Credit Card: క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో చూడాల్సిన 10 ముఖ్య‌మైన అంశాలు

క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ అనేది మీ క్రెడిట్ కార్డు వినియోగానికి సంబంధించిన వివ‌రణాత్మ‌క ప్ర‌తి. 

Published : 30 Jan 2022 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే.. ప్రతి నెలా దానికి సంబంధించిన‌ ఒక స్టేట్‌మెంట్ వ‌స్తుంటుంది. ఈ-మెయిల్ ద్వారా గానీ, కొరియ‌ర్ ద్వారా గానీ, కొన్ని సార్లు రెండు విధానాలోనూ ఈస్టేట్‌మెంట్ మీకు చేరుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ స్టేట్‌మెంట్ చూడొచ్చు. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అనేది మీ కార్డు వినియోగానికి సంబంధించిన‌ వివరణాత్మక ప్ర‌తి. ఇందులో మీరు బిల్లింగ్ కాలవ్య‌వ‌ధిలో చేసిన‌ కొనుగోళ్లు, చెల్లింపులు, క్రెడిట్ బ్యాలెన్స్, రివార్డ్ పాయింట్లు మొదలైనవన్నీ ఉంటాయి. పూర్తి వివ‌రాలు కోసం స్టేట్‌మెంట్ మొత్తాన్ని చ‌ద‌వాల్సి ఉంటుంది. కాని కొంత మంది స్టేట్‌మెంట్ చ‌దివేందుకు ఆస‌క్తి చూప‌రు. చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని చూసుకుని పక్కన పెట్టేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏదైనా లావాదేవీ త‌ప్పుగా న‌మోదైతే అంతిమంగా న‌ష్ట‌పోయేది మీరే అవుతారు. అందువ‌ల్ల నెల‌వారీ క్రెడిట్ స్టేట్‌మెంటును జాగ్ర‌త్త‌గా త‌నిఖీ చేయాలి. ఏమైనా త‌ప్పులు ఉంటే వెంట‌నే బ్యాంకును సంప్ర‌దించి స‌రిచేసుకోవ‌చ్చు.

ప‌రిశీలించాల్సిన 10 అంశాలు..

  • స్టేట్‌మెంట్‌ గడువు తేదీ: చెల్లింపు గడువు తేదీ, స్టేట్‌మెంట్ గ‌డువు తేదీతో అయోమయం చెందకూడదు. స్టేట్‌మెంట్ గడువు తేదీ అంటే మీ స్టేట్‌మెంట్ జ‌న‌రేట్ అయిన‌ తేదీ మాత్రమే. దీని ద్వారా స్టేట్‌మెంట్ ఎప్పుడు జ‌న‌రేట్ అయ్యింది.. బిల్లింగ్ సైకిల్ ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌వుతుంది అనే విష‌యాలు తెలుస్తాయి.
  • చెల్లింపు గడువు తేదీ: ఇది బకాయి మొత్తాన్ని కార్డ్ జారీచేసే సంస్థకు జమ చేయవలసిన తేదీ. మీరు చెక్ ద్వారా మొత్తాన్ని పరిష్కరిస్తుంటే, క్లియరెన్స్ కోసం 2-3 రోజులు పట్టొచ్చని గుర్తుంచుకోండి.
  • గ్రేస్ పీరియడ్: చెల్లింపు గడువు తేదీ త‌ర్వాత‌ మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్ త‌ర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే.. చెల్లించాల్సిన‌ మొత్తంపై ఆల‌స్యం చెల్లింపు కింద‌ వ‌డ్డీని లెక్కిస్తారు. ఇది తదుపరి స్టేట్‌మెంట్‌లో క‌నిపిస్తుంది. అయితే కొన్ని క్రెడిట్ కార్డ్ సంస్థ‌లు 20 నుంచి 25 రోజులు కూడా గ్రేస్ పీరియ‌డ్ ఇస్తున్నాయి.
  • చెల్లించాల్సిన మొత్తం: మునుపటి నెలలో ఖర్చు చేసింది మాత్రమే కాకుండా, వర్తించే వడ్డీ లేదా ఆలస్యంగా చెల్లించే ఛార్జీలు, మునుపటి బిల్లులో చెల్లించాల్సిన మొత్తం, సేవా ఛార్జీలు, ఓవర్‌డ్రాన్ ఫీజు, లావాదేవీల రుసుము, నగదు ముందస్తు ఛార్జీలు, మీ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము, ఇవ‌న్నీ క‌లిపి చెల్లించాల్సిన మొత్తం అవుతుంది.
  • చెల్లించాల్సిన కనీస మొత్తం: బిల్లు మొత్తం చెల్లింలేని స్థితిలో మినిమ‌మ్ డ్యూ మొత్తాన్ని చెల్లించి ఆల‌స్య ఫీజుల‌ను నివారించ‌వ‌చ్చు. ఇది సాధార‌ణంగా చెల్లించాల్సిన మొత్తంలో 5 శాతం ఉంటుంది. కనీస మొత్తాన్ని చెల్లించినప్పటికీ, బ‌కాయి ఉన్న పూర్తి బిల్లు చెల్లించేవ‌ర‌కు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. క‌నీస చెల్లింపు కేవ‌లం ఆల‌స్య రుస‌ము ప‌డ‌కుండా మాత్ర‌మే ఆపుతుంది.
  • బిల్లింగ్ సైకిల్: ఇది వరుసగా రెండు స్టేట్‌మెంట్ తేదీల మధ్య కాలం. సాధారణంగా బిల్లింగ్ సైకిల్ 30 రోజుల వ్యవధిని కలిగి ఉంటుంది. ఆ 30 రోజులలో చేసిన లావాదేవీలన్నీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ప్రతిబింబిస్తాయి. బిల్లింగ్ సైకిల్ అందిరికీ ఒకేలా ఉండ‌దు. మీకు కార్డు జారీ చేసిన సంస్థ‌పై ఇది ఆధార‌ప‌డి ఉంటుంది.
  • లావాదేవీల వివరాలు: స్టోర్‌లో, ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డును ఉపయోగించి చేసిన అన్ని లావాదేవీలు.. నిర్వ‌హించిన‌ తేదీ, లావాదేవీ విలువతో స‌హా పూర్తి వివ‌రాలు ఈ జాబితాలో ఉంటాయి. ఏమీ తప్పు లేదని నిర్ధారించడానికి వీటిని జాగ్ర‌త్త‌గా చూడ‌టం ముఖ్యం. ఒక నెల‌లో క్రెడిట్ కార్డును ఉప‌యోగించి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో ఈ వివ‌రాలను ప‌రిశీలించి తెలుసుకోవ‌చ్చు. మీ ఖర్చు అలవాట్లను విశ్లేషించుకొని, దీర్ఘకాలంలో ఎక్కువ పొదుపు చేసేందుకు, త‌క్కువ ఖ‌ర్చు చేసేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది.
  • క్రెడిట్ పరిమితి: ఇది మీ క్రెడిట్ కార్డుపై బ్యాంక్ నిర్ణయించిన పరిమితి, కార్డుపై ఖర్చు చేసేందుకు మీకు అనుమ‌తి ఉన్న‌ మొత్తం. క్రెడిట్ పరిమితిని ఎప్పటికప్పుడు సవరించవచ్చు.
  • రివార్డ్ పాయింట్లు: క్రెడిట్ కార్డుల ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఈ రివార్డ్ పాయింట్లు. వీటికి కొంత గ‌డువు ఉంటుంది. గ‌డువులోగా రిడీమ్ చేసుకోక‌పోతే పాయింట్లు ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల వీటిని గ‌డ‌వుకు ముందే రిడీమ్ చేసుకోవాలి. వీటిని స‌రిగా ఉపయోగించినట్లయితే గణనీయమైన ప్ర‌యోజ‌నాల‌ను పొందొవ‌చ్చు.
  • ఇత‌ర‌ ముఖ్య సమాచారం: వడ్డీ రేట్లు లేదా వినియోగ నిబంధనల్లో ఏవైనా మార్పులు చేస్తే ఇక్క‌డ తెలుసుకోవ‌చ్చు. దీన్ని చదవడంతో మీ క్రెడిట్ కార్డును అర్థం చేసుకోవడానికి, తెలివిగా ఉపయోగించేందుకు స్టేట్‌మెంట్ మీకు సహాయపడుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని