Demonetisation: నోట్ల రద్దు తర్వాత 83 శాతం పెరిగిన నగదు చలామణి

నోట్ల రద్దు లక్ష్యాల్లో నగదు చెలామణిని తగ్గింది డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా ఒకటని కేంద్రం ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. అయితే, అది నెరవేరలేదని ఆర్‌బీఐ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

Published : 02 Jan 2023 15:23 IST

దిల్లీ: దేశంలో చలామణిలో ఉన్న నగదుపై పెద్దనోట్ల రద్దు (Demonetisation) ఎలాంటి స్పష్టమైన ప్రభావం చూపలేదని ఆర్‌బీఐ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2016, నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం అప్పటి రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డిసెంబరు 23, 2022 నాటికి చలామణిలో ఉన్న నగదు విలువ (currency in circulation- CIC) 83 శాతం పెరగడం గమనార్హం.

నోట్ల రద్దు సమయానికి ప్రజల వద్ద చలామణిలో ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లు. రద్దు ప్రభావంతో 2017 జనవరి 6 నాటికి అది గణనీయంగా తగ్గి రూ. 9 లక్షల కోట్లకు చేరింది. తిరిగి 2022 డిసెంబరు 22 నాటికి ఆ విలువ రూ. 32.42 లక్షల కోట్లకు పెరిగింది.  2017 జనవరి 6 నాటితో పోలిస్తే 260 శాతం, 2016 నవంబరు 4తో పోలిస్తే చలామణిలో ఉన్న నగదు విలువ 83 శాతం పెరిగింది.

రద్దు వెంటనే 2017 జనవరి 6 నాటికి చలామణిలో ఉన్న నగదు విలువ రూ. 8,99,700 కోట్ల మేర తగ్గింది. దీంతో బ్యాంకుల్లో ద్రవ్య లభ్యత.. ‘క్యాష్‌ రిజర్వ్‌ రేషియో’ 9 శాతానికి తగ్గించడం వల్ల వచ్చే నగదుకు సమానంగా పెరిగింది. ఇది రిజర్వు బ్యాంక్‌ ద్రవ్య నిర్వహణ కార్యకలాపాలకు సవాల్‌గా నిలిచింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న మిగులు వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కోసం ఆర్‌బీఐ ‘రివర్స్‌ రెపో ఆక్షన్స్‌’ వంటి ‘ద్రవ్య సర్దుబాటు సదుపాయాల’ను అమలు చేసింది.

2016 నుంచి.. ఒక్క నోట్లు రద్దయిన ఆ సంవత్సరం తప్ప చలామణిలో ఉన్న నగదు విలువ ఏటా పెరుగుతూనే ఉంది. 2016లో సీఐసీ 20.18 శాతం తగ్గి రూ. 13.10 లక్షల కోట్లకు చేరింది. 2017లో 37.67 శాతం పెరిగి రూ.18.03 లక్షల కోట్లుగా నమోదైంది. అది 2019 చివరి నాటికి రూ. 24.20 లక్షల కోట్లకు పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో ఈ తీర్పును వెలువరించింది. ధర్మాసనంలోని జస్టిస్‌ బి.వి.నాగరత్న మాత్రం నోట్ల రద్దు లక్ష్యాలు ఉన్నతమైనవే అయినప్పటికీ.. దానిని అమలు చేసిన ప్రక్రియ మాత్రం చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాలను గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా పార్లమెంటు చట్టం ద్వారా తీసుకురావాల్సిందని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని