్‌ పాల‌సీ తీసుకున్నాడు అనుకుందాం. ఆ వ్య‌క్తి డిసీజ్ వైజ్ క్యాపింగ్ ఆప్ష‌న్ వ్యాధుల జాబితాలోని వ్యాధితో ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌చ్చిన‌ప్పుడు రూ. 2 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యితే..రూ. 1 ల‌క్ష మాత్ర‌మే బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగిలిన మొత్తం స్వ‌యంగా పాల‌సీదారుడే చెల్లించాలి. అందువ‌ల్ల ఆరోగ్య బీమా పాల‌సీలో జాబితా చేయ‌బ‌డిన‌ వ్యాధులకు పూర్తి క‌వ‌రేజ్ అందేలా చూసుకోవాలి. 

5. గ‌ది అద్దె, ఐసీయూ ఛార్జీలు, సహ చెల్లింపులు..
కొన్ని పాల‌సీల‌లో గ‌ది అద్దె చెల్లింపులు, ఐసీయూ ఛార్జీల‌పై ప‌రిమితి ఉంటుంది. ప‌రిమితి వ‌ర‌కు మాత్ర‌మే బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆ త‌ర్వాత అద‌న‌పు మొత్తాన్ని పాల‌సీదారుడే చెల్లించాలి. అలాగే, స‌హ చెల్లింపులు ఉన్న పాల‌సీని తీసుకుంటే చికిత్సకు అయిన మొత్తం ఖ‌ర్చులో పాల‌సీలో పేర్కొన్న శాతం మేర మాత్ర‌మే బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగిలిన‌ది పాల‌సీదారుడు చెల్లించాలి. అందువ‌ల్ల పాల‌సీలో ఇటువంటి పరిమితులు లేకుండా చూసుకోవాలి. 

6. అద‌న‌పు ఫీచ‌ర్లు..
కొన్ని పాల‌సీలు ప్ర‌తీ సంవ‌త్స‌రం ఉచితంగా హెల్త్ చెక‌ప్‌ల‌ను అందిస్తున్నాయి. ఈ రోజుల్లో త‌రుచూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం తప్ప‌డం లేదు కాబ‌ట్టి దీని వ‌ల్ల హెల్త్ చెక‌ప్‌ల‌కు అయ్యే ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఫ్లామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీ తీసుకున్న వారు 'రీస్టోరేష‌న్‌/రీఫిల్' ఆప్ష‌న్‌తో కూడిన పాల‌సీని ఎంచుకుంటే మంచింది. ఒక‌వేళ కుటుంబంలో ఒక వ్య‌క్తి అనారోగ్యం కార‌ణంగా క‌వ‌రేజ్ మొత్తం క్లెయిమ్ చేసినా, రీస్టోరేష‌న్ ఆప్ష‌న్‌తో హామీ మొత్తం తిరిగి పొంద‌వ‌చ్చు. అలాగే, వెల్‌నెస్ ఫీచ‌ర్లు, డిడ‌క్టిబుల్స్ లేని, ఓపిడీ క‌వ‌రేజ్‌.. వంటి ఇత‌ర ఫీచ‌ర్లతో కూడిన‌ పాల‌సీని ఎంచుకోవ‌డం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని