Credit Suisse: క్రెడిట్‌ సూయిజ్‌ మనుగడ ‘భారత బ్యాంకింగ్‌’కు కీలకమే: జెఫరీస్‌

ఐరోపాలో సంక్షోభం ఎదుర్కొంటున్న క్రెడిట్‌ సూయిజ్‌ మనుగడ భారత బ్యాంకింగ్‌ వ్యవస్థకు కీలకమని జెఫరీస్‌ తెలిపింది. ఎస్‌వీబీతో పోలిస్తే భారత బ్యాంకులపై దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది.

Updated : 16 Mar 2023 20:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌ అయిన ‘సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB)’ పతనం ప్రభావం భారత బ్యాంకింగ్‌ వ్యవస్థపై పెద్దగా ఉండబోదని పలు ఆర్థిక సంస్థలు, నిపుణులు తెలిపారు. అయితే, తాజాగా కలవరుస్తోన్న క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) ప్రభావం మాత్రం ఎస్‌వీబీతో పోలిస్తే భారత బ్యాంక్‌లపై ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘జెఫరీస్‌ ఇండియా’ తెలిపింది. క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) మనుగడ మన దేశ బ్యాంకులకు కీలకమేనని పేర్కొంది.

భారత డెరైవేటివ్‌ మార్కెట్లలో క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) కార్యకలాపాలు బలంగా ఉన్నట్లు జెఫరీస్‌ విశ్లేషకుడు ప్రఖార్‌ శర్మ తెలిపారు. ఈ బ్యాంకు పతనం కావడం వల్ల ద్రవ్య లభ్యత సమస్య తలెత్తొచ్చని పేర్కొన్నారు. అలాగే వివిధ కంపెనీలు తమ చెల్లింపులను గడువులోగా పూర్తి చేయకపోవచ్చునని వెల్లడించారు. విదేశీ బ్యాంకులు తమ ఆస్తుల్లో 4-6 శాతం మాత్రమే భారత్‌లో కలిగి ఉన్నాయని జెఫరీస్‌ తెలిపింది. అయితే, బ్యాలెన్స్‌ షీట్‌ పరిధిలోకి రాని రుణాలు మాత్రం సగం మన దేశంలోనే ఉన్నాయని పేర్కొంది.

జెఫరీస్‌ అంచనాల ప్రకారం.. భారత్‌లో క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)కు 2.4 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. దీంతో దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12వ అతిపెద్ద విదేశీ బ్యాంకు ఇది. ఈ బ్యాంకు మన దేశంలో ఇచ్చిన రుణాల్లో 73 శాతం స్వల్పకాలిక వ్యవధితో కూడినవే. ఈ నేపథ్యంలో ద్రవ్యలభ్యత, నిర్దిష్ట గడువులోగా చేయాల్సిన వివిధ కంపెనీల చెల్లింపులను ఆర్‌బీఐ నిరంతం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రఖార్‌ శర్మ తెలిపారు. అవసరమైతే జోక్యం చేసుకోవాలని కోరారు.

భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ ఆస్తుల్లో విదేశీ బ్యాంకుల వాటా 6 శాతం. దీంట్లో క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse)దే 1.5 శాతం వాటా. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ సూయిజ్‌ ప్రభావం తప్పదని జెఫరీస్‌ అంచనా వేస్తోంది. క్రెడిట్‌ సూయిజ్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు వచ్చిన ఊహాగానాలను, ఆ సంస్థలో అతిపెద్ద వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీకి నిధుల కొరత తప్పదన్న అంచనాల మధ్య బుధవారం క్రెడిట్‌ సూయిజ్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. స్విస్‌ ఎక్స్ఛేంజీలో (ఎస్‌ఐఎక్స్‌) ఈ సంస్థ షేరు 27% నష్టపోయి రికార్డు కనిష్ఠానికి దిగివచ్చాయి. 2021 ఫిబ్రవరి నాటి స్థాయితో పోలిస్తే, ప్రస్తుతం షేరు విలువ 85% క్షీణించింది.

అయితే, స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి తాము దాదాపు 54 బిలియన్‌ డాలర్ల నిధులను రుణ రూపంలో సమకూర్చుకోనున్నామని క్రెడిట్‌ సూయిజ్‌ గురువారం ప్రకటించింది. దీనికి సెంట్రల్‌ బ్యాంక్ సైతం అంగీకరించిందని తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి కంపెనీ షేరు గురువారం పుంజుకుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్‌ఐఎక్స్‌లో కంపెనీ షేరు 23 శాతానికి పైగా లాభంతో ట్రేడవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు