Published : 12 May 2022 12:02 IST

గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు పరిగణించాల్సిన విషయాలు..

ప్రస్తుత రోజుల్లో మధ్యతరగతి ప్రజలు ఇంటిని కొనుగోలు చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవేళ మీ దగ్గర తగినంత డబ్బు లేకపోతే, మీరు ఆర్ధిక సహాయం తీసుకోవాలి. అంటే దీని అర్ధం గృహ రుణం తీసుకోవడం. మన దేశంలో గృహ రుణాలను అందించే అనేక బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఉన్నాయి. దాదాపు ప్రతి బ్యాంకు, ఆర్థిక సంస్థ గృహ రుణాన్ని అందిస్తున్నాయి. మొదటగా మీరు వివిధ బ్యాంకులు అందించే రుణ వడ్డీ రేట్లను, ఆఫర్లను తెలుసుకోండి. అనంతరం వాటిని క్షుణ్ణంగా పోల్చి చూడండి. 

ఉత్తమ గృహ రుణదాతలను ఎంపిక చేసుకోడానికి ముందు కింద తెలిపిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోండి : 

వడ్డీ రేట్లు :

బ్యాంకు రెండు రకాల గృహ రుణాలను అందిస్తుంది. ఒకటి ఫిక్స్డ్ గృహ రుణం, రెండవది ఫ్లోటింగ్ గృహ రుణం. ఫిక్స్డ్ గృహ రుణం అనేది మొత్తం రుణ వ్యవధిలో స్థిరంగా ఉంటుంది. ఫ్లోటింగ్ రేటు మాత్రం స్థూల ఆర్ధిక, మార్కెట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో, వడ్డీ పై ఫ్లోటింగ్ రేటు ప్రయోజనాలను అందిస్తుంది. వడ్డీ రేట్లను పోల్చడానికి సరైన అధ్యయనం చేయడం మంచిది. 

ఫీజులు :

పరిగణలోకి తీసుకోవాల్సిన రెండవ ముఖ్యమైన అంశం ఫీజులు. రుణ ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఫీజులు, రుణ మూసివేత ఛార్జీలు, ఆలస్య చెల్లింపు ఫీజులు వంటి వివిధ రకాల ఫీజులను రుణదాతలు వసూలు చేస్తారు. మీరు ఈ ఫీజులను జాగ్రత్తగా పరిశీలించి, తక్కువ ఫీజులను వసూలు చేసే బ్యాంకుని ఎంచుకోవాలి. 

వడ్డీ రేటు చరిత్ర :

గృహ రుణాన్ని తీసుకునే ముందు మీరు పరిగణించవలసిన ప్రధాన అంశం వడ్డీ రేటు. దీనితో పాటు మీరు వడ్డీ రేటు చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు నిర్ణయం తీసుకునే ముందు గత 10 సంవత్సరాల వడ్డీ రేటు చరిత్రను పరిశీలించండి. మీరు ఈ సమాచారాన్ని సంబంధిత బ్యాంకు వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. మంచి నిర్ణయం తీసుకోవడంలో వడ్డీ రేటు చరిత్ర మీకు సహాయపడుతుంది.

ఈఎంఐలో ప్రిన్సిపల్ కాంపోనెంట్ :

ఉత్తమ గృహ రుణదాతలను నిర్ణయించుకోవడంలో ఈఎంఐలో ప్రిన్సిపల్ కాంపోనెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా ప్రభుత్వరంగ బ్యాంకులు ఈఎంఐలో ప్రిన్సిపల్ కాంపోనెంట్ ను 45 శాతంగా ఉంచుతాయి. కొన్ని బ్యాంకులలో వడ్డీ భాగం ప్రధాన మొత్తం కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఈఎంఐలో ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉన్న బ్యాంకులను ఎంచుకోవడం మంచిది. 

బ్యాలన్స్ ను తగ్గించడం :

బ్యాలెన్స్ ను తగ్గించడానికి బ్యాంకులు మూడు పద్ధతులను ఉపయోగిస్తాయి. అవి రోజువారీ తగ్గింపు, నెలవారీ తగ్గింపు, వార్షిక తగ్గింపు. మీరు రోజువారీ లేదా నెలవారీ బ్యాలన్స్ తగ్గింపును అందించే రుణదాతను ఎంచుకోవడం మంచిది. 

ముందస్తు చెల్లింపు సౌకర్యం : 

గృహ రుణాల ఎంపికలో ముందస్తు చెల్లింపు కీలక పాత్ర పోషిస్తుంది. ముందస్తు చెల్లింపు సౌకర్యాన్ని వినియోగించుకోవడం వలన మీరు గృహ రుణ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఎటువంటి చార్జీలు లేకుండా ముందస్తు చెల్లింపు సదుపాయాన్ని అందించే బ్యాంకుని మీరు ఎంచుకోవాలి. 

నిబంధనలు, షరతులు :

నిబంధనలు, షరతుల పత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. మీపై బ్యాంకు ఎలాంటి ప్రత్యేక నిబంధనలు, షరతులను పెట్టలేదనే విషయాన్ని నిర్ధారించుకోవాలి.

ప్రాసెసింగ్, చెల్లింపు సమయం :

గృహ రుణాన్ని ప్రాసెస్ చేయడానికి పట్టే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీకు అత్యవసరంగా రుణం కావాల్సినప్పుడు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మీరు కేవలం ప్రాసెసింగ్ సమయాన్ని మాత్రమే కాకుండా, చెల్లింపుకు పట్టే సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 

వినియోగదారుని మద్దతు :

బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ అందించే కస్టమర్ సపోర్ట్, సేవలను కూడా మీరు తనిఖీ చేయాలి. మంచి కస్టమర్ సపోర్ట్ ను అందించే బ్యాంకును ఎంచుకోవడం మంచిది.

ప్రత్యేక స్కీం / ఆఫర్స్ :

ప్రత్యేక స్కీంలు లేదా ఆఫర్లను అందించే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు మీరు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయితే, ఆఫర్ ను ఎంచుకునే ముందు జాగ్రత్తగా అధ్యయనం చేయడం మంచిది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts