RBI: కరెంట్‌ ఖాతా మిగులు రూ.47,000 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో మన దేశ కరెంట్‌ ఖాతా మిగులు 5.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.47,000 కోట్ల)గా నమోదైంది.

Published : 25 Jun 2024 02:21 IST

జనవరి-మార్చి ఘనత ఇది
సేవల ఎగుమతులు అధికమైనందునే

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో మన దేశ కరెంట్‌ ఖాతా మిగులు 5.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.47,000 కోట్ల)గా నమోదైంది. ఇది జీడీపీలో 0.6 శాతానికి సమానమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం వెల్లడించింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటు 1.3 బి.డాలర్లు (సుమారు రూ. 10,800 కోట్లు) లేదా జీడీపీలో 0.2 శాతంగా ఉంది. 2023 డిసెంబరు త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు 8.7    బి.డాలర్లు (సుమారు రూ.72,200 కోట్లు) లేదా జీడీపీలో 1 శాతంగా నమోదైంది. 

  • 2024 జనవరి-మార్చిలో వస్తువుల వాణిజ్య లోటు 50.9 బి.డాలర్లుగా నమోదైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఇది 52.6 బి.డాలర్లుగా ఉంది.
  • నికర సేవల ఆదాయం 39.1 బి.డాలర్ల నుంచి 42.7 బి.డాలర్లకు పెరిగింది. ఈ విభాగంలో 4.1 శాతం వృద్ధి నమోదు కావడం వల్ల కరెంటు ఖాతా మిగులు ఏర్పడింది. 
  • విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 11.4 బిలియన్‌ డాలర్లు రాగా, అంతక్రితం ఏడాది 1.7 బిలియన్‌ డాలర్లు వెనక్కి వెళ్లాయి. ప్రవాస భారతీయుల డిపాజిట్లు 3.6       బి.డాలర్ల నుంచి 5.4 బి.డాలర్లకు పెరిగాయి. 
  • 2022-23లో భారత్‌లోకి 28 బిలియన్‌ డాలర్ల నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా.. 2023-24లో 9.8 బి.డాలర్లకు తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 5.2 బి.డాలర్ల నుంచి 44.1 బి.డాలర్లకు దూసుకెళ్లాయి.

2023-24లో: పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ కరెంట్‌ ఖాతా లోటు 23.2 బి.డాలర్ల (సుమారు రూ.1.93 లక్షల కోట్లు)కు లేదా జీడీపీలో 0.7 శాతానికి తగ్గింది. 2022-23లో ఇది 67 బి.డాలర్లు (సుమారు రూ.5.56 లక్షల కోట్లు) లేదా జీడీపీలో 2 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని