Credit card: క్రెడిట్‌ కార్డుల కొనుగోళ్లు రూ.లక్ష కోట్లపైనే.. ఇ-కామర్స్‌దే మెజారిటీ వాటా!

Credit card spends: దేశంలో క్రెడిట్‌ కార్డులు ఉపయోగించి చేసే ఖర్చు వరుసగా 11వ నెలా రూ.1లక్ష కోట్లు దాటింది. జనవరిలో 1.28 లక్షలుగా నమోదైంది.

Published : 28 Feb 2023 21:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో క్రెడిట్‌ కార్డుల (Credit cards) వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే ఖర్చు సింపుల్‌గా  నెలకు రూ.1 లక్ష కోట్లు దాటేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఈ విలువ ఏకంగా రూ.1.28 లక్షల కోట్లుగా నమోదైంది. రూ.లక్ష కోట్లు పైబడి కొనుగోళ్లు నమోదు కావడం వరుసగా ఇది 11వ నెల కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్‌బీఐ (RBI) తాజాగా డేటా విడుదల చేసింది. 

2022 అక్టోబర్‌లో పండగ సీజన్‌ సమయంలో దేశంలో అత్యధికంగా రూ.1.29 లక్షల కోట్ల మేర క్రెడిట్‌ కార్డుల ద్వారా ఖర్చు చేశారు. డిసెంబర్‌లో ఆ విలువ రూ.1.26 లక్షలుగా నమోదైంది. జనవరిలో ఈ మొత్తం 1 శాతం పెరిగి రూ.1.28 లక్షల కోట్లకు చేరింది. జనవరి నెలలో జరిగిన మొత్తం ఖర్చులో ఇ-కామర్స్‌ వాటానే 61 శాతంగా ఉందని ఆర్‌బీఐ తెలిపింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద 38 శాతం జరగ్గా.. మిగిలిన వాటా ఇతర రూపాల్లో జరిగిందని పేర్కొంది. మొత్తం ఖర్చులో ఎక్కువ ట్రావెల్‌, టూరిజం, షాపింగ్‌కు సంబంధించినవే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే ఖర్చుల విషయంలో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ వృద్ధిని నమోదు చేయగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాత్రం 1.3 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే, మార్కెట్‌ వాటా పరంగా మాత్రం ఆ బ్యాంక్‌దే పైచేయి. మొత్తం ఖర్చులో హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ 28 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉండగా.. 19 శాతం వాటాతో ఎస్‌బీఐ రెండో స్థానంలో నిలిచింది. ఇక కొత్త కార్డుల విషయానికొస్తే.. జనవరిలో 12.6 లక్షల కొత్త కార్డులు జారీ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కార్డుల సంఖ్య 8.2 కోట్లకు చేరింది. ఇందులో ఎస్‌బీఐ అత్యధికంగా 3.3 లక్షల క్రెడిట్‌ కార్డులు జారీ చేయగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.2 లక్షలు, యాక్సిస్‌ 1.4 లక్షలు, ఐసీఐసీఐ 1.3 లక్షల కార్డులను జారీ చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని