Creditcards: క్రెడిట్‌ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? వార్షిక రుసుములు లేని కార్డులివే..!

మొద‌టిసారి క్రెడిట్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వార్షిక రుసుమ‌లు లేని కార్డుల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Updated : 27 Nov 2021 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అవ‌స‌రాలు తీర్చడంలోనూ, వ‌స్తు, సేవ‌ల చెల్లింపులకు అనుకూలంగా ఉన్నందున క్రెడిట్‌కార్డులు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్నాయి. తెలివిగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరు మెరుగుప‌ర్చుకోవ‌చ్చు. ఆఫ‌ర్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డు పాయింట్ల‌ను అందిపుచ్చుకోవచ్చు. అవాంత‌రాలు లేకుండా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మోడ్‌లో లావాదేవీలు చేసేందుకు వీలున్నందున అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా క్రెడిట్ కార్డును ఉప‌యోగించుకోవ‌చ్చు. వినియోగ‌దారుల‌ విభిన్న అవసరాలను తీర్చడానికి అనేక రకాల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. దుస్తులు మొదలుకొని విమాన ప్రయాణ టికెట్ల వరకూ వీటి ద్వారా చెల్లింపులు జరపొచ్చు. కార్డు తీసుకునేముందు వినియోగ‌దారులు వారి అలవాట్లకు, ఖ‌ర్చుల‌కు త‌గిన క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోవాలి. దీనివ‌ల్ల రోజువారీ ఖర్చులపై మరింత ఆదా చేసుకోవచ్చు.

సాధారణంగా క్రెడిట్ కార్డులపై వార్షిక రుస‌ములు ఉంటాయి. ఒక‌వేళ మీరు ఎంచుకున్న కార్డు.. వార్షిక రుసుముల‌ను మించి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటే అటువంటి కార్డుల‌ను ఎంచుకోవ‌చ్చు. ఒక‌వేళ లేక‌పోతే ఖ‌ర్చు ఎక్కువయ్యే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంస్థ‌లు సున్నా వార్షిక రుసుముతో కూడా క్రెడిట్ కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. కార్డుల‌ను ఎక్కువ‌గా వినియోగించ‌ని వారు, మొద‌టిసారి కార్డును తీసుకోదలచిన వారు ఇలాంటి కార్డుల‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఈ కార్డులు కూడా మంచి రివార్డులను అందిస్తాయి. అలాంటి కార్డులేవో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్ పే- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌: ప్ర‌ముఖ ఇ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌, ఐసీఐసీఐ బ్యాంకు భాగ‌స్వామ్యంతో వ‌చ్చిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఇది. ఫ్రీ ఫ‌ర్ లైఫ్ టైమ్ ఫీచ‌ర్‌తో ఈ కార్డు భార‌త్‌లో ప్ర‌సిద్ధి పొందింది.

ఫీచ‌ర్లు..
*
వార్షిక రుసుములు లేవు.

* అమెజాన్‌లో ఎక్కువ‌గా షాపింగ్ చేసే వారికి స‌రిగ్గా స‌రిపోతుంది.

* అన్ని ర‌కాల లావాదేవీల‌ (షాపింగ్‌, డైనింగ్‌, ఇన్సురెన్స్‌, ట్రావెల్ ఖ‌ర్చులు)పై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.

* ఈ కార్డును వినియోగించి చేసే కొనుగోళ్ల‌పై అమెజాన్ ప్రైమ్ క‌స్ట‌మ‌ర్లు 5 శాతం, నాన్-అమెజాన్ ప్రైమ్ స‌భ్యులు 3 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందొచ్చు.

* అమెజాన్‌లో రూ.3 వేలకు మించిన కొనుగోళ్ల‌పై 3 నుంచి 6 నెల‌ల కాలానికి నో-కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తుంది.

* ఇంధ‌న స‌ర్‌ఛార్జ్‌పై 1 శాతం మిన‌హాయింపు పొందొచ్చు.

యాక్సిస్ ఇన్స్టా ఈజీ క్రెడిట్ కార్డ్‌..: యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న వారికి ఈ కార్డును బ్యాంక్ జారీ చేస్తుంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రధాన విలువలో 80 శాతం వరకు క్రెడిట్ పరిమితి ఉంటుంది.

ఫీచ‌ర్లు..
* వార్షిక రుసుములు ఉండ‌వు.

* కార్డు తీసుకున్న మొద‌టి రోజు నుంచి క్రెడిట్ లిమిట్ వ‌ర‌కు 100 శాతం విత్‌డ్రాల‌కు అనుమ‌తిస్తుంది.

* లావాదేవీల తిరిగి చెల్లింపుల‌పై 50 రోజుల వ‌డ్డీ లేని గ్రేస్ పీరియడ్‌ ఉంటుంది.

* ఎంపిక చేసిన భాగ‌స్వామ్య రెస్టారెంట్లలో 15 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

* యాక్సిస్ ‘ఈడీజీఈ’ లాయ‌ల్టీ పాయింట్లు.. దేశీయంగా ప్ర‌తి రూ.200 వ్య‌యంపై 6 రివార్డు పాయింట్లు, అంత‌ర్జాతీయంగా చేసే ప్ర‌తి రూ. 200 వ్య‌యంపై 12 రివార్డు పాయింట్లు, మొద‌టి ఆన్‌లైన్ లావాదేవీపై 100 పాయింట్లు పొందొచ్చు.

*  రూ.2500 మించిన కొనుగోళ్ల‌ను ఈఎంఐగా మార్చుకోవ‌చ్చు.

హెచ్ఎస్‌బీసీ వీసా ప్లాటిన‌మ్ క్రెడిట్ కార్డ్‌: ఈ కార్డ్‌, షాపింగ్‌, డైనింగ్‌, ఫ్యూయ‌ల్ కొన‌గోళ్ల‌కు స‌రిపోతుంది. ఉద్యోగులకు మాత్ర‌మే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. క‌నీసం రూ.4 ల‌క్ష‌ల వార్షిక ఆదాయం ఉండాలి. రివార్డు పాయింట్లతో పాటు ఇత‌ర ప్రీమియం సేవ‌ల‌ను పొందొచ్చు.

ఫీచ‌ర్లు..
*  వార్షిక రుసుములు లేవు.

* వార్షిక ఇంధ‌న స‌ర్‌ఛార్జీల‌పై గ‌రిష్ఠంగా రూ.3000 వ‌ర‌కు ఆదా చేసుకోవ‌చ్చు. రూ.400 నుంచి రూ.4000 వ‌ర‌కు చేసే లావాదేవీల‌పై ప్ర‌తినెలా గ‌రిష్ఠంగా రూ.250 వ‌ర‌కు స‌ర్‌ఛార్జీ ర‌ద్దు ప్ర‌యోజ‌నం పొందొచ్చు.

* జాతీయ‌, అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల‌లో 3 సార్లు కాంప్లిమెంట‌రీ లాంజ్ సదుపాయం పొందొచ్చు.

* బుక్ మై షోలో సినిమా టికెట్లపై ఆఫర్లు పొందొచ్చు.

ఐసీఐసీఐ ప్లాటిన‌మ్ చిప్ కార్డ్‌: లైఫ్ టైమ్ ఫ్రీ స‌దుపాయంతో వ‌స్తుంది. కొత్త‌గా క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది.
ఫీచ‌ర్లు..
* వార్షి రుసుములు వ‌ర్తించ‌వు.

* వినియోగ వ‌స్తువులు, బీమా చెల్లింపుల‌పై ప్ర‌తి రూ.100కి 1 పేబ్యాక్ పాయింట్ వ‌స్తుంది. రిటైల్‌గా చేసే రూ.100 వ్య‌యంపై 2 పే బ్యాక్ పాయింట్ల‌ను పొందొచ్చు. ఇంధ‌న లావాదేవీల‌పై పేబ్యాక్ పాయింట్లు ల‌భించ‌వు.

* పేబ్యాక్ పాయింట్ల‌కు బ‌దులు మూవీ, ట్రావెల్ ఓచ‌ర్లు తీసుకోవ‌చ్చు. లేదా జీవ‌న శైలి ఉత్ప‌త్తులను కొనుగోలు చేయొచ్చు.

* దేశ‌వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో రూ.2500 మించిన బిల్లులపై 15 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది.

* హిందూస్థాన్ పెట్రోల్ పంపుల్లో ఇంధ‌న స‌ర్‌ఛార్జ్‌పై 1 శాతం త‌గ్గింపు పొందొచ్చు. అయితే ఈ ప్ర‌యోజ‌నం పొందేందుకు ఖ‌ర్చు రూ.4 వేల కంటే త‌క్కువ ఉండాలి.

కొటాక్ గోల్డ్ ఫార్చ్యూన్‌ క్రెడిట్ కార్డ్‌: ఈ కార్డు వ్యాపారం చేసే య‌జ‌మానుల‌కు మాత్రమే. క‌నీస వార్షిక ఆదాయం రూ.3 లక్ష‌ల‌కు మించి ఉండాలి. వార్షికంగా రూ.1.5 ల‌క్ష‌ల‌కు మించి చేసే వ్య‌యంపై పీవీఆర్ మూవీ టికెట్లు, ఇంధ‌న స‌ర్‌ఛార్జ్ ర‌ద్దు వంటి ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

క్రెడిట్ కార్డు కోసం ద‌రఖాస్తు చేసే వారు చెల్లింపుల ప‌ట్ల క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించాలి. క్రెడిట్ కార్డులో నిర్దిష్ట వ‌డ్డీ ర‌హిత కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. ఈ వ్య‌వ‌ధి లోపుగా బిల్లు చెల్లిస్తే ఎలాంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. కార్డు ఉన్న‌ప్పుడు సామ‌ర్థ్యానికి మించి ఖ‌ర్చు చేసే అవ‌కావం ఉంటుంది. దీంతో ఒక్కోసారి సకాలంలో బిల్లు చెల్లించ‌లేక‌పోవ‌చ్చు. గ‌డువు మించితే వ‌ర్తించే ఛార్జీలు వార్షికంగా 28 నుంచి 49 శాతం వ‌ర‌కు ఉంటాయి. అందువ‌ల్ల స‌కాలంలో బిల్లు చెల్లించాలి. మొద‌టిసారి కార్డు తీసుకున్న వారు మీ అవ‌స‌రానికి త‌గిన.. వార్షిక నిర్వ‌హ‌ణ రుసుములు వ‌ర్తించ‌ని కార్డుల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని