cr7: క్రిస్టియానో.. 2 బాటిళ్లు..రూ.29 వేలకోట్లు..!
ఓ ఛాంప్ ఎంత విలువైనవాడో తెలిపిన ఘటన
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
‘మంచి నీళ్లు తాగండి’ అని ఒక స్పోర్ట్స్ ఛాంపియన్ యథాలాపంగా చెప్పిన మాటతో ఓ దిగ్గజ కంపెనీ మార్కెట్ విలువ రూ.29 వేల కోట్ల మేరకు ఆవిరైపోయింది. ఇంటర్నెట్‌లో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ ఛాంపియన్ అదే రోజు చరిత్రలో నిలిచిపోయే అరుదైన రికార్డు సాధించాడు. కానీ.. పతాక శీర్షికల్లో ఉండాల్సిన ఆ వార్త ఈ వివాదం దెబ్బకు ఎక్కడో మరుగున పడిపోయింది. ఇంతకీ ఆ ఛాంపియన్ ఎవరంటారా..? అభిమానులు సీఆర్7 అని ముద్దుగా పిలుచుకొనే క్రిస్టియానో రొనాల్డో..! ఇక ఆ బాధిత కంపెనీ కోకకోలా..!!
నిన్న యూఈఎఫ్‌ఏ యూరో 2020 మ్యాచ్‌కు ముందు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో పోర్చ్‌గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో, జట్టు మేనేజర్ ఫెర్నాండో సాంటోస్ పాల్గొన్నారు. ప్రెస్‌మీట్ ఏర్పాట్లలో భాగంగా టోర్ని స్పాన్సర్ అయిన కోకకోలాకు చెందిన రెండు కూల్‌డ్రింక్ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. సాధారణంగా ఫిట్‌నెస్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండే రొనాల్డో ఏమనుకున్నాడో ఏమో కానీ.. ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్‌బాటిల్‌ను అందుకొని ‘మంచి నీళ్లు తాగండి’ అని వ్యాఖ్యానించాడు.
రొనాల్డో చాలా సాధారణంగానే ఈ వ్యాఖ్య చేసినా.. కోకకోలా షేర్లపై అది ప్రతికూల ప్రభావం చూపింది. స్టాక్‌మార్కెట్లో ఆ షేరు విలువ 1.6శాతం పడిపోయింది. దీంతో కోకకోలా మార్కెట్ విలువ 242 బిలియన్ డాలర్ల నుంచి 238 బిలియన్ డాలర్లకు కుంగింది. అంటే దాదాపు రూ.29 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయిందన్నమాట. ఈ టోర్ని స్పాన్సర్లలో కోకకోలా కూడా ఒకటి.
వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన కోకకోలా ‘ప్రతి ఒక్కరికి నచ్చిన డ్రింక్‌ను ఎంచుకునే హక్కు ఉంటుంది’ అని పేర్కొంది. ఈ ఘటన తర్వాత క్రిస్టియానో రొనాల్డో 2006లో చేసిన కోకకోలా వాణిజ్య ప్రకటన ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 2006 జర్మనీలో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా ఆ యాడ్‌ను తయారు చేశారు. అప్పట్లో రొనాల్డ్ ఈ యాడ్ కోసం భారీ మొత్తం తీసుకొన్నారు. ఎంత అనేది కచ్చితంగా తెలియకపోయినా.. ఆ ఏడాది 12 మిలియన్ డాలర్లు విలువ చేసే వాణిజ్య ప్రకటనలపై సంతకం చేసినట్లు ‘ది గార్డియన్’ పత్రిక 2009లో పేర్కొంది.
ఇక మంగళవారం హంగేరితో జరిగిన మ్యాచ్‌లో క్రిస్టియానో రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతేకాదు యూరో టోర్నిలో అత్యధిక గోల్స్ చేసిన మిచెల్ ప్లాటనీని దాటేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
బిడ్డపై ప్రేమతోనా..?
క్రిస్టియానో రొనాల్డో తన చిన్న కుమారుడి ఆహారం విషయంలో ఆందోళన పడుతున్నట్లు సమాచారం. అతడిని కూడా ఫుట్‌బాలర్ చేయాలని భావిస్తున్నాడు. గతేడాది ‘గ్లోబల్ సాకర్ అవార్డ్స్’ వేడుకలో మాట్లాడుతూ..‘’ నా కుమారుడు ఫుట్‌బాలర్ అవుతాడో లేదో చూద్దాం. కొన్ని సార్లు అతడు కోక్ తాగుతాడు.. వేపుడు పదార్థాలు తింటూ నాకు చిరాకు తెప్పిస్తాడు. నాకు కోపం వస్తున్న విషయం అతనికి తెలుసు. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తాక.. చల్లటి నీటిలో మునుగు అని చెబితే.. ‘నాన్న నీళ్లు మరీ చల్లగా ఉన్నాయి అంటాడు’. సరేకానీ, అతడి వయస్సు 10 ఏళ్లే’’ అని పేర్కొన్నాడు. పిల్లల ఫిట్‌నెస్‌పై భయంతోనే అతడు కూల్‌డ్రింక్స్‌ను దూరం పెడుతున్నాడు.
ఫిట్‌నెస్‌కు ప్రతిరూపం రొనాల్డో..!
ఫుట్‌బాల్ ఆషామాషీ క్రీడ కాదు.. దాదాపు 90 నిమిషాలపాటు క్రీడాకారుడు అత్యంత చురుగ్గా ఉండాలి. అందుకే 30 ఏళ్లు దాటిన క్రీడాకారులు రిటైర్మెంట్ బాటపట్టేస్తారు. కానీ, క్రిస్టియానో రొనాల్డో విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఈ సూపర్ స్టార్ వయస్సు పెరిగే కొద్దీ మరింత ఫిట్‌గా తయారవుతున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నిలిచాడు. రికార్డుల్లో మెస్సీ మినహా మరే క్రీడాకారుడు సీఆర్7 దరిదాపుల్లో కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆరు పలకల దేహంతో మైదానంలో రేసుగుర్రాన్ని తలపించేలా పరుగులు తీస్తాడు.
ఆహార నియమాల విషయంలో రొనాల్డో కఠినంగా ఉంటాడు. ప్రతిరోజు ఆరుసార్లు స్వల్పంగా ఆహారం తీసుకుంటాడు. వీటిల్లో పండ్లు,కూరగాయలు, చికెన్ లేదా ఫిష్ (నూనె లేకుండా వండినవి) ఉండేలా జాగ్రత్త పడతాడు. మంచినీటిని ఎక్కువగానే తాగుతాడు. కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఫుట్‌బాల్ డ్రిల్స్ వంటివి వారంలో ఐదు రోజులపాటు సాధన చేస్తాడు. ఒక్కో ట్రైనింగ్ సెషన్ కనీసం మూడు గంటలు ఉంటుంది. నిత్యం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటాడు. అందుకే సీఆర్7 ఫిట్‌నెస్‌ను చూసి కుర్రాళ్లు కూడా కుళ్లుకుంటారు..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- RGUKT: అంధకారంలో బాసర ట్రిపుల్ ఐటీ.. చీకట్లోనే విద్యార్థులు భోజనం!