రుసుము కట్టాల్సిందేనా?

క్రెడిట్ కార్డు బిల్లు రూ.34,155 వచ్చింది. దీన్ని గడువు తేదీ తర్వాత మూడు రోజులకు చెల్లించాను. ఆలస్యంగా చెల్లించానని అపరాధ రుసుముగా రూ.1,948 విధించారు. దీన్ని తప్పనిసరిగా.. 

Updated : 01 Jan 2021 19:56 IST

క్రెడిట్ కార్డు బిల్లు రూ.34,155 వచ్చింది. దీన్ని గడువు తేదీ తర్వాత మూడు రోజులకు చెల్లించాను. ఆలస్యంగా చెల్లించానని అపరాధ రుసుముగా రూ.1,948 విధించారు. దీన్ని తప్పనిసరిగా కట్టాలా? ఫిర్యాదు చేసే అవకాశం ఉందా?

సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లును ఎప్పుడూ వ్యవధిలోపే చెల్లించాలి. ఆలస్యంగా చెల్లిస్తే కార్డు సంస్థలు అపరాధ రుసుము విధిస్తుంటాయి. మీరు ప్రతిసారీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపును సరైన సమయానికే చేస్తుంటే… ఏదో అనుకోకుండా ఆలస్యం అయినప్పుడు ఈ అపరాధ రుసుమును రద్దు చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ముందు మీ కార్డు సంస్థ వినియోగదారుల సేవాకేంద్రాన్ని ఫోనులో సంప్రదించండి. అవసరాన్ని బట్టి, ఈ మెయిల్ కూడా చేయండి. సాధారణంగా మీ వినతిని అంగీకరిస్తారు. క్రెడిట్ కార్డు వాడేవారు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం… గడువు తేదీలోగా తప్పనిసరిగా బిల్లు చెల్లించాలి. తరచూ ఆలస్యం అవుతుంటూ… క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడే ఆస్కారం ఉంది.

– ఇంటి రుణం తీసుకొని ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాం. నా ఒక్కడి పేరుతో కొనడం మంచిదా? లేదా మా దంపతుల ఇద్దరి పేరుతో ఉమ్మడిగా కొనడం మేలా?

ఇంటి రుణం తిరిగి చెల్లించేప్పుడు వడ్డీకి రూ.2,00,000 వరకూ… అసలుకు రూ.1,50,000 (సెక్షన్ 80సీ పరిమితి నిబంధనల మేరకు)వరకూ మినహాయింపు లభిస్తుంది. మీ ఇద్దరి పేరుతో ఇల్లు కొని, ఇంటి రుణం కూడా ఇద్దరూ కలిసి చెల్లిస్తుంటే… చెరొక రూ.3,50,000 వరకూ ఆదాయపు పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. దంపతులిద్దరికీ ఆదాయం ఉన్నప్పుడు ఇంటి రుణం కూడా అధికంగానే వస్తుంది. ఇద్దరిలో ఒకరికి ఆదాయం లేకున్నా, ఇద్దరి పేరుతో ఇల్లు కొనొచ్చు. ఒక్కరి పేరుతోనే ఇల్లు కొని, ఆ వ్యక్తి మరణిస్తే… ఆ ఇంటిపై అతని జీవిత భాగస్వామితోపాటు, పిల్లలు, తల్లికి కూడా ప్రాథమిక వారసత్వ హక్కులు ఉంటాయి. భార్య, భర్తలిద్దరి పేరుతో ఉమ్మడిగా ఇల్లు కొంటే ఆ ఇంటిపై 50శాతం వాటా జీవిత భాగస్వామికి వస్తుంది. ఇద్దరి పేరుతో ఇల్లు కొన్నా… వారిలో ఒకరు మరణించినప్పుడు ఆ వ్యక్తి 50శాతం వాటాలో జీవిత భాగస్వామికి కూడా ఇతర వారసులతో పాటు వారసత్వ హక్కు లభిస్తుంది. మీ ఒక్కరి పేరుతోటే ఇల్లు కొని, మీ తదనంతరం మీ జీవిత భాగస్వామి జీవించినంత కాలం ఆమెకు మాత్రమే ఆ ఇంటిని అనుభవించి, అమ్మే హక్కు ఉండాలి అనుకుంటే… ఆ ఇల్లు మీ స్వార్జితం అని రాసి, దానిపై సంపూర్ణ హక్కులు మీ ఆవిడకే చెందేటట్లు మీరు వీలునామా రాయవచ్చు.

– మా అమ్మాయి పెళ్లి కోసం దాచిన రూ.20లక్షలు బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు అందించే లిక్విడ్ ఫండ్లలో మదుపు చేస్తే రాబడి మెరుగ్గా ఉంటుందని విన్నాను. నిజమేనా?

మ్యూచువల్ ఫండ్లలో రాబడికే కాదు… అసలుకు కూడా హామీ ఉండదు. అయితే… బ్యాంకు పొదుపు ఖాతాలో డబ్బు ఉంచే బదులు తక్కువ నష్టభయం ఉండే లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయడం మంచి ఆలోచనే. గత ఏడాది లిక్విడ్ ఫండ్లు సగటున 6.5శాం వరకూ రాబడినిచ్చాయి. బ్యాంకు సేవింగ్ ఖాతా వడ్డీ 3.5శాతం కన్నా అధిక రాబడే అందించాయి. లిక్విడ్ ఫండ్లలో డబ్బును 91 రోజులకంటే తక్కువ రోజుల్లో మెచ్యూరిటీ ఉండే ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, కాల్ మనీ మార్కెట్లో మదుపు చేస్తారు. మ్యూచువల్ ఫండ్లలో అతి తక్కువ నష్టభయం ఉన్నవి లిక్విడ్ ఫండ్లే. వీటిపై రాబడికి నిబంధనల మేరకు ఆదాయపు పన్ను వర్తిస్తుంది. మీ డబ్బులకు సేవింగ్ ఖాతాలో అట్టిపెట్టే బదులు పిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా ఒక మార్గం. కానీ, గడువుకంటే ముందే ఆ డిపాజిట్ను రద్దు చేసుకుంటే అప్పటి వరకూ డిఆపజిట్ కొనసాగిన కాలానికి వర్తించే వడ్డీలో ప్రీ పేమెంట్ పెనాల్టీ తగ్గించి చెల్లిస్తారు. పొదుపు ఖాతాలో వచ్చే వడ్డీ రూ.10,000 వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. మీ వద్ద భారీ మొత్తం ఉన్నప్పుడు లిక్విడ్ ఫండ్లలో మదపు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని