Updated : 27 Jul 2022 17:19 IST

ITR filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌.. ధ్రువీక‌రించాకే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు ఇంకా నాలుగు రోజుల (చివ‌రి తేది జులై 31) స‌మ‌యం మాత్ర‌మే ఉంది. గ‌డువు తేదీ పెంచే ఆలోచ‌నేదీ లేదని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జులై 31లోపు రిట‌ర్నుల దాఖ‌లు ప్ర‌క్రియ పూర్తి చేయాలి. లేదంటే ఆల‌స్య‌పు రుసుము కింద రూ.5 వేలు చెల్లించాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ‌ మీరు ఇప్ప‌టి వ‌ర‌కు ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోతే.. ఇక తొంద‌ర‌ప‌డ‌క త‌ప్ప‌దు.

ప‌న్ను రిట‌ర్నుల ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ముందుగా నింపిన ఐటీఆర్ ఫారంల‌ను ఆదాయ‌పు ప‌న్ను శాఖ అందిస్తుంది. అయితే ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేముందు ఫారంల‌లో అందించిన స‌మాచారం, ప‌న్ను చెల్లింపుల‌ను ధ్రువీక‌రించుకోవ‌డం ప‌న్ను చెల్లింపుదారుల బాధ్య‌త‌. ప‌న్ను రిట‌ర్నుల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుందని.. స‌మాచారాన్ని నిర్ధారించుకోకుండా ఫైల్ చేయ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి రావ‌చ్చు. ఒక్కోసారి ఆదాయ‌పు ప‌న్ను శాఖ మీ రిట‌ర్నులను తిర‌స్క‌రించ‌వ‌చ్చు. అందువ‌ల్ల ఫైల్ చేసేముందు.. మీ ఐటీ ఫారంలో ముందుగా నింపిన స‌మాచారాన్ని స‌రైన‌దిగా నిర్ధారించుకోండి.

వ్య‌క్తిగ‌త స‌మాచారం: ప‌న్ను చెల్లింపుదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ త‌దిత‌ర వివ‌రాలు పాన్ ఆధారంగా ప్రీ ఫిల్డ్ ఫారంలో పూర్తి చేసి ఉంటాయి. ఇవే కాకుండా నివాస స్థితి వంటి వివ‌రాలు, ఇంత‌కు ముందు సంవ‌త్స‌రం స‌మ‌ర్పించిన ఐటీ ఫారం ఆధారంగా ప్రీ ఫిల్డ్ ఐటీఆర్‌లో ఉంచుతారు. ప‌న్ను చెల్లింపుదారులు ఈ వివ‌రాల‌ను ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. వివ‌రాలు స‌రిగ్గా ఉంటే స‌రే. ఒక‌వేళ లేక‌పోతే అప్‌డేట్ చేసుకోవాలి. 

శాల‌రీ షెడ్యూల్‌: మీరు ప‌నిచేస్తున్న‌ సంస్థ లేదా య‌జ‌మాని పేరు, చిరునామా, టాన్‌, వంటి వివ‌రాలు; మీ సంస్థ అందించిన ఆదాయ‌పు ప‌న్ను స‌మాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా ఐటీ ఫారంలో పూర్తి చేసి వ‌స్తాయి. ఈ వివ‌రాలు ఫారం-16లోని వివ‌రాల‌తో స‌రిపోలాలి. మీ శాల‌రీ బ్రేక‌ప్‌, ప్ర‌స్తుతం ఉన్న స్థానంలో ల‌భించే అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు వంటి వివరాల‌ను మాన్యువల్‌గా నమోదు చేయాలి.

ఇంటి ఆస్తి షెడ్యూల్‌: అద్దె ఆదాయం, గృహ రుణం ఉన్న పన్ను చెల్లింపుదారులు ఇంటి ఆస్తి షెడ్యూల్‌లో వివ‌రాల‌ను అందించాలి. మునుపటి సంవ‌త్స‌రం ఐటీఆర్‌లోని వివ‌రాల ఆధారంగా ఈ షెడ్యూల్ వివ‌రాలు ఉంటాయి. అద్దెదారు టీడీఎస్ మిన‌హాయించి ఉంటే.. అటువంటి సంద‌ర్భంలో మాత్ర‌మే అద్దె ఆదాయం స‌మాచారం ముందుగా పూరించి ఉంటుంది. లేదంటే అద్దె, గృహ రుణం వ‌డ్డీ త‌దిత‌ర వివ‌రాల‌ను ప‌న్ను చెల్లింపుదారులు స్వ‌యంగా న‌మోదు చేయాలి. 

ఇతర మార్గాల నుంచి ఆదాయం ఉన్న‌ప్పుడు: వ‌డ్డీ, డివిండెండ్ వంటి ఆదాయాన్ని ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం’ షెడ్యూల్‌లో నివేదించాలి. బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు అందించిన సమాచారం ఆధారంగా ఈ షెడ్యూల్ ముందస్తు స‌మాచారంతో వ‌స్తుంది. మీరు ఖాతాలో స్వీక‌రించిన లేదా బ్యాంక్ జారీ చేసిన వ‌డ్డీ స‌ర్టిఫికెట్‌ లేదా డివిడెండ్ స‌ర్టిఫికెట్లను ఆధారంగా చేసుకుని ప్రీ ఫిల్డ్ ఫారంలో ఉన్న స‌మాచారాన్ని నిర్ధారించుకోవాలి.

ఛాప్ట‌ర్ VIA కిందికి వ‌చ్చే త‌గ్గింపులు: మునుప‌టి సంవ‌త్స‌రం క్లెయిమ్ చేసిన త‌గ్గింపులు ఆధారంగా, సంస్థ అందించిన వివ‌రాల ఆధారంగా ఈ షెడ్యూలులో స‌మాచారాన్ని ప్రీ ఫిల్ చేస్తారు. ప‌న్ను చెల్లింపుదారులు వారు చేసిన పెట్టుబ‌డులు, చెల్లింపుల ఆధారంగా డిడ‌క్ష‌న్ మొత్తాన్ని నిర్ధారించుకోవాలి.

చివ‌రిగా: ఆదాయం ప‌న్ను శాఖ.. రిట‌ర్నులను సుల‌భ‌త‌రం చేసేందుకు ముందుగానే నింపిన ఐటీఆర్ ఫారంల‌ను ప‌న్ను చెల్లింపుదారుల‌కు అందిస్తుంది. ఆదాయం, టీడీఎస్ వంటి వివ‌రాల‌ను సంబంధిత సంస్థ‌ల వ‌ద్ద నుంచి సేక‌రించి ఐటీఆర్ ఫారంల‌ను పూర్తి చేస్తారు. కాబ‌ట్టి బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌లు వివ‌రాలు అందించ‌డంలో ఎక్క‌డైనా పొర‌పాట్లు జ‌రిగే అవ‌కాశం ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ముందుగా పూర్తిచేసిన ఫారంలలో న‌మోద‌యిన‌ స‌మాచారాన్ని ధ్రువీక‌రించాలి. ఒక‌వేళ ఏమైన త‌ప్పులు లేదా పొర‌పాట్లు ఉన్న‌ట్లు గుర్తిస్తే స‌రిచేసి అప్‌డేట్ చేయ‌డం అవ‌స‌రం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts