`కోవిడ్‌ 19` బీమా కొనుగోలుపై అవ‌గాహ‌న‌, ఆస‌క్తి పెంచిందా ?

భార‌త్‌లోని టైర్‌-2, 3 న‌గ‌రాల్లో బీమాను కొనుగోలు చేయ‌డానికి 89% మంది ఆస‌క్తి చూపుతున్నార‌ని ఈ స‌ర్వే వెల్ల‌డించింది.

Updated : 22 Aug 2022 16:03 IST

భార‌త్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ బీమా మార్కెట్‌లో కీల‌క‌మైన `పాల‌సీబ‌జార్‌`, మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త రెండేళ్లుగా బీమా కొనుగోలు, గృహ ఆర్ధిక ప‌రిస్థితులు, పెట్టుబ‌డుల ప‌ట్ల మారుతున్న వినియోగ‌దారుల సెంటిమెంట్‌ను అర్ధం చేసుకోవ‌డానికి ఆన్‌లైన్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో 5 వేల మంది పాల్గొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి త‌ర్వాత ప‌ట్ట‌ణాల్లో, చిన్న న‌గ‌రాల్లో కూడా ఆరోగ్య బీమా, జీవిత బీమా కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగింద‌ని `పాల‌సీబ‌జార్` స‌ర్వే సూచిస్తుంది. టైర్‌-2, 3 న‌గ‌రాల నుండి అధిక సంఖ్య‌లో బీమాను ఆశించే వినియోగ‌దారులు ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డానికి, పున‌రుద్ద‌రించ‌డానికి, ఇంకా ట‌ర్మ్ బీమా క‌వ‌రేజీని పెంచ‌డానికి సిద్ద‌ప‌డుతున్నార‌ని ఈ స‌ర్వే తెలిపింది. 

భార‌త్‌లోని టైర్‌-2, 3 న‌గ‌రాల్లో బీమాను కొనుగోలు చేయ‌డానికి 89% మంది ఆస‌క్తి చూపుతున్నార‌ని ఈ స‌ర్వే వెల్ల‌డించింది. ట‌ర్మ్ బీమా చేయించుకోవ‌డానికి కూడా ఇంతే ఆస‌క్తి క‌న‌ప‌ర‌చ‌డం విశేషం. ఇప్ప‌టికే ట‌ర్మ్ బీమా ఉన్న పాల‌సీదారులు 59% మంది ట‌ర్మ్ బీమాను పెంచుకోవాల‌ని చూస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా బీమా అవ‌గాహ‌న‌కు సంబంధించి కోవిడ్ మ‌హ‌మ్మారి ప్రేరేపించిన ప‌రిస్థితుల‌ను స‌ర్వే ఫ‌లితాలు స్ప‌ష్టంగా సూచిస్తున్నాయి.

ఆరోగ్య బీమా విష‌యానికోస్తే `కోవిడ్‌` మ‌హ‌మ్మారి ఖ‌చ్చితంగా మ‌నుషుల‌ను పాల‌సీ కొనుగోలుపై అడుగులు వేసేలా చేసింది. దీనికి బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు, మొద‌టి, 2వ వేవ్‌ల‌లో కోవిడ్ బారీన ప‌డ్డ‌వారు 25% మంది ఆసుప‌త్రి పాల‌య్యారు.  వారిలో 18% మంది రూ. 15 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు. 22% మందికి త‌మ ప్ర‌స్తుత పాల‌సీ ఏ మాత్రం స‌రిపోలేదు. అలాగే ఇందులో కోవిడ్ బారిన వారికి 13% మందికి ఆరోగ్య బీమా లేదు. ఈ కార‌ణాల‌న్నీ కూడా కోవిడ్ బారిన వారికి తీవ్ర ఆర్ధిక, మాన‌సిక‌ ఇబ్బందులు క‌లిగించాయి. ప్ర‌తి కుటుంబ స‌భ్యునికి క‌నీసం రూ. 15-20 ల‌క్ష‌ల బీమా క‌వ‌రేజీని ఎంచుకోవాల‌ని ఈ స‌ర్వే గ‌ణాంకాలు స్ప‌ష్టంగా చెబుతున్నాయి.

ఆరోగ్య బీమా కొనుగోలులో కోవిడ్ ఉత్ప్రేర‌కంగా ప‌ని చేసింద‌నే వాస్త‌వాన్ని కూడా ఈ స‌ర్వే గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆరోగ్య బీమా పాల‌సీల‌లో 50% కోవిడ్ మొద‌టి వేవ్ త‌ర్వాత‌, 41% రెండ‌వ వేవ్ త‌ర్వాత కొనుగోలు చేయ‌బ‌డ్డాయి. అలాగే ఈ పాల‌సీల‌లో 80% ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ప్లాన్‌లున్నాయి. కొవిడ్ అన్ని వ‌య‌సుల వారిని కూడా ఆరోగ్యంగానే కాకుండా ఆర్ధికంగా కూడా పెను ప్ర‌భావాన్నే చూపింది. ఆ కార‌ణంచేత ఇప్పుడు వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా ఆరోగ్య బీమా, ట‌ర్మ్ బీమా ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తించారు.

అలాగే జీవిత బీమా పాల‌సీ అయిన ట‌ర్మ్ బీమాను కూడా కోవిడ్ మొద‌టి, రెండ‌వ వేవ్‌ల త‌ర్వాత చాలా మంది తీసుకున్నారు. కోవిడ్ ఈ ట‌ర్మ్ పాల‌సీల‌పై కూడా ఆస‌క్తిని ప్రేరేపించింది. ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న ట‌ర్మ్ పాల‌సీల‌లో 47% మంది మొద‌టి వేవ్ త‌ర్వాత‌, 40% మంది రెండ‌వ వేవ్ త‌ర్వాత కొనుగోలు చేశారు. కోవిడ్ బారిన ప‌డిన‌వారిలో 50% మంది ఆర్ధికంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. చాలా మందికి ఇప్ప‌టికీ త‌క్కువ ఆదాయాన్ని పొందుతున్నారు లేదా ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఇటువంటి అనిశ్చితుల‌తో పోరాడేందుకు బ‌ల‌మైన ఆర్ధిక భ‌ద్ర‌త అవ‌స‌రాన్ని చాలా మంది కోరుకుంటున్నారు. త‌మ‌కేమైన అయితే త‌మ‌పై ఆధార‌ప‌డ్డ కుటుంబానికి ఆర్ధిక భ‌ద్ర‌త అవ‌స‌రం కాబ‌ట్టి అధిక మొత్తానికి ట‌ర్మ్ పాల‌సీ అవ‌స‌ర‌మే అని చాలా మంది గ్ర‌హించార‌ని స‌ర్వే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని