Credit card: అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో క్రెడిట్ కార్డులపై క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌గ‌ల‌మా?

మ‌నం క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉంటే క్రెడిట్ కార్డ్‌లు అనేవి ఆర్ధిక మిత్రులతో స‌మానం.

Updated : 20 Apr 2022 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్ప‌టిదాకా క్రెడిట్ కార్డులు వాడ‌ని వారు వాటిని వాడే వారిని చూసి త‌మ‌కూ క్రెడిట్ కార్డులు ఉంటే బాగుంటుంద‌ని అనుకుంటారు. కొంతమందికి అత్య‌వ‌స‌ర ఆర్థిక ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు క్రెడిట్ కార్డులు మంచి ఆర్థిక మిత్రులుగా పనిచేస్తుంటాయి. అయితే, మ‌నం ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉన్నప్పుడే ఇవి మిత్రులతో స‌మానం. అయితే, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మ‌నం వాటిని ఉప‌యోగించ‌వ‌చ్చు.

క‌నీస చెల్లింపు: క్రెడిట్ కార్డ్ జారీ చేసే బ్యాంకులు.. చెల్లించాల్సిన క‌నీస మొత్తాన్ని లేదా అంత‌కంటే ఎక్కువ మొత్తాన్ని గ‌డువు తేదీలో చెల్లించే అవ‌కాశాన్ని మీకు అందిస్తాయి. క‌నీస మొత్తం 5% దాకా ఉంటుంది. బ్యాంకుని బ‌ట్టి ఇది మారొచ్చు. అయితే, పూర్తి బిల్లు కాకుండా క‌నీస మొత్త‌మే చెల్లిస్తే.. వడ్డీ పడుతుంది. కాబ‌ట్టి, మీరు ప్ర‌తి నెలా చెల్లించాల్సిన క‌నీస మొత్తాన్ని మాత్ర‌మే చెల్లించ‌డం అల‌వాటు చేసుకుంటే, క్రెడిట్ కార్డ్ రుణాన్ని పూర్తి చేయడానికి మీకు చాలా స‌మ‌యం ప‌డుతుంది.

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో చెల్లించాల్సిన క‌నీస మొత్తాన్ని చెల్లించ‌డం వ‌ల్ల ఆర్థిక విషయాల్లో ప్రాధాన్య‌ జాబితాలో ఉన్న వాటిపై దృష్టి పెట్ట‌డంలో మీకు స‌హాయ‌ప‌డుతుంది. సాధార‌ణ ప‌రిస్థితిలో క్రెడిట్ కార్డ్ బిల్లును పూర్తిగా చెల్లించ‌డం మీ ప్రాధాన్య‌ం అవ్వొచ్చు. కానీ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కిరాణా సామగ్రి, మందులు మొద‌లైన వాటికి చెల్లించ‌డం ప్రాధాన్య‌ంగా మారొచ్చు. మీ క్రెడిట్ కార్డ్‌పై చెల్లించాల్సిన క‌నీస మొత్తాన్ని మాత్ర‌మే చెల్లించ‌డం వ‌ల్ల మీకు తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే బ్యాంకులు మీ చెల్లింపును ‘డిఫాల్ట్‌’గా వ‌ర్గీక‌రించ‌వు. మీరు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత క్రెడిట్ కార్డ్ బ‌కాయి మొత్తాన్ని వ‌డ్డీతో చెల్లించొచ్చు.

క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి (CUR): మీకు లభించిన పరిమితిలో ఎంత వరకు వాడారనేది క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి. క్రెడిట్ కార్డ్‌లు ఉప‌యోగించేవారు 30% క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి (CUR) స్ధాయిని మించ‌కూడ‌దు. క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారు త‌ర‌చుగా అధిక CUR స్థాయిని మించిన‌ట్ల‌యితే ఇది ప్ర‌తికూల క్రెడిట్ స్కోర్‌కు దారితీయ‌వ‌చ్చు. అయితే, అప్పుడ‌ప్పుడు క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిని అధిగ‌మించ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోర్‌పై వెంట‌నే ప్ర‌భావం చూప‌దు. కాబ‌ట్టి, మీరు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు వేరే అవ‌కాశం లేక‌పోతే 30% క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తిని మించ‌వ‌చ్చు. మీ ఆర్ధిక ప‌రిస్థితి మెరుగుప‌డిన త‌ర్వాత‌, మీరు CURని తగ్గించుకోవచ్చు. క్ర‌మంగా మీ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుప‌డుతుంది.

మీ లిక్విడిటీ ప‌రిస్థితి ఇప్ప‌ట్లో మెరుగుప‌డ‌ద‌ని భావిస్తే కార్డు ఖ‌ర్చు ప‌రిమితిని పెంచ‌మ‌ని అభ్యర్థించవచ్చు. లేదా ఇంకొక క్రెడిట్ కార్డ్ కోసం దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వేరే కార్డ్ తీసుకుని ఆ కార్డ్ మీద కూడా 30% క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తితో ఖ‌ర్చులు చేయొచ్చు. రెండు క్రెడిట్ కార్డ్‌లు ఉండ‌టం వ‌ల్ల‌ స‌మ‌యానుకూలంగా ఖ‌ర్చు పెడితే 30% క్రెడిట్ వినియోగ నిష్ప‌త్తి ప‌రిధిలోనే ఉంటారు.

క్రెడిట్ కార్డ్‌ను దుకాణాల్లో స్వైపింగ్‌, ఆన్‌లైన్ చెల్లింపుల‌కే కాకుండా మీరు ఏటీఎంలో న‌గ‌దు ఉప‌సంహ‌రించుకోవ‌డానికి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. న‌గ‌దు స‌మ‌స్య వ‌చ్చిన‌పుడు ఆసుప‌త్రి బిల్లు చెల్లించ‌డం లేదా మందులు కొనుగోలు చేయ‌డం వంటి తీవ్ర‌మైన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డానికి ఇది మీకు అత్యవసర నిధి లాంటిది. అయితే, మీకు అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తారు. క్రెడిట్ కార్డ్ ప‌రిమితి ప్ర‌కారం న‌గ‌దును విత్ డ్రా చేసుకోవ‌చ్చు. ఏటీఎంలో న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌పై అధిక వ‌డ్డీ ఉంటుంది. వ‌డ్డీ దాదాపు 40% దాకా కూడా ఉండొచ్చు. కాబట్టి, వీలైనంత త్వరగా బిల్లు చెల్లించడం మంచిది.

మీరు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న‌ప్పుడు అధిక క్రెడిట్ స్కోర్‌ను నిర్వ‌హించ‌డం కంటే మెడిక‌ల్ బిల్లు మొద‌లైన‌వాటిని చెల్లించ‌డానికి మీరు ప్రాధాన్య‌ం ఇవ్వాలి. మీరు ఆర్థికంగా బ‌లంగా ఉన్న‌ప్పుడు భ‌విష్య‌త్తులో మంచి క్రెడిట్ స్కోర్‌ని పున‌ర్నిర్మించుకోవ‌చ్చు. ఈ క్రెడిట్ కార్డ్ విభాగాల‌ను తెలిసి ఉల్లంఘించే ముందు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

క్రెడిట్ కార్డుల వాడ‌కంపై రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. ఈ రివార్డ్ పాయింట్ల ద్వారా న‌గ‌దు లేదా గిఫ్ట్‌ల‌ను పొందొచ్చు. కొన్ని విమాన ప్ర‌యాణ టిక్కెట్ల‌పై రాయితీని కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డు అనేది రెండు వైపులా ప‌దును ఉన్న క‌త్తి లాంటిది. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా దానిని ఎలా ఉప‌యోగించుకోవాలనేది మ‌న చేతుల్లోనే ఉండేలా చూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని