స్టూడెంట్స్ కోసం ప్ర‌త్యేకంగా క్రెడిట్ కార్డ్‌

క్రెడిట్ అంటే బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ నుంచి అప్పు తీసుకుని చెల్లింపుల‌కు వాడుకునేది. సాధార‌ణంగా, వ్య‌క్తి చేసే ఉద్యోగం, సంపాద‌న వంటి అంశాల ఆధారంగా క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తారు. ఉద్యోగులైనా, వృత్తి నిపుణులైనా, స్వయం ఉపాధి కలిగిన వారైనా క్రెడిట్‌ కార్డు పొందాలంటే సంస్థ సూచించిన విధంగా స్థిర ఆదాయం ఉండాలి. ఇందుకు రుణ చ‌రిత్ర కూడా ..

Updated : 31 Dec 2020 17:02 IST

క్రెడిట్ అంటే బ్యాంకు లేదా ఆర్ధిక సంస్థ నుంచి అప్పు తీసుకుని చెల్లింపుల‌కు వాడుకునేది. సాధార‌ణంగా, వ్య‌క్తి చేసే ఉద్యోగం, సంపాద‌న వంటి అంశాల ఆధారంగా క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తారు. ఉద్యోగులైనా, వృత్తి నిపుణులైనా, స్వయం ఉపాధి కలిగిన వారైనా క్రెడిట్‌ కార్డు పొందాలంటే సంస్థ సూచించిన విధంగా స్థిర ఆదాయం ఉండాలి. ఇందుకు రుణ చ‌రిత్ర కూడా ముఖ్య‌మే. అయితే ప్ర‌స్తుతం కొన్ని బ్యాంకులు క‌ళాశాల స్థాయిలో ఉన్న విద్యార్ధుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు పేరుతో, క్రెడిట్ కార్డుల‌ను రూపొందించాయి. 18 సంత్స‌రాల వ‌య‌సు నిండిన విద్యార్ధులకు స్టూడెంట్ క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హ‌త ఉంటుంది. ఆదాయ ప‌రిమితి లేకుండా, త‌క్కువ వ‌డ్డీ రేటుతో, 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డుల‌ను విద్యార్ధుల‌కు అందిస్తున్నాయి.

స్టూడెంట్ క్రెడిట్ కార్డును అందిస్తున్న బ్యాంకులు:

దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా స్టూడెంట్ క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్నాయి.

స్టూడెంట్ క్రెడిట్ కార్డుల‌ను మార్కెట్‌లోకి కొత్త‌గా విడుద‌ల చేశారు. విద్యార్ధుల‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ కార్డుల‌ను రూపొందించ‌డం జ‌రిగింది. ఈ కార్డుల స‌హాయంతో విద్యార్ధులు వారి ఖ‌ర్చుల‌ను సొంత‌గా నిర్వ‌హించుకునేందుకు వీలుంటుంది. అయితే ప్ర‌తీ విద్యార్ధికి ఈ కార్డును తీసుకోవ‌డం సాధ్యం కాదు. బ్యాంకులు నిర్ణ‌యించిన అర్హ‌త ప్ర‌మాణాలు ఉన్న విద్యార్ధుల‌కు మాత్ర‌మే క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. ఈ అర్హ‌త ప్ర‌మాణాలు వేరు వేరు బ్యాంకుల‌కు వేరు వేరుగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, త‌మ బ్యాంకులో విద్యారుణం తీసుకున్న విద్యార్ధుల‌కు మాత్ర‌మే క్రెడిట్ కార్డుల‌ను అందిస్తుంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంకులో త‌మ బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్ చేసిన విద్యార్ధుల‌కు మాత్ర‌మే ఈ సదుపాయాన్ని క‌ల్పిస్తుంది. అందువ‌ల్ల వివిధ బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డులు, అందుకు కావ‌ల‌సిన అర్హ‌త‌లు, ప్ర‌యోజ‌నాలు వంటి వాటిని ప‌రిశీలించి క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం కూడా ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులుకోసం ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మ‌రికొన్ని బ్యాంకుల‌కు ఆన్‌లైన్ విధానం అందుబాటులో లేదు. నేరుగా బ్యాంకు బ్రాంచికి వెళ్ళి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంది.

క్రెడిట్‌ కార్డు పొందేందుకు అర్హతలు:

వ‌య‌సు-18 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి.
క‌ళాశాల‌లో చుదువుతున్న విద్యార్థి అయిఉండాలి.

క్రెడిట్‌ కార్డు పొందేందుకు అవసరమయ్యే పత్రాలు:

  • జనన ధ్రువీకరణ పత్రం
  • క‌ళాశాల‌/ విశ్వ‌విధ్యాల‌యం వారు జారీ చేసిన గుర్తింపు కార్డు
  • ప్ర‌స్తుతం నివ‌సిస్తున్న ఇంటి చిరునామా గుర్తింపు ప‌త్రం
  • ఇటీవ‌లి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • పాన్‌కార్డు

స్టూడెంట్ క్రెడిట్ కార్డు2019లోని అంశాలు:

  1. కార్డు ప‌రిమితి:
    బ్యాంకులు అందించే ఇత‌ర క్రెడిట్ కార్డుల‌తో పోలిస్తే, ఈ క్రెడిట్ కార్డుల ప‌రిమితి చాలా త‌క్కువ‌గా ఉంటుంది. స్టూడెంట్ క్రెడిట్ కార్డు ప‌రిమితి స‌గ‌టున రూ.15 వేలు మాత్ర‌మే ఉంటుంది. విద్యార్ధులకు స‌రైన ఆదాయం ఉండ‌దు కాబ‌ట్టి వారు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయ‌కుండా, రుణ ఉచ్చులో చిక్కుకోకుండా నివారించేందుకు గానూ ఈ ప‌రిమితిని విధించ‌డం జ‌రిగింది.

  2. కార్డు కాల‌వ్య‌వ‌ధి:
    సాధార‌ణంగా క్రెడిట్ కార్డుల‌కు 3 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి మాత్రమే ఉంటుంది. అయితే స్టూడెంట్ క్రెడిట్ కార్డుల‌కు 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి(వ్యాలిడిటీ) ఉంటుంది.

  3. డూప్లికేట్ కార్డ్‌:
    స్టూడెంట్ కార్డు తీసుకున్న వారు, వారి కార్డును పోగొట్టుకుంటే, బ్యాంకులు వారికి డూప్లికేట్ కార్డును జారీచేస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు వీటిని పూర్తి ఉచితంగా భ‌ర్తీ చేస్తే, మ‌రికొన్ని బ్యాంకులు సాధార‌ణ రుసుముల‌తో అందిస్తున్నాయి.

  4. రుస‌ములు:
    స‌్టూడెంట్ క్రెడిట్ కార్డుల‌ను తీసుకునేందుకు ఎటువంటి అద‌న‌పు రుసుములు చెల్లించ‌వ‌ల‌సిన అవ‌సరం లేదు. విద్యార్ధులు నిర్వ‌హించేందుకు వీలుగా వార్షిక రుసుములు కూడా త‌క్కువ‌గా ఉంటాయి.

  5. కావ‌ల‌సిన ప‌త్రాలు:
    ఈ క్రెడిట్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఇత‌ర క్రెడిట్ కార్డుల మాదిరిగా స‌మ‌గ్ర డాక్యుమెంటేష‌న్ అవ‌స‌రం లేదు. క‌నీస ప‌త్రాల‌ను ఇస్తే స‌రిపోతుంది.

  6. స్పెష‌ల్ డీల్స్‌, రివార్డ్స్‌:
    క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి కొనుగోలు చేస్తే, క్యాష్‌బ్యాక్‌, క్యాష్ పాయింట్ల రూపంలో కొంత మొత్తాన్ని పొంద‌వ‌చ్చు.ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్యేక ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు, వివిధ సేవ‌లు అందుబాటులో ఉంటాయి.

  7. కార్డు తీసుకున్న వ్య‌క్తి, కాల‌ప‌రిమితిలో ఎప్పుడైన స్టూడెంట్ క్రెడిట్ కార్డును, సాధార‌ణ క్రెడిట్ కార్డుగా అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చు.

స్టూడెంట్ క్రెడిట్ కార్డును పొందేందుకు మార్గాలు:
ఏవిధ‌మైన ఉద్యోగం, ఆదాయ మార్గం, ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు లేకుండా విద్యార్ధుల‌కు బ్యాంకులు స్టూడెంట్ క్రెడిట్ కార్డు సౌక‌ర్యాన్ని అందిస్తున్నాయి. అందువ‌ల్ల విద్యార్ధులు త‌మ పేరుపై స్టూడెంట్ క్రెడిట్ కార్డును పొందేందుకు ఈ కింది తెలిపిన వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవ‌ల్సి ఉంటుంది.

1.ఫిక్స్‌డ్ డిపాజిట్‌:
విద్యార్ధి పేరుపై బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్న‌ వారు క్రెడిట్ కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే బ్యాంకులు నిర్ణ‌యించిన మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

2.యాడ్ ఆన్ కార్డు:
క్రెడిట్ కార్డు ఉన్న కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌రు విద్యార్ధి పేరుపై యాడ్ ఆన్ కార్డు కోసం అభ్య‌ర్ధ‌న పెట్ట‌వ‌ల‌సి ఉంటుంది. యాడ్ఆన్ కార్డు కోసం అభ్య‌ర్ధించే వారికి మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. అయితే ఈ సౌక‌ర్యాన్ని కొన్ని బ్యాంకులు మాత్ర‌మే అందుబాటులో ఉంచాయి.

3.స్ట్రాంగ్‌సేవింగ్స్ అక్కౌంట్‌:
మీరు ద‌ర‌ఖాస్తు చేసే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ ఖాతాలో ఎక్కువ మొత్తం పొదుపు చేస్తున్న‌ట్లుగా చ‌రిత్ర ఉంటే కూడా క్రెడిట్‌కార్డును జారీ చేస్తారు. ఈ సౌక‌ర్యం కూడా కొన్ని బ్యాంకుల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు