రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

మ‌నం ఎవ‌రికైనా రుణం ఇవ్వాల్సివ‌చ్చిన‌పుడు మ‌ళ్లీ అత‌ను తిరిగి ఇస్తాడా? లేదా? అనేది ముందుగా ఆలోచించుకుంటాం. ఆ వ్య‌క్తితో ఉన్న ప‌రిచ‌యం బట్టి ఈ విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది.....

Published : 16 Dec 2020 11:18 IST

బాండ్ల‌ను జారీ చేసే సంస్థ‌ను విశ్లేషించి దాని విశ్వ‌స‌నీయ‌త‌ను అంచ‌నా వేసేవి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. మ‌దుప‌ర్లు బాండ్ల‌ను కొనేముందు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు విడుద‌ల చేసే నివేదిక‌ల ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

మ‌నం ఎవ‌రికైనా రుణం ఇవ్వాల్సివ‌చ్చిన‌పుడు మ‌ళ్లీ అత‌ను తిరిగి ఇస్తాడా? లేదా? అనేది ముందుగా ఆలోచించుకుంటాం. ఆ వ్య‌క్తితో ఉన్న ప‌రిచ‌యం బట్టి ఈ విష‌యం మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. రుణం తీసుకునే వ్య‌క్తి తిరిగి చెల్లించ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కం ఉంటేనే రుణం ఇస్తాం. వ్య‌క్తుల‌కు సంబంధించిన‌ వ‌ర‌కు మ‌నం అంచ‌నా వేసుకోగ‌లం కానీ ఒక కంపెనీ బాండ్లో మ‌దుపుచేయ‌డం అంటే రుణం ఇవ్వ‌డ‌మే. ఆ విధంగా బాండ్ల‌లో మ‌దుపు చేసిన‌పుడు ఆయా కంపెనీలు తిరిగిచెల్లిస్తాయో లేదో ఎలా తెలుస్తుంది? ఈ ప్ర‌శ్న‌కు జ‌వాబు తెలుసుకునేందుకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

పెట్టుబ‌డి సాధ‌నం ఇచ్చే రాబ‌డి దాని (న‌ష్ట‌భ‌యం) రిస్క్ పై ఆధార‌ప‌డి ఉంటుంది. త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న సాధ‌నాలు త‌క్కువ‌ ఇస్తాయి. ఎక్కువ రిస్క్ ఉన్న సాధ‌నాలు ఎక్కువ రాబ‌డిని ఇస్తాయి.

మ‌రి ఆ రిస్క్ ను తెలుసుకోవ‌డం ఎలా?

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పెట్టుబ‌డి సాధ‌నాల విశ్వ‌నీయ‌త‌ను అంచనా వేసి నివేదిక‌లు ప్ర‌చురిస్తాయి… వాటి ద్వారా బాండు లేదా ఆ పెట్టుబ‌డి సాధ‌నం రేటింగ్ తెలుసుకోవ‌చ్చు.
సాధార‌ణంగా కింది పెట్టుబ‌డి సాధ‌నాల‌కు రేటింగ్ లు ఇస్తుంటాయి. అవి …

  • బాండ్లు లేదా డిబెంచ‌ర్లు
  • వాణిజ్య ప‌త్రాలు
  • స్ట్ర‌క్చ‌ర‌డ్ ఫైనాన్స్ సాధ‌నాలు
  • బ్యాంకు రుణాలు
  • ఫిక్సెడ్ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్ స‌ర్టిఫికెట్లు
  • డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు
  • ఇనీషియల్ ప‌బ్లిక్ ఆఫర్లు (ఐపీఓ)

క్రెడిట్ రేటింగుల‌ 'గ్రేడ్’లు

క్రెడిట్ రేటింగు ఏజెన్సీలు క్రెడిట్ రేటింగుల‌ను 'గ్రేడ్’ల రూపంలో తెలుపుతాయి. ఈ గ్రేడ్లను సూచించే విధానం ఒక్కో ఏజెన్సీకి ఒక్కో విధంగా ఉంటుంది. వీటి ఆధారంగా స‌ద‌రు పెట్టుబ‌డి సాధ‌నం ఏ మాత్రం రిస్క్ ఉంద‌నేది తెలుసుకోవ‌చ్చు.

క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చే గ్రేడింగులు

**‘AAA’ ‘AA’ ‘A’ ‘BBB’ ‘BB’ ‘B’ ‘C’ ‘D’ ** ల‌తో సూచిస్తుంది. ఉత్త‌మ రేటింగు నుంచి త‌క్కువ రేటింగ్ కు వ‌రుస‌గా…

‘AAA’ గ్రేడ్ ఇష్యూ అత్యుత్త‌మమైంద‌ని తెలుపుతుంది .

‘AA’ గ్రేడ్ ఇష్యూ ఉత్త‌మమైంద‌ని తెలుపుతుంది.

‘A’ గ్రేడ్ ఇష్యూ ఉత్త‌మమైందే గానీ పై వాటి కంటే కొంచెం త‌క్కువ‌గా ప‌రిగ‌ణించాలి.

‘BBB’ గ్రేడ్ ఇష్యూపై మోస్త‌రు న‌మ్మ‌కాన్ని సూచిస్తుంది.

‘BB’ గ్రేడ్ ఇష్యూపై త‌క్కువ న‌మ్మ‌కాన్ని సూచిస్తుంది.

'B ’ గ్రేడ్ ఇష్యూను న‌మ్మేందుకు అవ‌కాశం త‌క్కవని సూచిస్తుంది.

‘C’ గ్రేడ్ ఇష్యూపై న‌మ్మ‌కం లేదు.

‘D’ డీఫాల్ట్ అయ్యేందుకు అవ‌కాశాన్ని సూచించే గ్రేడింగ్‌

RATING-AGENCIES.jpg

ఈ విధంగానే ప‌లు క్రెడిట్‌ రేటింగ్ ఏజెన్సీలు వివిధ ర‌కాల గుర్తుల‌తో గ్రేడింగ్ ల‌ను ఇస్తుంటాయి. స‌ద‌రు రేటింగ్ సంస్థ ఇచ్చే రేటింగ్ గుర్తుకు స‌రిపోయే అర్థాన్ని ఆ నివేదిక‌లో తెలియ‌జేస్తారు.

బాండ్ ఇష్యూ చేసే కంపెనీ త‌ప్ప‌నిస‌రిగా రేటింగ్ నివేదిక‌ను క్రెడిట్ రేటింగు ఏజెన్సీనుంచి పొంది మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉంచాలి. ఈ నిబంధ‌న పాటించేందుకు కంపెనీ వారే స్వ‌యంగా ఏజెన్సీని సంప్ర‌దించి బాండ్ ఇష్యూకి రేటింగ్ తీసుకుంటారు. కంపెనీ ఇష్యూని విశ్లేషించాక రేటింగ్ ఏజెన్సీలు గ్రేడ్ ను ప్ర‌క‌టిస్తాయి. రేటింగ్ ఏజెన్సీలు స్వ‌చ్ఛందంగా కూడా కొన్నింటికి రేటింగ్ ఇస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని