Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్‌ ప్లాన్‌ ఎంచుకునేటప్పుడు ఏం చూడాలి?

మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణ ఫండ్‌ మేనేజర్‌ చేతిలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ రాబడి అనేక అంశాలపై ఆధారపడి  ఉంటుంది. అవేంటో చూద్దాం.

Published : 18 Nov 2022 16:46 IST

దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలనుకునేవారు పెట్టుబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇవి  ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడి ఇవ్వగల పెట్టుబడి మార్గాల్లో ఒకటి. అయితే, మ్యూచువల్‌ ఫండ్‌ ప్లాను ఎంచుకునేటప్పుడు పెట్టుబడిదారుడు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.  

ఎంత కాలం..

పెట్టుబడులను మ్యూచువల్‌ ఫండ్లలో ఎంత కాలం కొనసాగించాలనుకుంటున్నారో మదుపర్లకు స్పష్టత ఉండాలి. దాని ఆధారంగానే ఫండ్‌ కేటగిరిని ఎంచుకోగలుగుతారు. ఉదాహరణకి, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో అధిక నష్టభయం ఉంటుంది. ఇలాంటి ఫండ్లను అధిక రిస్క్‌ సామర్ధ్యం తీసుకోగలిగి ఉండి, దీర్ఘకాలం పాటు(కనీసం 8 నుంచి 10 ఏళ్లు) పాటు కొనసాగించగలిగిన వారు మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువ. మీడియం టర్మ్‌ అయితే మిడ్‌ క్యాప్‌ లేదా మిక్స్‌డ్‌ క్యాప్‌/హైబ్రిడ్ ఫండ్లను పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి పెట్టుబడులకు ఉన్న కాలపరిమితి స్పష్టంగా తెలిస్తే తగిన ఫండ్లను ఎంచుకునే వీలుంటుంది. 

వ్యయ నిష్పత్తి..

మ్యూచువల్‌ ఫండ్‌ కేటగిరిని ఎంచుకున్న తర్వాత, ప్లాన్‌ను ఎంచుకోవాలి. అయితే ఫండ్‌ హౌస్‌లు..మదుపర్ల నుంచి పోర్ట్‌ఫోలియో నిర్వహణ కోసం ఛార్జీలను వసూలు చేస్తాయి. దీన్నే వ్యయ నిష్పత్తి అంటారు.  మ్యూచువల్‌ ఫండ్ పరిమాణం, ఎంచుకున్న ఫండ్‌ హౌస్‌ వంటి వాటి ఆధారంగా వ్యయనిష్పత్తి మారుతుంటుంది. నిపుణుల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్ల వ్యయ నిష్పత్తి 1 నుంచి 2 శాతం వరకు కూడా ఉండొచ్చు. డైరెక్ట్ ఫండ్లలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. 

ఎన్‌ఏవీ..

మ్యూచువల్‌ ఫండ్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు ఎన్‌ఏవీ(నికర ఆస్తి విలువ)ను కూడా చూడాలి. ఒక పథకానికి సంబంధించి ఒక యూనిట్‌ విలువను ఎన్‌ఏవీ సూచిస్తుంది. అంటే యూనిట్‌ కొనుగోలు చేసేందుకు ఎంత పెట్టాలో ఇది సూచిస్తుంది. ఒక ఫండ్‌ ఎన్‌ఏవీ తక్కువ ఉంది అంటే అది చౌకగా ఉందని చాలా మంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఎన్‌ఏవీతో సంబంధం లేకుండా ఫండ్‌ పనితీరును బట్టి రాబడి ఉంటుంది.  

మార్కెట్లు పతనం అయినప్పుడు ఎన్‌ఏవీ విలువ పడిపోతే..అప్పుడు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. 

ఫండ్‌ మేనేజర్‌..

మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణకు అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు ఉంటారు. వారు మార్కెట్లను పరిశోధించి ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ ఎక్కువ రాబడి సాధించేలా పనిచేస్తుంటారు. కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకునేటప్పుడు ఫండ్‌ మేనేజర్‌ పనితీరును తెలుసుకోవడం ముఖ్యం. ఫండ్‌ మేనేజర్‌ అనుభవం, నిర్వహించిన ఫండ్లు, గత ఐదేళ్లలో వాటి పనితీరు వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుని మంచి ఫండ్‌ మేనేజరు ఉన్న ఫండ్‌ ఎంచుకోవాలి. 

చివరిగా..

మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టబడులు పెట్టే మదుపర్లకు..పెట్టుబడుల లక్ష్యం, రిస్క్‌ తీసుకోగల సామర్థ్యం వంటి అంశాలపై స్పష్టత ఉండాలి. అప్పుడే తగిన పెట్టుబడులను ఎంచుకుని, మంచి రాబడి సాధించగలుగుతారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని