Credit Card: శుభ‌వార్త‌.. ఇకపై క్రెడిట్‌ కార్డు బిల్లింగ్ సైకిల్‌ని మార్చుకోవ‌చ్చు!

ఆర్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ ప్ర‌కారం .. కార్డు హోల‌ర్లు త‌మ సౌల‌భ్యాన్ని అనుస‌రించి బిల్లింగ్ సైకిల్‌ను ఒక‌సారి మార్చుకోవ‌చ్చు. 

Updated : 25 May 2022 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌కార్డు బిల్లింగ్ సైకిల్ తేదీని మార్చుకోవడం అంత సుల‌భం కాదు. సాధార‌ణంగా కార్డు జారీ చేసిన‌ప్పుడు బిల్లింగ్ సైకిల్ సంబంధిత తేదీల‌ను సంస్థ‌లు ముందే నిర్ణ‌యిస్తాయి. కార్డు మ‌నుగ‌డ‌లో ఉన్నంత వ‌ర‌కు అవే కొనసాగుతాయి. అయితే, కొన్ని జారీ సంస్థ‌లు, కొన్ని సంద‌ర్భాల్లో మార్పునకు అనుమ‌తిస్తున్నా అన్నీ మాత్రం ఆ అవకాశం కల్పించడం లేదు. కాబ‌ట్టి బిల్లింగ్ సైకిల్ అనుకూలంగా లేనివారు కార్డు ర‌ద్దు చేసుకోవాల్సిందే త‌ప్ప బిల్లింగ్ సైకిల్ తేదీల‌ను మార్చుకునే వెసులుబాటు ఇప్పటి వరకు లేదు.

అయితే, తాజాగా ఆర్‌బీఐ జారీ చేసిన‌ కొత్త క్రెడిట్ కార్డు నియ‌మాల ప్ర‌కారం క్రెడిట్ కార్డు హోల్డ‌ర్ బిల్లింగ్‌ సైకిల్ తేదీల‌ను ఒక‌సారి మార్చుకోవచ్చు. కార్డు జారీ సంస్థ‌లు.. అన్ని క్రెడిట్ కార్డుల‌కు స్టాండ‌ర్డ్ బిల్లింగ్ సైకిల్‌ను అనుమ‌తించ‌వు. కాబ‌ట్టి కార్డు జారీ సంస్థ నియ‌మాల‌ను అనుస‌రించి బిల్లింగ్ సైకిల్ వేరు వేరు కార్డుల‌కు వేరు వేరుగా ఉంటుంది. అందువ‌ల్ల కార్డు హోల్డర్లు త‌మ సౌల‌భ్యాన్ని అనుస‌రించి బిల్లింగ్ సైకిల్‌ను ఒక‌సారి మార్చుకునే వీలు క‌ల్పించాలని ఆర్‌బీఐ కార్డు జారీ సంస్థ‌ల‌ను ఆదేశించింది. ఈ కొత్త నియ‌మాలు జులై 1, 2022 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

(ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డులు.. కొత్త నిబంధనలతో సురక్షితంగా)

బిల్లింగ్ సైకిల్ అనేది వ‌రుస‌గా రెండు బిల్లు స్టేట్‌మెంట్‌ల మ‌ధ్య ఉన్న కాలం. సాధారణంగా బిల్లింగ్ సైకిల్ వ్యవధి 30 రోజులుగా ఉంటుంది. ఆ 30 రోజులలో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ప్రతిబింబిస్తాయి. బిల్లింగ్ సైకిల్ పూర్త‌యిన 15-25 రోజుల వరకు చెల్లింపు గ‌డువు ఉంటుంది. ఉదాహ‌ణ‌ర‌కు, మీ బిల్లింగ్ సైకిల్ ఏప్రిల్ 11 నుంచి మే 10 వ‌ర‌కు ఉంటే పేమెంట్ చివరి తేదీ జూన్ 4-5, 2022 తేదీల‌లో ఉండొచ్చు.

బిల్లింగ్ సైకిల్ ప్రారంభ తేది నుంచి చెల్లింపు గ‌డువు తేది వ‌ర‌కు.. వ‌డ్డీర‌హిత కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. ఈ లోపు కార్డు హోల్డ‌ర్లు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలి. గ‌డువు తేదీ ముగిసిన త‌ర్వాత చెల్లింపులు చేస్తే అవుట్ స్టాండింగ్ మొత్తంపై వ‌డ్డీ, ఆలస్య రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది. అందువ‌ల్ల క్రెడిట్ కార్డు ఉన్న‌వారు మీ అనుకూల‌త‌ను బ‌ట్టి, అంటే..ప్ర‌తీ నెల మీకు డ‌బ్బు చేతికి అందే స‌మ‌యాన్ని బ‌ట్టి బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు, మీ చెల్లింపు గడువు తేదీలన్నీ ప్రతి నెలా ఐదో తేదీలోపు ఉండాలని మీరు కోరుకుంటే, దానికి అనుగుణంగా మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకోవచ్చు.

ఒక‌టి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్న‌వారికి కూడా ఆర్‌బీఐ తాజా నియమం ఉపయోగకరంగా ఉంటుంది. రెండు క్రెడిట్ కార్డులు ఉన్న‌వారికి.. రెండు క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్స్ 4, 5 రోజుల వ్య‌వ‌ధిలో ఒకేసారి వ‌స్తుంటే పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు. పైగా 2, 3 రోజుల వ్య‌వ‌ధిలో రెండు కార్డుల బిల్లులు చెల్లించాలి కాబ‌ట్టి చెల్లింపులు భారం అవుతాయి. అలా కాకుండా.. వేరు వేరు నెల్ల‌లో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే విధంగా బిల్లింగ్ సైకిల్‌ను మార్పు చేసుకుంటే ఎక్కువ వ‌డ్డీ ర‌హిత కాల‌వ్య‌వ‌ధిని పొంద‌వ‌చ్చు. అలాగే, సుల‌భంగా కార్డు బిల్లు చెల్లించ‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని