Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా!

క్రెడిట్‌ కార్డు బిల్లును సమయానికి తిరిగి చెల్లించకలేకపోతే ఈ ఆప్షన్‌ బాగా ఉపయోగపడుతుంది... 

Published : 03 Jan 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు నిర్ణీత తేది ఉంటుంది. ఆ లోపు చెల్లిస్తే వ‌డ్డీ వ‌ర్తించ‌దు. లేక‌పోతే చెల్లించాల్సిన మొత్తంపై వార్షికంగా 30 శాతం నుంచి 40 శాతం వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా తాజా లావాదేవీల‌పై వ‌డ్డీ లేని స‌మ‌యాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశమూ ఉంది. అయితే అధిక మొత్తంలో ఉన్న బిల్లును చెల్లించ‌లేని వారికి, ఈఎమ్ఐ మార్పిడి విధానాన్ని అందిస్తున్నాయి కార్డు జారీ సంస్థ‌లు. అవుట్ స్టాండింగ్ అమౌంట్‌ (చెల్లించ‌ని మొత్తం బిల్లు)ను లేదా అందులో కొంత మొత్తాన్ని నెల‌వారీ స‌మాన వాయిదాలుగా మార్చుకుని... త‌క్కువ వ‌డ్డీతో, సౌక‌ర్య‌వంత‌మైన కాల‌ ప‌రిమితితో తిరిగి చెల్లింపులు చేసేందుకు వీలుకల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా ఖ‌రీదైన వ‌స్తువ‌ను కొనుగోలు చేసి... ఆ మొత్తాన్ని వెంట‌నే తిరిగి చెల్లించ‌లేని వారూ ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

క్రెడిట్‌ కార్డు బిల్లును ఈఎమ్‌గా మార్చాల‌నుకునే కార్డు హోల్డ‌ర్లు ఈ కింది అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి


💳 పూర్తి బిల్లు లేదా కొంత భాగం..

చెల్లించ‌వ‌ల‌సిన మొత్తం క్రెడిట్ కార్డు బిల్లు లేదా అందులో కొంత భాగం ఈఎమ్ఐగా మార్చుకోవ‌చ్చు. భారీ ఫైనాన్స్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు బిల్లుపై చెల్లించ‌వ‌ల‌సిన ఆల‌స్య రుసుముల నుంచి ఇది కాపాడుతుంది. పెద్ద మొత్తంలో ఉన్న బిల్లును ఒకేసారి చెల్లించే కంటే చిన్న చిన్న భాగాలుగా చేసి ఈఎమ్ఐ రూపంలో సుల‌భంగా చెల్లించ‌వ‌చ్చు.


💳 పరిమితి మించితే..

కార్డు జారీదారు ముందుగా పేర్కొన్న‌ పరిమితికి మించి లావాదేవీలు చేసిన‌ప్పుడు.. ఆ మొత్తాన్ని ఈఎమ్ఐలుగా మార్చేందుకు వినియోగ‌దాల‌ను ఈ ఆప్ష‌న్ అనుమ‌తిస్తుంది. నిర్ధిష్ట కార్డు లావాదేవీలను, ముఖ్యంగా పెద్ద మొత్తంలో చేసే ఖ‌ర్చుల‌ను ఈఎమ్‌లుగా మార్చుకునేందుకు ఇది ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. 


💳 క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బ‌దిలీ..

క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ బ‌దిలీని ఈఎమ్ఐగా మార్చుకునే స‌దుపాయాన్ని చాలా వ‌ర‌కు క్రెడిట్ కార్డు జారీదారులు అందిస్తున్నారు. ఒక క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌ను, మ‌రొక సంస్థ జారీ చేసిన కార్డుకు బ‌దిలీ చేసి, ఆ మొత్తాన్ని ఈఎమ్ఐ మార్చుకోవ‌డానికి ఈ ఆప్ష‌న్ అనుమ‌తిస్తుంది. క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బిల్లును ఈఎమ్ఐగా మార్చుకునేందుకు ప్ర‌స్తుతం ఉన్న కార్డు జారీదారులు నిరాక‌రించినా, ఇందుకోసం ఎక్కువ వ‌డ్డీ రేటు వ‌సూలు చేసినా ఈ ఆప్ష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 


💳 గుర్తుంచుకోండి..

చెల్లించాల్సిన క్రెడిట్ కార్డు బిల్లుకు వ‌ర్తించే ఫైనాన్షియ‌ల్ ఛార్జీలు వార్షికంగా దాదాపు 23 నుంచి 49 శాతం ఉంటాయి. దీంతో పోలిస్తే, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐపై వ‌ర్తించే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. క్రెడిట్ కార్డు, తీసుకున్న వ్య‌క్తి క్రెడిట్ ఫ్రొఫైల్‌పై ఆధార‌ప‌డి వ‌డ్డీ రేటులో మార్పు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్న‌వారు, ఈఎమ్ఐలుగా మార్చాల్సిన అవ‌స‌రం రాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఒక‌వేళ మార్చాల్సి వ‌చ్చినా ఈఎమ్ఐ మార్పిడిపై విధించే వ‌డ్డీ రేటును ఇత‌ర కార్డుల‌తో పోల్చి చూడాలి. దానికి అనుగుణంగా లావాదేవీలు చేయాలి. ఈఎమ్ఐ మార్పిడికి ప్రాసెసింగ్ ఫీజులు విధించే అవ‌కాశమూ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని