50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం

చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో ముకేశ్‌ కుటుంబం ఓ సామాజిక కార్యక్రమాన్ని భాగం చేసింది. 

Published : 02 Jul 2024 18:34 IST

Anant Ambani-Radhika Merchant wedding | ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చెంట్‌ పెళ్లి సందడి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్‌ కార్పొరేట్ పార్క్‌ ఇందుకు వేదికైంది. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్‌, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్‌ హాజరయ్యారు. అలాగే కొత్త జంటల తరఫున కొందరు బంధువులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. రాబోయే రోజుల్లో ఇలా మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముకేశ్‌ కుటుంబం పేర్కొంది.

ఈ సందర్భంగా కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి. బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు స్త్రీ ధనం కింద రూ.1.01 లక్షల చెక్‌ అందించారు. అంతేగాకుండా ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. గ్యాస్‌ స్టవ్, మిక్సీ, ఫ్యాన్‌, పరుపులు, దిండ్లు, గిన్నెలు కూడా ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతిథులందరికి భారీ విందు ఏర్పాటుచేశారు. నూతన దంపతులు ముకేశ్‌-నీతా వద్ద ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. పారిశ్రామికవేత్త వీరెన్‌ మర్చెంట్‌ కుమార్తె రాధికతో అనంత్‌ అంబానీ వివాహం జులై 12న జరగనుంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదిక కానుంది. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న ముఖ్య ఘట్టమైన ‘శుభ్‌ వివాహ్‌’తో మొదలయ్యే ఈ సెలబ్రేషన్స్‌.. జులై 13న ‘శుభ్‌ ఆశీర్వాద్‌’, జులై 14న ‘మంగళ్‌ ఉత్సవ్‌’తో ముగుస్తాయి.ఇక, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ వేదికగా ఈ ఏడాది మార్చి 1-3 వరకు అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల్లో పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారికి అంబానీ కుటుంబం గ్రాండ్‌గా ఆతిథ్యమిచ్చింది. ఇప్పటికే ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని