Start-Up: భారత్‌లో టాప్‌-25 స్టార్టప్‌లు ఇవే..

ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్‌ ఏటా విడుదల చేసే 25 అత్యుత్తమ అంకుర సంస్థల జాబితాలో ఏకీకృత చెల్లింపు వేదిక క్రెడ్‌ అగ్రస్థానంలో నిలిచింది....

Published : 29 Sep 2022 01:26 IST

బెంగళూరు: ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్‌ ఏటా విడుదల చేసే 25 అత్యుత్తమ అంకుర సంస్థల జాబితాలో ఏకీకృత చెల్లింపు వేదిక క్రెడ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 6.4 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఈ సంస్థ 2021లో మూడో స్థానంలో నిలవగా ఈసారి తొలిస్థానానికి చేరింది. వినూత్న ప్రకటనలతో విశేష ఆదరణ పొందిన క్రెడ్‌.. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం అత్యుత్తమ విధానాలను ప్రవేశపెట్టినట్లు లింక్డిన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ జాబితాలో అప్‌గ్రాడ్‌ రెండోస్థానంలో ఉంది. దేశంలో ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఉన్నత విద్యను అందిస్తున్న అగ్రగామి సంస్థగా ఇది కొనసాగుతోంది. ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తోందని లింక్డిన్‌ తెలిపింది. తర్వాతి స్థానంలో ఆన్‌లైన్‌ పెట్టుబడుల వేదిక గ్రో నిలిచింది. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్లలో ఉన్న అవకాశాలను సమీక్షించే ఈ కంపెనీ వాటిని మదుపర్లకు చేరువ చేస్తోంది.

ఈ జాబితాలో ఈసారి పలు కొత్త సంస్థలు కూడా స్థానం దక్కించుకున్నాయి. వీటిలో ఇ-గ్రోసరీ కంపెనీ జిప్టో (4వ స్థానం), పాత కార్ల విక్రయ వేదిక స్పిన్నీ (7వ స్థానం), బీమాటెక్‌ అంకుర సంస్థ డిట్టో ఇన్సూరెన్స్‌ (12వ స్థానం) ఉన్నాయి. ఇవన్నీ ఆన్‌లైన్‌ వేదికగా ప్రజలకు ఆర్థిక, ప్రయాణ, నిత్యావసర సేవల్ని చేరువ చేస్తున్న కంపెనీలు. ఫిట్‌నెస్‌ ప్లాట్‌ఫామ్‌ అల్ట్రాహ్యూమన్‌ 19వ స్థానం, ఆర్గానిక్‌ ఫుడ్‌ మార్కెట్‌ప్లేస్‌ లివింగ్‌ ఫుడ్‌ 20వ స్థానంలో చేరింది.

ఈ జాబితాలోని 25 కంపెనీల్లో 13 బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నవే. దీంతో ‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన ఈ నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తాజా టాప్‌-10 అంకురాల్లో 68 శాతం కొత్త కంపెనీలే ఉండడం విశేషం. ఇది భారత్‌లో అంకుర సంస్థలకు కావాల్సిన వాతావరణం ఎంత అనుకూలంగా ఉందో సూచిస్తోందని లింక్డిన్‌ న్యూస్‌ ఇండియా మేనేజింగ్‌ ఎడిటర్‌ నిరజిత బెనర్జీ పేర్కొన్నారు. వాణిజ్య కార్యకలాపాల్లో నెలకొన్న అనిశ్చిత వాతావరణాన్ని అధిగమించడానికి ఈ స్టార్టప్‌లు తమ వ్యాపారాలను తదనుగుణంగా మార్చుకుంటున్నాయని తెలిపారు. అలాగే ఈ అంకురాలు యువ ఉద్యోగులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. ఈ 25 కంపెనీలు ఇటీవల నియమించుకున్న ఉద్యోగుల్లో 56 శాతం మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారేనని తెలిపారు. 17 శాతం మంది వయసు 25 ఏళ్ల లోపేనన్నారు.

ఈ జాబితాలో ఉన్న కంపెనీలు ర్యాంకుల వారీగా.. క్రెడ్‌, అప్‌గ్రాడ్‌, గ్రో, జిప్టో, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ఎంబీఏ ఛాయ్‌వాలా, స్పిన్నీ, ది గుడ్‌ గ్లామ్‌ గ్రూప్‌, గ్రోత్‌స్కూల్‌, బ్ల్యూస్మార్ట్‌, షేర్‌చాట్‌, డిట్టో ఇన్సూరెన్స్‌, సింపుల్‌, ర్యాపిడో, క్లాస్‌ప్లస్‌, పార్క్‌+, బ్లిస్‌క్లబ్‌, డీల్‌షేర్‌, అల్ట్రాహ్యూమన్‌, లివింగ్‌ ఫుడ్‌, ఫ్యామ్‌పే, అగ్నికూల్‌ కాస్మోస్‌, స్టాంజా లివింగ్‌, పాకెట్‌ ఎఫ్‌ఎం, జిప్‌ ఎలక్ట్రిక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని