క్రెడిట్‌ సూయిజ్‌ షేర్లు ఢమాల్‌.. బ్యాంకింగ్‌ షేర్లపై మరోసారి ఒత్తిడి

క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో అమెరికా మార్కెట్లపైనా ప్రభావం పడింది.

Published : 15 Mar 2023 20:40 IST

జెనీవా: బ్యాంకింగ్‌ రంగంలో మరో కుదుపు. స్విట్జర్లాండ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజ్‌ (Credit Suisse) షేర్లు యూరోపియన్‌ మార్కెట్లలో భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌ మొత్తం విలువలో నాలుగో వంతు ఒక్కరోజే కోల్పోయింది. క్రెడిట్‌ సూయిజ్‌ స్టాక్‌ పతనంతో యూరోపియన్‌ మార్కెట్లలో ఇతర బ్యాంకింగ్‌ షేర్లు సైతం భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావం అటు అమెరికా మార్కెట్లనూ తాకింది.

క్రెడిట్‌ సూయిజ్‌లో ప్రధాన వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ అమ్మర్‌ అల్‌ కుదైరీ ప్రముఖ వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెగ్యులేటరీ ఇబ్బందుల కారణంగా క్రెడిట్‌ సూయిజ్‌లో పెట్టుబడి పెట్టబోమని పేర్కొన్నారు. దీంతో క్రెడిట్‌ సూయిజ్‌ స్టాక్‌ ధర దాదాపు 27 శాతం మేర పతనమై 1.6 స్విస్‌ ఫ్రాంక్స్‌కు చేరింది. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ షేరు 85 శాతం మేర పతనం అయ్యింది. ఈ పతనం ఒక్క క్రెడిట్‌ సూయిజ్‌కే పరిమితం కాలేదు. యూరోపియన్‌ మార్కెట్లలో ఇతర బ్యాంకులపైనా పడింది. బ్యాంకింగ్‌ సెక్టార్‌పై నెలకొన్న భయాందోళనల కారణంగా ఫ్రాన్స్‌కు చెందిన సొసైట్‌ జనరల్‌ ఎస్‌ఏ 12 శాతం, బీఎన్‌పీ పారిబాస్‌ 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ 8 శాతం, బ్రిటన్‌కు చెందిన బార్‌క్లేస్‌ బ్యాంక్‌ 8 శాతం చొప్పున నష్టపోయాయి.

అమెరికా మార్కెట్లకూ సెగ

అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంకులు దివాలా తీయడంతో ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగంపై మదుపరుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పడిప్పుడే కోలుకుంటుందన్న తరుణంలో క్రెడిట్ సూయిజ్‌ స్టాక్‌ పతనం కావడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రభావంతో యూరోపియన్‌ మార్కెట్లు సహా అమెరికా మార్కెట్లపై పడింది. బుధవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.4 శాతం నష్టపోగా.. డోజోన్స్‌, నాస్‌డాక్‌ సైతం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని